ఏదైనా నచ్చకపోతే, దానిని మార్చేందుకు ప్రయత్నించాలి. ఒకవేళ మార్చలేకపోతే అతిగా ఆలోచించకుండా, ఆ విషయాన్ని అక్కడితో వదిలేయాలి. జీవితంపై ఉన్న దృక్పథాన్ని మార్చుకుంటే జీవితం కూడా దృక్పథం మార్చుకుంటుంది. ఎల్లప్పుడూ ఇదివరకటి కంటే మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించాలి. ఇతరులతో పోల్చుకోవడం మానేయాలి. అలా పోల్చుకుంటే సంతోషంగా ఉండలేం.
పాజిటివ్ థింకింగ్
పాజిటివ్ థింకర్ రోజ్ ఫ్లవర్‌ను మాత్రమే చూస్తాడు. నెగెటివ్ థింకర్ మాత్రం పువ్వుకున్న ముళ్లను చూస్తాడు. అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయో.. మన జీవితం అలానే ఉంటుంది. జీవితం నుంచి మంచి విషయాలు ఆశిస్తే.. అంతా మంచే జరుగుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ పాజిటివ్ థింకింగ్‌తో ఉండాలి.
టాలెంట్ గుర్తించాలి
ప్రతి ఒక్కరికీ ఎవరి ప్రతిభ వాళ్లకి తెలుస్తుంది. ఒక వేళ తెలియకపోతే, ఏయే సందర్భాలలో మనం మెచ్చుకోలు, ప్రశంసలు పొందామో గుర్తుకు తెచ్చుకోవాలి. టాలెంట్ అనేది దేవుడిచ్చిన వరం. ఆ ప్రతిభని ఉపయోగించుకోవడంలోనే ఆనందం ఉంది.
మనసును బట్టి…
ఆలోచనలను గమనిస్తూ మనసుని అర్థం చేసుకోవాలి. తగిన వ్యూహాలు రచించాలి. మనసుని నియంత్రించుకోవాలి. కానీ, మనసే మనల్ని కంట్రోల్ చేయకూడదు. అనవసర ఆలోచనలు ఇబ్బంది పెట్టినప్పుడు మెడిటేషన్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇబ్బంది పెట్టిన వ్యక్తులని క్షమించడం నేర్చుకోవాలి. అలా చేయడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది.
విజయం సొంతం
లక్ష్యాలకు కట్టుబడి ఉండాలి. ఆనందంగా ఉండాలంటే మనకంటూ కొన్ని లక్ష్యాలు ఉండాలి. లక్ష్యాలు అనేవి వివిధ రకాలు. వ్యక్తిగత లక్ష్యాలు, ఉద్యోగ లక్ష్యాలు. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకువెళ్లాలి. జీవితం నుంచి ఏం కోరుకుంటున్నామో తెలుసుకోవాలి. ఆ దిశగా ప్రయత్నాలు చెయ్యాలి. అప్పుడు తప్పకుండా విజయం సొంతం అవుతుంది.
భక్తి కూడా…
ప్రతిరోజు ఆనందంగా ఉండాలంటే.. రోజువారి దినచర్యలో భక్తిని కూడా భాగం చేసుకోవాలి. ఆధ్యాత్మికతను సాధన చేయాలి. జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు ఆధ్యాత్మికత రూపంలో పరిష్కారం దొరుకుతుంది. వీలైతే ఆధ్యాత్మిక గ్రంథాలను చదివే ప్రయత్నం చదవాలి.
ప్రకృతితో కొద్దిసేపు
పచ్చని చెట్లు.. ప్రశాంతమైన వాతావరణం, కిరణాలను వెదజల్లే సూర్యుడు, ప్రకృతి సౌందర్యం… ఇవన్నీ జీవితంలో మధురానుభూతులు. చిన్న చిన్న విషయాలే ఆనందాన్నిస్తాయి. ఏదో ఒక రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే అవే గొప్ప జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. కాబట్టి వీలైనప్పుడు ఎటైనా టూర్ ప్లాన్ చేసుకోవాలి. లేదంటే ఇంటికి దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్లి కాసేపు అక్కడ ఉన్నా చాలు.
రిలేషన్స్
ఆనందమైన జీవితానికి రిలేషన్స్ కూడా ముఖ్యమే. కొత్త వ్యక్తులను కలవడానికి వెనుకాడొద్దు. ఇతరులు చేసే వాటిపై మీరు ఆసక్తి చూపిస్తే, మీరు చేసే వాటిపై కూడా వాళ్లు ఆసక్తి కనబరుస్తారు. రిలేషన్స్ పెంచుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి. ఇతరులలో మీకు నచ్చనివి ఉంటే అవి మీకు ఇబ్బంది పెట్టనంత వరకు వాటిని పట్టించుకోకండి. మంచికే ప్రయారిటీ ఇవ్వండి. సాయం చెయ్యడానికి ముందుండండి. అది డబ్బు సాయం కావచ్చు, మాట సాయం కావచ్చు.
ఆరోగ్యం
జీవితం సాఫీగా ముందుకుసాగాలన్నా.. లక్ష్యాలు చేరుకోవాలన్నా ఆరోగ్యస్పృహ ఉండాల్సిందే. కాబట్టి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడాలి. వాకింగ్, జాగింగ్‌లకు ప్రయారిటీ ఇవ్వాలి. ఒకసారి ఆరోగ్యం క్షీణించడం మొదలయితే.. మామూలు స్థితికి చేరుకోవడం కష్టం. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
థ్యాంక్స్ చెప్పాలి
కాల గమనంలో ప్రతిరోజు విలువైందే. ఇది అర్థం చేసుకున్నప్పుడే జీవితం హాయిగా సాగుతుంది. గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని, మళ్లీ ఆ తప్పులు చేయకుండా జాగ్రత్తపడాలి. అప్పుడే జీవితం సరైన దారిలోకి వెళ్తుంది. ఇతరుల నుంచి చిన్న సాయం పొందినట్లయితే, వాళ్ల పట్ల కృతజ్ఞతగా ఉండాలి. ఒక్క థ్యాంక్స్ అనే మాట మనల్ని చాలామందికి దగ్గర చేస్తుంది.
జీవితంలో గెలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేయాలి. వాటిలో ముఖ్యమైనది మనల్ని మనం తెలుసుకోవడం. జీవితంలో ముందడుగులు వేయాలంటే మార్పుని ఆహ్వానించాలి. ఉరుకుల పరుగుల జీవితంతో చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తుంటాం. అవే ఆనందాలను దూరం చేస్తుంటాయి. ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నామో తెలుసుకుంటే.. ప్రతిరోజును ఒక పండుగలా సెలబ్రేట్ చేసుకోవచ్చు.
