సమస్యలకు  భయపడకూడదు

సమస్యలకు  భయపడకూడదు

ఒక ప్రాణి భూమి మీదకు వస్తున్నప్పుడే సమస్యలు కూడా ఆ ప్రాణితో వస్తాయి. ఆ ప్రాణితో పెరుగుతాయి. ఆ ప్రాణితో అంతం అవుతాయి. అయితే ఒకే సమస్య పెరుగుతూ ఉండదు. ఒక సమస్య పరిష్కారం అయితే మరో సమస్య వస్తూనే ఉంటుంది. అందుకే జీవితం అనే పొలంలో సమస్య అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్లలేం కదా.. అందుకే కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి అంటారు అనుభవజ్ఞులు.

శ్రీరాముడు సామాన్య మానవునిగా జన్మించి, ఎన్నో కష్టాలను చిరునవ్వుతో అధిగమించి, భగవంతుడయ్యాడు. అందరి పూజలు అందుకుంటున్నాడు. సిరిసంపదలలో పుట్టి పెరిగిన పాండవులు దుర్యోధనుని కుటిల రాజకీయాలను ఎదుర్కోలేక, పన్నెండు సంవత్సరాల పాటు అరణ్యవాసం చేశారు. అప్పుడు వారు బాధపడుతూ, విచారిస్తూ కూర్చోలేదు. అరణ్యవాసాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలా అని ఆలోచించారు. దుష్టసంహారం చేశారు. అడవులలో నివసించే సామాన్యులకు, అక్కడే తపస్సు చేసుకునే మునులకు, యజ్ఞయాగాదులు చేసే మహర్షులకు మేలు చేశారు. ప్రజలను పీడించే హిడింబాసురుడు, బకాసురుడు వంటి రాక్షసులను హతమార్చాడు భీముడు. ఆ తరువాత ఒక ఏడాది పాటు ద్రౌపదితో కలిసి అజ్ఞాతవాసం చేశారు పాండవులు. ఆ సమయంలో కీచకుడిని వధించాడు భీముడు. విరాటరాజు కొలువులో ధర్మరాజు కంకుభట్టు పేరుతో చదరంగం ఆడేవానిగా, అర్జునుడు బృహన్నల రూపంలో నాట్యాచార్యునిగా, భీముడు వంటవానిగా, నకులసహదేవులు.. గోవులను, గుర్రాలను కాసేవారుగా, ద్రౌపది సైరంధ్రిగా మారు వేషాలతో ఎన్నో కష్టాలు అనుభవించారు. సింహాసనం మీద కూర్చోవలసినవారు అతి సామాన్యులుగా, సేవకులుగా జీవితం గడిపారు. ఇన్ని బాధలు పడుతున్నా ఒక్కనాడూ ధైర్యాన్ని కోల్పోలేదు. పదమూడేండ్ల తరువాత కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించి, తిరిగి సింహాసనం మీద కూర్చున్నారు. ప్రజలను కన్నబిడ్డలుగా పరిపాలించారు.

నలమహారాజు సైతం మాయాజూదంలో ఓడిపోయి అడవుల పాలయ్యాడు. దమయంతిని విడిచి వెళ్లిపోయాడు. ఒంటి మీద ఉన్న చిన్న కండువాను పక్షి ఎగరేసుకు పోయింది. పాము కాటుకి గురై రూపం మారిపోయి, రాజకొలువులో వంటవానిగా చేరాడు. తనను ఎవ్వరూ గుర్తుపట్టలేకపోతారు. ఒకనాడు సింహాసనం మీద కూర్చున్న నలుడు, గరిటె పట్టి వంటలు చేశాడు. కాని ఏనాడూ ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. కష్టాలను అనుభవిస్తూనే, వాటిని కలుపుమొక్కలుగా ఏరిపారేయాలనుకున్నాడు. కొంతకాలానికి పరిస్థితులు చక్కబడి తిరిగి సింహాసనం అధిష్టించి పరిపాలన సాగించాడు.

