టార్గెట్‌ కోటి మంది ఇన్వెస్టర్లు

టార్గెట్‌ కోటి మంది ఇన్వెస్టర్లు

న్యూఢిల్లీ: త్వరలో రాబోయే తన ఐపీఓకు రిటైల్​ ఇన్వెస్టర్ల నుంచి భారీగా డిమాండ్​ ఉంటుందని ఎల్​ఐసీ అంచనా వేస్తోంది. మనదేశంలో ప్రతి ఏడుగురు ఇన్వెస్టర్లలో కనీసం ఒకరైనా ఇన్వెస్ట్​ చేస్తారన్నది ఈ కార్పొరేషన్​ అంచనా. పాలసీ హోల్డర్లు కూడా భారీగా ఇన్వెస్ట్ చేస్తారని భావిస్తోంది. కనీసం కోటి మంది ఇష్యూకు దరఖాస్తు చేయాలని కోరుకుంటోంది. రిటైల్​ పోర్షన్​ ద్వారా రూ.25 వేల కోట్ల వరకు వస్తాయని అంచనా. ఒక్కో షేర్​ లాట్ సైజు రూ.30వేలు–40 వేల మధ్య ఉంటుందని తెలుస్తోంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం భారతదేశంలో 7.38 కోట్ల డీమ్యాట్ ఖాతాదారులు ఉన్నారు.  ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకోవడానికి పాలసీదారులు కూడా డీమాట్​ ఖాతాలు తెరవడంతో మొత్తం డీమ్యాట్ ఖాతాదారుల సంఖ్య ఇప్పటికి దేశంలో ఎనిమిది కోట్లకు చేరుకుందని అంచనా. ఈ కార్పొరేషన్​ తన పాలసీదారుల కోసం 10 శాతం షేర్లను రిజర్వ్​ చేస్తున్నట్టు ఇది వరకే ప్రకటించింది. మార్చి నెలాఖరులోగా ఎల్ఐసీ తన ఐపీఓను ప్రారంభించే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి భారీ రెస్పాన్స్​ వస్తుందని అనుకుంటున్నామని ఐఐఎఫ్​ఎల్​ ఎగ్జిక్యూటివ్​ వైస్​–ప్రెసిడెంట్​ సువజిత్​ రాయ్​ అన్నారు. ఇందుకోసం ఇన్వెస్ట్​మెంట్​ బ్యాంకర్లు, లోకల్​ బ్రోకర్లు, ఏజెంట్లు ప్రచారం చేస్తారని చెప్పారు. గత ఏడాది మార్చి వరకు లెక్కల ప్రకారం ఎల్​ఐసీకి 13.5 లక్షల మంది ఏజెంట్లు, 1.14 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.