సలీం అక్బర్ పెద్ద కొడుకు. ప్రియమైనవాడు కూడా. అక్బర్ మరణశయ్య మీద ఉన్నప్పుడు సలీంని రాజుగా చూడాలని కోరాడు. తండ్రి చనిపోయేనాటికి సలీం వయసు 36 ఏండ్లు. యువకుడిగా ఉన్న రోజుల్లో చంచల స్వభావంతో ఉండేవాడు. 1600 సంవత్సరంలో తండ్రి మరో కొడుక్కి ప్రాముఖ్యత ఇవ్వడంతో అసూయపడ్డాడు. బెంగాల్‌కు చేరి అక్కడ తిరుగుబాటును లేవనెత్తాడు. రెండేండ్ల తర్వాత తన ప్రియ మిత్రుడు, సలహాదారు అబ్దుల్ ఫజల్‌ను చంపటానికి ఒక ద్రోహిని నియమించి తన తండ్రి హృదయం పగిలేలా చేశాడు. అతణ్ణి సలీం అసహ్యించుకునేవాడు. భయపడేవాడు కూడా. కానీ 1604లో తండ్రీకొడుకులు తిరిగి ఏకమయ్యారు. సింహాసనాన్ని అధిష్టించగానే సలీం ‘జహంగీర్’ (జగజ్జేత) అనే బిరుదు వహించాడు.
1611లో జహంగీర్ ప్రఖ్యాత నూర్జహాన్ (విశ్వజ్యోతి)ని ఆయన ఎంతో కాలం ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. ఈ ప్రసిద్ధ స్త్రీ ఒక పర్షియా శరణార్థి కూతురు. జహంగీర్ యువరాజు సలీంగా ఉన్నప్పుడే ఆమెను ప్రేమించాడు. దాన్ని ఆమోదించని అక్బర్ ఆమెకు తన అధికారులలో ఒకరితో పెళ్లి చేయించాడు. ఆయన పేరు అలీఖులీ ‘షేర్ – అప్ఘన్’. ఆయన బెంగాల్‌కు చాలా దూరతీరంలోని బర్ద్వాన్కు పాలకుడు. జహంగీర్ సింహాసనం అధిష్టించాక అతన్ని చంపించి ఆమెను వెనక్కి తీసుకొచ్చారు. చాలాకాలం ఆమె అతని ప్రేమను తిరస్కరించింది.
ఆఖరికి నాలుగేండ్ల తర్వాత ఆయనను అంగీకరించింది. అప్పుడు ఆమె వయసు ముప్పై నాలుగేండ్లు. ఆమె తన అధికారాన్ని తెలివిగా వాడుకుంది. తన భర్త తాగుడు అలవాటును కట్టడి చేసింది. ప్రతిరోజు ముఖానికి ముసుగు ధరించి సందర్శకుల కిటికీ దగ్గర కూర్చుని ప్రజల సమస్యలు విని పరిష్కరించేది. ఆమె తన సొంత నిధులను అనాథ బాలికలకు వివాహ కట్నంగా ఇవ్వడానికి ఉపయోగించేది.
ఆమె తన పేరిట నాణాలు కూడా ముద్రింపజేసింది. ఆమె గొప్ప గుర్రపు రౌతు, మంచి షికారి. ఉన్నతోద్యోగులు ఆమె పట్ల అసూయ పెంచుకున్నారు. వాళ్లలో ఒకరు రాజు, రాణి విడిది చేసినప్పుడు చంపడానికి కూడా వెనుకాడలేదు. వాళ్ల శిబిరాన్ని ముట్టడించి జహంగీర్‌ను నిర్బంధించాడు. దీనికి కారణం ఒక ఆడది రాజ్యాన్ని ఏలడం. జహంగీర్‌ను ఆమె చేతిలో కీలుబొమ్మ అనేవాళ్లు. సాహసోపేతురాలైన నూర్జహాన్ వాళ్ల ముట్టడి నుంచి తప్పించుకుని ఏనుగు మీద దూసుకెళ్లింది. వెనక నుంచి బాణాలు వర్షంలా పడుతున్నాయి.
ఒక బాణం ఆమె పరిచారిక భుజానికి గుచ్చుకున్నా భయపడకుండా నది దాటి వెళ్లింది. ఆ తర్వాత ఆమె చేపట్టిన చర్యలకు సంతుష్టుడైన మొహబ్బత్ ఖాన్ బందీలనందరినీ విడుదల చేసి మిగతా రాజ పుత్రులతో పాటు తాను కూడా ఆమె శరణుపొందాడు. 1620ల కాలంలో జహంగీర్ ఆరోగ్యం క్షీణించసాగింది. 1627లో కొలువు కూటాన్ని లాహోర్ నుంచి కాశ్మీర్‌కు మార్చారు. అక్కడి తోటలను అమితంగా ప్రేమించే ఆయనకు ఆరోగ్యం కుదుటపడుతుందనుకున్నారు. అక్కడ కొద్దికాలం తర్వాత కోలుకుంటున్నట్లు కనిపించాడు. కానీ నవంబర్‌లో మైదాన ప్రాంతానికి వెళ్తూ మార్గంలోనే తనువు చాలించాడు. ఆయన మృతదేహాన్ని లాహోర్‌లో ఖననం చేశారు.
- మేకల మదన్మోహన్ రావుకవి, రచయిత
