
న్యూఢిల్లీ: ఈ ఫైనాన్షియల్ ఇయర్ నాలుగో క్వార్టర్లోనే ఎల్‌ఐసీ ఐపీఓ ఉంటుందని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ ఎసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) సెక్రటరీ తుహిన్ కాంత పాండే వెల్లడించారు. ఎల్ఐసీలో 10 % వాటా అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ వాటా అమ్మకం ద్వారా రూ. 10 లక్షల కోట్లు సేకరించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఎల్ఐసీలో 5% వాటా అమ్మితే అది దేశంలోనే అతి పెద్ద ఐపీఓ అవుతుంది. ఇంకో 5 % అంటే మొత్తం 10% అమ్మితే ఎల్‌ఐసీ ప్రపంచంలోనే రెండో పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అవుతుందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ వీలైనంత త్వరగా పూర్తి చేయాలనేదే తమ ఆలోచనని, కాకపోతే ప్రాసెస్‌కి టైము పడుతోందని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎల్ఐసీలో వాటా అమ్ముతామని 2020 ఫిబ్రవరిలోనే ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించారు. కానీ, కరోనా వలన ఎల్‌ఐసీ ఐపీఓ ఆలస్యమయ్యింది. ఇదే ఫైనాన్షియల్ ఇయర్లో మరో ఆరు ప్రభుత్వ రంగ కంపెనీలలోనూ వాటాలు అమ్మాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకున్నట్లు దీపమ్ సెక్రటరీ చెప్పారు. డిసెంబర్–జనవరి కల్లా ఈ కంపెనీలకు ఫైనాన్షియల్ బిడ్లు పిలవనున్నట్లు పేర్కొన్నారు.