V6 News

జోగులాంబ గద్వాల జిల్లాలో మర్డర్ కేసులో భార్యతో సహా ఐదుగురికి జీవితఖైదు

  జోగులాంబ గద్వాల జిల్లాలో మర్డర్ కేసులో భార్యతో సహా ఐదుగురికి జీవితఖైదు
  •     జోగులాంబ గద్వాల జిల్లా కోర్టు తీర్పు

అలంపూర్, వెలుగు: మర్డర్ కేసులో ఐదుగురికి జీవితఖైదు, రూ.5 వేల చొప్పున జరిమానా విధిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా కోర్టు జడ్జి ప్రేమలత మంగళవారం తీర్పు ఇచ్చారు. ఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అలంపూర్ ఆలయంలో అటెండర్ చాకలి షాలు, కృష్ణవేణి దంపతులు. కాగా.. కృష్ణవేణి వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కూతురికి జర్వంగా ఉందని భర్తకు చెప్పి 2019 జూన్ 4న కర్నూలులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

 తిరిగి బైక్ పై సొంతూరికి వస్తుండగా కృష్ణవేణి తన ప్రియుడు మహేశ్​కు ఫోన్ చేసి చెప్పింది. ఇమాంపురం స్టేజీ సమీపంలో సుపారి గ్యాంగ్ అడ్డుకొని బైక్ పై నుంచి షాలును కిందికి లాగారు. 12 ఏండ్ల కూతురి కళ్లముందే తండ్రిపై బీరు సీసాలతో దాడికి దిగి పొలాల్లోకి ఈడ్చుకొని వెళ్లి హత్య చేశారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య కృష్ణవేణి వివాహేతర సంబంధం కారణంగానే భర్తను హత్య చేసినట్టు తేలింది. 

దీంతో కృష్ణవేణి, సంకటి మహేశ్, దాదే పోగు మహేశ్, ఈడిగ మహేంద్ర, ఉల్చ రాజాను నిందితులుగా గుర్తించారు.  అనంతరం కోర్టులో  పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. మృతుడి కూతురు కోర్టులో సాక్ష్యం చెప్పగా, ఐదుగురు నిందితులకు జీవితఖైదు, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. నిందితులకు శిక్ష పడేలా వ్యవహరించిన  పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినోదచారి, అడిషనల్ ఎస్పీ శంకర్, డీఎస్పీ మొగులయ్య, అలంపూర్ సీఐ రవిబాబు, అలంపూర్ ఎస్ఐ వెంకటస్వామి, కోర్టు లైజన్ ఆఫీసర్ జిక్కి బాబు, ఏఎస్ఐ ప్రసాద్ ను ఎస్పీ అభినందించారు.