ఓయూకు ఉందో యాప్​!

ఓయూకు ఉందో యాప్​!

సికింద్రాబాద్, వెలుగు: క్యాంపస్ విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు, సిబ్బందికి గైడ్​గా ఉంటుంది. వాళ్లు వెళ్తున్న దారి సురక్షితమా కాదా ?  ఏ రూట్​లో వెళ్తే సేఫ్..! డిపార్టుమెంట్ల లొకేషన్..వాటి దూరం..రూట్​ను చూపిస్తుంది. ఏదైనా ప్రమాదం ఎదురైతే వెంటనే మొబైల్​లోని యాప్​ బటన్ ​నొక్కితే  చాలు..  కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్​కు సమాచారం వెళ్తుంది. ఇలాంటి పలు అంశాలపై సమాచారం తెలియజేసే ‘లైఫ్​ ఆఫ్​ గర్ల్- విమెన్​ సేఫ్టీ’ యాప్ ను ఉస్మానియా యూనివర్సిటీ రూపొందించింది. ఇది​ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​తో పర్సనల్​సేఫ్టీ ప్లాట్​ఫామ్​గా పని చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి యాప్​ను మొదటిసారిగా  ఓయూనే లాంచింగ్​ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండేషన్ డే సందర్భంగా ‘లైఫ్​ ఆఫ్​ గర్ల్- విమెన్​ సేఫ్టీ’  యాప్ ను అందేబాటులోకి తెచ్చారు.  ఓయూలో చదివే విద్యార్థులు తమ గుర్తింపు కార్డుల ద్వారా యాప్​లో ముందుగా రిజిస్టర్​ చేసుకోవాలి. వివరాల ఆధారంగా మొబైల్​ యూజర్​కు పాస్​ వర్డ్ ​వస్తుంది. అప్పుడు యాప్​ అకౌంట్ లో కుటుంబ సభ్యుల ఫోన్​ నంబర్లు, ఎమర్జెన్సీ కాంటాక్ట్​ నెంబర్లను సేవ్ ​చేసుకోవాలి.  వర్సిటీతో పాటు దాని పరిధిలోని 70కిపైగా అనుబంధ కాలేజీలకు చెందిన విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు, సిబ్బందికి ఉపయోగపడనుంది. 
 షీ టీమ్స్ కు కనెక్ట్
వర్సిటీ తో పాటు షీ- టీమ్స్, విద్యార్థుల ఫ్యామిలీ మెంబర్లు కూడా సభ్యులుగా ఉంటారు. రిజిస్టరైన విద్యార్థినులు, వారి కుటుంబ సభ్యుల ఫోన్​నంబర్లు ఇందులో లింక్ ​చేస్తారు. విద్యార్థినులు ప్రమాదంలో ఉంటే.. ఆ సమాచారం యాప్​లోని మిగతా సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులకు, షీ- టీమ్స్​కు  అందిస్తుంది. వారు ఏ లొకేషన్​లో ప్రమాదానికి గురయ్యారనే విషయాన్ని వెంటనే తెలియజేస్తుంది. 

ఎక్కడ ఉన్నది ? ఎలా ఉన్నది ?

జీపీఎస్​  ట్రాకింగ్​కు యాప్ కనెక్ట్​ అయి ఉం టుంది. మొబైల్​లో ఇన్​స్టాల్​ చేసుకునే విద్యార్థిని వాయిస్​ స్పీచ్​ను ఇది గుర్తిస్తుంది. అనుకోని ప్రమాదాలు ఎదురైనప్పుడు యాప్​లోని ఎస్​ఓఎస్​బటన్​ను నొక్కితే  ముందుగా సేవ్​ చేసిన ఎమర్జెన్సీ కాంటాక్ట్​లకు సమాచారం వెళ్తుంది. అలాగే ఆ విద్యార్థిని తాను వెళ్తున్న  రూట్​తప్పిపోయినా, ఇతరుల నుంచి ప్రమాదం ఎదురైనా,  తన చేతిలోని ఫోన్​ కింద పడేసినా, లేదా గట్టిగా అరిచినా  యాప్​ గుర్తిస్తుంది. ఆమె ఎక్కడ ఉన్నది ? ఎలా ఉన్నది ? ఎలాంటి ప్రమాదంలో ఉన్నదనే వివరాలను లొకేషన్​తో  సహా సమాచారం అందిస్తుంది. తద్వారా  వెంటనే  కాపాడే అవకాశాలు మెరుగుపడతాయి. యాప్​ నిర్వహణ  ఓయూనే చూస్తుండగా అందుకు ప్రత్యేకంగా ఓ సర్వర్​ను ఏర్పాటు చేశారు. దాని అనుసంధానంతో యాప్​ పని చేస్తుంది. యాప్​లో  రక్షణ అంశాలతోపాటు హెల్త్​ హైజిన్​ సమాచారం కూడా అందిస్తుంది.  విద్యార్థినులు  తాము సాధించిన విజయాలపై వీడియోలు అప్​లోడ్​ చేస్తే వాటికి రేటింగ్​ కూడా ఇస్తుంది. అందుకు రివార్డ్​ పాయింట్లు వస్తాయి.  విద్యార్థినులు, అధ్యాపకులు సెమినార్లలో ఇచ్చే లెక్చర్ ​బాగుంది.  బాగాలేదు అనే వాటిపైనా రేటింగ్​ ఇస్తుంది.

భద్రత కోసం.. 

ఓయూ స్టూడెంట్స్, అధ్యాపకులు, ఎంప్లాయీస్​ భద్రతకోసం యాప్​ను రూపొందించాం.  ఓయూ ఫౌండేషన్​ రోజున అందుబాటులోకి తెచ్చాం.  క్యాంపస్​తో పాటు  ఓయూ అనుబంధ కాలేజీ స్టూడెంట్లకు కూడా యాక్సెస్​ ఇచ్చాం. వేల మంది వరకు యాప్​ను వాడుతున్నారు. ఆ తర్వాత వర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీ విద్యార్థినులు, అధ్యాపకులు, ఉద్యోగులకు అవకాశం కల్పిస్తాం.
 -ప్రొఫెసర్​ రవీందర్​యాదవ్​, వీసీ, ఓయూ

ఏదైనా ప్రమాదం జరిగితే.. 

విద్యార్థినులు , మహిళా అధ్యాపకులు, ఉద్యోగులు ప్రమాదానికి గురైనపుడు ఈ యాప్ లోని ఎస్​ఓఎస్​బటన్​ నొక్కాలి. దీంతో వారు ప్రమాదంలో ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు, షీ -టీమ్స్​, ఫ్రెండ్స్​కు సమాచారం వెళ్తుంది. అయితే ఈ బటన్​ను జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది.
– ప్రొఫెసర్లు ​నవీన్​కుమార్​, హిమబిందు, యాప్ డిజైనర్స్​, ఓయూ