ఇక శ్రీరాముని విషయానికి వస్తే – 
తెల్లవారితే యువరాజ పట్టాభిషేకం అనుకుంటుండగా, ఎవ్వరూ ఊహించని విధంగా శ్రీరాముడు అడవులకు వెళ్లాల్సి వచ్చింది. పద్నాలుగేండ్ల పాటు అరణ్యవాసం చేశాడు. ఆ సమయంలోనే అడవుల్లో తపస్సు చేసుకునే మునులు, బ్రాహ్మణులు, సాధువులకు ఇబ్బందులు కలిగించే రాక్షసులను సంహరించాడు. మాయలేడి రూపంలో వచ్చిన మారీచుడిని అంతమొందించాడు. సీతను అపహరించిన రావణుడిని అన్వేషిస్తూ, మార్గంలో ఎందరో రాక్షసులను తన నిశిత శరాలకు గురి చేశాడు. తమ్ముడు లక్ష్మణునితో కలిసి ఖరదూషణులను యమపురికి పంపాడు. కబంధవిరాధులను అంతం చేశాడు. చిట్టచివరకు రావణసంహారంతో విజయం సాధించాడు. అలా పద్నాలుగేండ్ల కాలం సింహాసనానికి, సుఖాలకు దూరమైనప్పటికీ శ్రీరాముడు కలత చెందకుండా ముందుకు నడిచాడు. అరణ్యవాసం అనుభవించాల్సి వచ్చింది అనే భావన మనసులోకి రానీయకుండా, తాను ఉన్న చోటే ఒక ప్రభువులా అందరినీ రక్షించాడు. అరణ్యవాసం అనే కలుపుమొక్కను పీకేసి, తాను ఉన్న ప్రదేశాన్ని నందనవనంగా తీర్చిదిద్దాడు. 

చికాగోలో ఏర్పాటైన అంతర్జాతీయ సర్వ మత సమావేశంలో స్వామి వివేకానందకు అతి కష్టం మీద మూడు నిమిషాలు మాత్రమే మాట్లాడే అవకాశం దక్కింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఏ నోటితో అయితే వివేకానందను తిరస్కరించారో, వారే స్వామి వివేకానంద చేత మూడు మాసాల పాటు మాట్లాడించుకున్నారు. తన దారిలో ఎదురవుతున్న ముళ్లను, కలుపు మొక్కలను ఏరి పారేస్తూ, ముందుకెళ్లాడు. అనర్గళంగా ఉపన్యాసమిచ్చాడు. అందరి హృదయాలను దోచుకుని, ఆదర్శంగా నిలిచాడు.

దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో నాయకులు ప్రాణాలకు తెగించి పోరాడారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. కొందరు జైలు జీవితం అనుభవించారు. అయినప్పటికీ స్వాతంత్య్ర సాధన అనే కృషిని విడనాడకుండా, దారిలో ఎదురైన అడ్డంకులను ఎదుర్కొని స్వాతంత్య్రం సాధించారు. ఇటువంటి సంఘటనలు, ఉదాహరణలు లెక్కలేనన్ని కనిపిస్తాయి. మనకు కావలసినదల్లా వచ్చిన కష్టాన్ని చేతితో తీసి పక్కన పడేసే లక్షణం అలవరచుకోవటమే. జీవితాన్ని నిరంతరం సాగు చేస్తూ ఉండాలి. జీవితం వ్యవసాయం లాంటిది. పొలంలో నిరంతరం కలుపు మొక్కలు మొలుస్తూనే ఉంటాయి. వాటిని రైతు ఎప్పటికప్పుడు ఏరిపారేసి, పంట దెబ్బతినకుండా జాగ్రత్తపడుతుంటాడు. జీవితంలో కూడా కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు అధిగమిస్తూ జీవించాలి.  -  డా. వైజయంతి పురాణపండ ఫోన్: 80085 51232