
ఈఎస్ఐ మెడికల్ స్కామ్ కేసులో మరో నిందితున్ని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. మాజీ డైరెక్టర్ దేవికారాణితో పాటు కేసులో నిందితులైన అధికారులతో కలిసి కుట్ర చేసిన లైఫ్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ బద్దం సుధాకర్‌రెడ్డిని శనివారం అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది. నకిలీ ఇండెంట్స్, బిల్స్‌తో రూ. వందల కోట్ల స్కామ్ చేశారనే ఆరోపణలతో మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జాయింట్ డైరెక్టర్ కలకుంట్ల పద్మతో పాటు మరో ఆరుగురు నిందితులను ఏసీబీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. లైఫ్ కేర్ డ్రగ్స్ అండ్ సర్జికల్స్, లైఫ్ కేర్ ఫార్మా కంపెనీల నుంచి 8 కోట్ల 25 లక్షల 25 వేల 594 రూపాయల విలువైన మందులను కొన్నట్టు వీళ్లు తప్పుడు లెక్కలు చూపించారు. మరోవైపు జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న దేవికారాణి, పద్మ సహా మరో ఆరుగురిని రెండ్రోజుల ఏసీబీ కస్టడీకి ఇస్తూ శనివారం కోర్టు ఆదేశాలిచ్చింది. చంచల్‌గూడ జైల్లో వీళ్లను ఈ నెల 9,10వ తేదీల్లో ఏసీబీ తమ కస్టడీలోకి తీసుకోనుంది. ఆధారాలతో మరిన్ని అరెస్టులకు ఏసీబీ సిద్ధమవుతున్నట్లు సమాచారం.