ఇన్సూరెన్స్​ కంపెనీల పంట పండింది

ఇన్సూరెన్స్​ కంపెనీల పంట పండింది

న్యూఢిల్లీ : లైఫ్ ఇన్సూరర్లకు కొత్త ప్రీమియం ఆదాయాలు బాగా పెరిగాయి. ఈ ఏడాది జూన్ నెలలో లైఫ్ ఇన్సూరర్లకు కొత్త ప్రీమియం ఆదాయం 94 శాతం పెరిగి రూ.32,241.33 కోట్లుగా రికార్డైనట్టు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌‌మెంట్ అథారిటీ డేటాలో వెల్లడైంది. మొత్తం లైఫ్ ఇన్సూరర్లు దేశవ్యాప్తంగా24 ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో వీటి ప్రీమియం ఆదాయం రూ.16,611.57 కోట్లుగా ఉంది. అన్ని ఇన్సూరర్లలో కెల్లా.. దేశంలో అతిపెద్ద లైఫ్ ఇన్సూరర్ అయిన ఎల్‌‌ఐసీకి అయితే ఏకంగా కొత్త ప్రీమియం కలెక్షన్లు రెండింతలకు పైగా పెరిగాయి. గతేడాది జూన్‌‌ నెలలో రూ.11,167.82 కోట్ల కలెక్షన్లు చేపడితే.. ఈ ఏడాది జూన్ నెలలో ఎల్‌‌ఐసీకి రూ.26,030.16 కోట్ల కొత్త ప్రీమియం కలెక్షన్లు వచ్చాయి. ప్రభుత్వ రంగానికి చెందిన ఏకైక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇదే కావడం విశేషం.ఈ గ్రోత్‌‌తో ఎల్‌‌ఐసీ మార్కెట్ షేరు 74 శాతానికి పెరిగింది. మిగిలిన 26 శాతం మార్కెట్ షేరు 23 ప్రైవేట్ సెక్టార్ ప్లేయర్స్‌‌ వద్ద ఉంది. నెలంతా ఎల్‌‌ఐసీ 13.32 లక్షల పాలసీని విక్రయించింది. ఇన్ని పాలసీలను విక్రయించడంతో ఒక్క జూన్ నెలలోనే రూ.25 వేల కోట్లకు పైగా ఆదాయాలను ఎల్‌‌ఐసీ ఆర్జించింది.

ప్రైవేట్ రంగ ప్లేయర్లకు కూడా కొత్త ఏడాది ప్రీమియం బిజినెస్‌‌లు 14.10 శాతం పెరిగి రూ.6,211.17 కోట్లుగా రికార్డయ్యాయి. గతేడాది ఇదే నెలలో ఈ ప్రీమియం వ్యాపారాలు రూ.5,443.75 కోట్లుగా ఉన్నాయి.  ప్రైవేట్ ప్లేయర్స్‌‌లో హెచ్‌‌డీఎఫ్‌‌సీ లైఫ్​ కొత్త ప్రీమియం ఆదాయం 21 శాతం పెరిగి రూ.1,358.45 కోట్లుగా.. ఎస్‌‌బీఐ లైఫ్ ఆదాయం 28.14 శాతం పెరిగి రూ.1,310.07 కోట్లుగా… ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఆదాయం 26 శాతం ఎగిసి రూ.897.98 కోట్లుగా… బజాజ్ అలయెన్స్ ఆదాయం 51 శాతం పెరిగి రూ.468.51 కోట్లుగా.. మ్యాక్స్ లైఫ్ ఆదాయం 16 శాతం ఎగిసి రూ.421.87 కోట్లుగా రికార్డయ్యాయి.  క్యుములేటివ్‌‌గా.. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో 24 లైఫ్ ఇన్సూరర్లకు కొత్త ప్రీమియం ఆదాయాలు 65 శాతం జంప్ చేసి రూ.60,637.22 కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్–జూన్ కాలంలో ఎల్‌‌ఐసీ కొత్త ప్రీమియం ఇన్‌‌కమ్​ 82 శాతం పెరిగి రూ.44,794.78 కోట్లుగా ఉంది. మిగతా ప్లేయర్స్ ఆదాయం 32 శాతం జంప్ చేసి రూ.15,842.44 కోట్లుగా ఉన్నట్టు ఐఆర్‌‌‌‌డీఏ డేటాలో వెల్లడైంది.