
మంచిర్యాల, వెలుగు: బెల్లంపల్లికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బట్వాన్ పల్లి. గ్రామంలో 1500 పైగా కుటుంబాలు ఉండగా, సుమారు ఐదువేల మంది జనాభా ఉన్నారు. ప్రజలు వ్యవసాయం, కూలీ పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. రబీ సీజన్ లో బోర్లు, బావుల కింద 150 ఎకరాల్లో వరిపంట వేశారు. మరో 50 ఎకరాల్లో కూరగాయలు సాగు చేశారు. ఇప్పుడిప్పుడే పొలాలు కోతకు వస్తున్నాయి. గ్రామంలో ఐదు హార్వెస్టర్లు ఉన్నాయి. కానీ గన్నీ సంచుల కొరత వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇంకా ప్రారంభించలేదు. ఇక్కడి రైతులు కూరగాయలను బెల్లంపల్లి, మంచిర్యాల మార్కెట్లలో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లు బంద్ ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముకుందామన్నా రవాణా సౌకర్యం లేదు. ఊళ్లో కూరగాయలు అమ్ముడుపోక తోటలపైనే వదిలేస్తున్నామని రైతులు వాపోయారు.
కూలీలకు తిప్పలు
బట్వాన్ పల్లిలో సుమారు 150 మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వీరంతా బెల్లంపల్లి పట్టణంలో పనులు చేస్తుంటారు. పురుషులకు రూ.500, మహిళలకు రూ.400 కూలీ ఇస్తారు. నెల రోజులుగా బిల్డింగ్ పనులు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మరో 300 మందికిపైగా దినసరి కూలీలు ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వీరిది. గ్రామంలో ఉపాధిహామీ కూలీలు 1500 మంది ఉన్నారు. ఇంకా పనులు ప్రారంభించకపోవడంతో వీరంతా ఖాళీగా ఉంటున్నారు. లాక్ డౌన్ సహాయక చర్యల్లో భాగంగా బియ్యం పంపిణీ చేసినప్పటికీ, ఆర్థిక సహాయం అందలేదు. బ్యాంక్ అకౌంట్లు లేనివారు సర్కారు ఇచ్చే రూ.1500 కోసం ఎదురుచూస్తున్నారు.
ఆటోవాలా ఉపాధికి దెబ్బ
గ్రామంలో 40 ఆటోలు, 20 ఆటోట్రాలీలు, 10 ట్రాక్టర్లు ఉన్నాయి. వీటిపై వందకుపైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. నిరుద్యోగ యువకులు నిత్యం బెల్లంపల్లి, మంచిర్యాలకు ఆటోలు, ఆటోట్రాలీలు నడుపుతూ ఉపాధి పొందుతున్నారు. రోజుకు రూ.500 వరకు సంపాదిస్తారు. నెలరోజుల నుంచి రవాణా బంద్ కావడంతో ఆటోలకు బ్రేకులు పడ్డాయి. అత్యవసరంగా కిరాయిలకు వెళ్తే పోలీసులు పట్టుకొని సీజ్ చేస్తున్నారు. దీంతో ఆటోలను ఇండ్ల ముందు నిలిపి కవర్లు కప్పి ఉంచారు. ట్రాక్టర్లు కదలకపోవడంతో డ్రైవర్లకు, కూలీలకు పని కరువైంది.
శుభకార్యాల సందడి లేదు
బట్వాన్ పల్లి గ్రామంలో ఏటా మార్చి, ఏప్రిల్ మాసాల్లో కనీసం ఇరవై పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరిగేవి. ఈసారి ఆ సందడే కనిపించడం లేదు. మార్చి 28న జరగాల్సిన ఒక పెళ్లిని వాయిదా వేసుకున్నారు. మిగిలిన వారు లాక్ డౌన్ తర్వాత ముహూర్తాలు పెట్టుకునేందుకు ఎదురుచూస్తున్నారని గ్రామానికి చెందిన అయ్యవారు శ్రీధరాచారి తెలిపారు. గ్రామంలోని ఐదు టెంట్ హౌస్ లు, అద్దె వాహనాలకు గిరాకీ లేదు. నలుగురు ఫొటోగ్రాఫర్లు ఖాళీగా ఉంటున్నారు. ఎవరైనా చనిపోతే కుటుంబీకులు, బంధువులకు చివరిచూపు దక్కడం లేదు. గ్రామానికి చెందిన కందూరి మొండి ఇటీవల మృతిచెందాడు. దహెగాం, రామగుండంలో ఉంటున్న ఆయన బిడ్డలు, అల్లుళ్లు రాలేకపోయారని స్థానికులు తెలిపారు. ఇప్పటివరకు ముగ్గురు మరణించగా, కుటుంబసభ్యులే అంత్యక్రియలు నిర్వహించారని చెప్పారు.
పెరిగిన సరుకుల ధరలు
గ్రామంలో ఇరవై వరకు కిరాణా షాపులున్నాయి. వీరు బెల్లంపల్లి, మంచిర్యాల నుంచి హోల్ సేల్ గా సరుకులు తీసుకొచ్చి అమ్ముతుంటారు. ప్రస్తుతం రవాణా బంద్ కావడంతో బైక్ లు, ఆటోల్లో వెళ్లి కొద్దిపాటి సరుకులు తీసుకొస్తున్నారు. హోల్ సేల్ లో ధరలు పెంచడంతో వీరు మరింత పెంచి అమ్ముతున్నారు. గతంలో రూ.105 ఉన్న మంచినూనె రూ.120 నుంచి రూ.130, పెసరపప్పు రూ.130, కందిపప్పు రూ.110కి అమ్ముతున్నారు. అత్యవసర సమయాల్లో బెల్లంపల్లికి వెళ్తే పోలీసులు వాహనాలను పట్టుకుంటున్నారని, ఇప్పటివరకు 40 బైక్ లను సీజ్ చేశారని తెలిపారు. గ్రామంలో ఎవరికైనా జబ్బు చేస్తే ఓర్చుకుంటున్నారు. స్థానికంగా నలుగురు ఆర్ ఎంపీలు ఉన్నా సర్కారు ఆదేశాల మేరకు ట్రీట్ మెంట్ చేయడం లేదు.
సిమెంట్ దొరుకుతలేదు
గ్రామంలో డంపింగ్ యార్డు, శ్మశానవాటిక పనులు మెటీరియల్ లేక నిలిచిపోయాయి. బెల్లంపల్లిలో సిమెంట్ , స్టీల్ దొరుకుత లేదు. ఇసుక రవాణా బంద్ అయ్యింది. ఉపాధిహామీ పనులు ప్రారంభించాలని ఆదేశాలు వచ్చాయి. త్వరలోనే ప్రారంభిస్తాం. శానిటేషన్ పనులు కొనసాగిస్తున్నాం.
‑ రాంటెంకి నిర్మల, సర్పంచ్
నాకు పైసలు రాలే
నాకు భర్త లేడు. ఇద్దరు కొడుకులు వేరుపడ్డరు. నేను కూలి పనులు చేసి బతుకుతున్న. వంద రోజుల పని జరుగుతలేదు. ఎవుసం పనులు కూడా లేవు. తిండికి తిప్పలయితుంది. పన్నెండు కిలోల బియ్యం తెచ్చుకున్న. నాకు అకౌంట్ లేదు. పైసలు రాలేదు.
‑ రట్నక్క, కూలీ