ధరల పెరుగుదలతో గ్రామాలకు మరో దెబ్బ

ధరల పెరుగుదలతో గ్రామాలకు మరో  దెబ్బ
  •     8.04 శాతానికి చేరిన ఆహార ధరల ఇన్​ఫ్లేషన్​
  •     రిటైల్​ ఇన్​ఫ్లేషన్​@6.95 శాతం

న్యూఢిల్లీ: ఇది వరకే కరోనాతో చితికిపోయిన గ్రామాల ప్రజలకు ఇన్​ఫ్లేషన్​ (ధరల పెరుగుదల) రూపంలో మరో దెబ్బ తగిలింది. పోయిన ఏడాది రూరల్​ ఇన్​ఫ్లేషన్​ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఊళ్లలో ఆహార ధరల ఇన్​ఫ్లేషన్​ పోయిన నెల 8.04 శాతానికి చేరింది. 2021 మార్చిలో ఇది 3.94 శాతం మాత్రమే ఉంది. కన్జూమర్​ ఫుడ్​ ప్రైస్​ఇండెక్స్​ (సీఎఫ్​పీఐ) ఆధారంగా లెక్కించే ఆహార ధరల ఇన్​ఫ్లేషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.81 శాతంగా రికార్డయిందని నేషనల్​ స్టాటిస్టికల్​ ఆఫీస్​ (ఎన్​ఎస్​ఓ)​ ప్రకటించింది. రిటైల్​ ఇన్​ఫ్లేషన్​ ఏకంగా 17 నెలల హై అయిన 6.95 శాతానికి ఎగబాకింది. చాలా కేటగిరీల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. 2022 ఫైనాన్షియల్ ఇయర్​లో సీపీఐ ఇన్​ఫ్లేషన్ 5.51 శాతానికి పెరిగింది. ఆర్​బీఐ అంచనా 5.30 శాతం కంటే ఇది ఎక్కువే! ఫుడ్‌ & డ్రింక్స్‌ ఇన్​ఫ్లేషన్​7.47 శాతం వరకు ఉంది. వంటనూనెలు, కూరగాయలు, తృణధాన్యాలు  పాలు, మాంసం  చేపలు వంటి వాటి ధరలు బాగా పెరగడమే ఇందుకు కారణం.   ఫిబ్రవరి వరకు మూడు నెలలపాటు తగ్గినప్పటికీ సీక్వెన్షియల్​గా ఆహారాల ధరలు  1.32 శాతం పెరిగాయి. రష్యా-–ఉక్రెయిన్ వివాదం కారణంగా 'నూనెలు,  కొవ్వుల' ఇన్​ఫ్లేషన్​ 18.79 శాతానికి పెరిగింది. వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. మనకు ఉక్రెయిన్ నుంచి పొద్దుతిరుగుడు నూనె భారీగా దిగుమతి అవుతుంది.  కూరగాయల ఇన్​ఫ్లేషన్​ మార్చిలో 11.64 శాతానికి చేరుకుంది. 'మాంసం,  చేపలు' ధరలు ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో 9.63 శాతం పెరిగాయి.  

సాగుకు  సమస్యలు

‘‘ఖరీఫ్​ నాట్ల సీజన్​ ఈ ఏడాది జూన్​ నుంచి మొదలవుతుంది. ఎరువుల కొరత బాగా ఉండటం వల్ల ఈసారి వ్యవసాయ రంగానికి ఇబ్బందులు ఏర్పడుతాయి. సాధారణ వర్షపాతం ఉన్నప్పటికీ రాబోయే నెలల్లో ఆహార ధరలు మరింత పెరుగుతాయి.  క్రూడ్​ ఆయిల్​ ధరలు పెరగడం వల్ల ప్రయాణాల ఖర్చులు, అన్ని రకాల వస్తువుల ధరలు ఎక్కువ అవుతాయి ”అని రీసెర్చ్​ ఫర్మ  కేర్​ ఎడ్జ్​ ఇటీవల పేర్కొంది. ఆర్​బీఐ పోయిన నెల నిర్వహించిన మానిటరీ పాలసీ మీటింగ్​లో ఇన్​ఫ్లేషన్​ అంచనాలను 5.7 శాతానికి పెంచింది. ఇది వరకు ఇది 4.5 శాతంగా ఉండేది. ప్రపంచమంతటా నూనెలు, కమోడిటీల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఇక నుంచి ధరల తగ్గుదలపై మరింత ఫోకస్​ చేస్తామని కూడా ప్రకటించింది. ఆహార ధరలు చాలా పెరుగుతున్నాయి కాబట్టి మార్చిలో  ఇన్​ఫ్లేషన్​ రేటు 6.35 శాతానికి చేరుతుందని ఎక్స్​పర్టులు అంచనా వేశారు. ‘‘మార్చి ఇన్​ఫ్లేషన్​ అంచనాలకు మించి మరీ పెరిగింది.  రాబోయే క్వార్టర్​లో ఇన్​ఫ్లేషన్​ఆరు శాతం కంటే ఎక్కువే ఉండొచ్చు. అంటే వరుసగా మూడు క్వార్టర్లలోనూ రిటైల్​ ఇన్​ఫ్లేషన్​ రేట్లు ఆర్​బీఐ అంచనాల కంటే ఎక్కువ ఉంటాయన్నమాట” అని కోటక్​ మహీంద్రా బ్యాంక్​ సీనియర్​ ఎకానమిస్ట్​ ఉపాసనా భరద్వాజ్​ వివరించారు.