ఈ గోల్డెన్ గర్ల్ జీవితంలోనూ గెలిచింది

ఈ గోల్డెన్ గర్ల్ జీవితంలోనూ గెలిచింది

‘బ్యాడ్మింటన్‌‌లో మన గోల్డెన్ గర్ల్ ఎవరు?’ అంటే  పి.వి.సింధు అని గొప్పగా చెప్తారు ఎవరైనా. ఎందుకంటే.. మొన్న జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌‌షిప్‌‌లో సింధు గోల్డ్ మెడల్ గెలిచింది కాబట్టి. అయితే అంతకంటే  గొప్పగా చెప్పుకోవాల్సిన పేరు మరొకటి ఉంది. అదే మానసి జోషి. ఈమె కూడా మొన్న ఆదివారం రోజే పారా బ్యాడ్మింటన్ టోర్నీలో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. మరి ఈ గోల్డెన్ గర్ల్ గురించి ఎంతమందికి తెలుసు?

మొన్న ఆదివారం జరిగిన పారా బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో.. ప్రపంచ నెంబర్ వన్ అయిన పారుల్‌‌ పామర్‌‌ను ఓడించి, మానసి పారా వరల్డ్ బ్యాడ్మింటన్‌‌ చాంపియన్‌‌ టైటిల్‌‌ను సొంతం చేసుకుంది. అయితే  ఈ గోల్డ్ మెడల్ సాధించడం వెనక పెద్ద కథే ఉంది. ఈ గెలుపు కోసం మానసి తనని తాను ఎంత ఇన్‌‌స్పైర్ చేసుకుందో తెలిస్తే.. ప్రతీ ఒక్కరి గుండె నిండా స్ఫూర్తి నిండడం ఖాయం.

కెరీర్‌‌‌‌ను రీస్టార్ట్

మానసి చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్ ప్లేయర్.  ఆరేళ్లకే బ్యాడ్మింటన్‌‌ ఆటపై ఆసక్తి పెంచుకుంది. తండ్రితో కలిసి ప్రాక్టీస్ చేస్తూ .. జిల్లా స్థాయి పోటీల్లో పార్టిసిపేట్ చేసేది. అలా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి  నుంచి జాతీయ స్థాయికి ఎదిగింది.  అలా కెరీర్‌‌‌‌లో ముందుకెళ్తున్న  టైంలో మానసి లైఫ్‌‌లో కోలుకోలేని సంఘటన జరిగింది. 22 ఏళ్ల వయసులో మానసికి రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్‌‌లో ఎడమకాలు పూర్తిగా దెబ్బతింది. యాక్సిడెంట్ తర్వాత ఐసీయూలో ఉన్న మానసి.. కళ్లు తెరిచి చూసేసరికి ఎడమ కాలు లేదు. కాలును పూర్తిగా  తీసేశారు. అది ఆమెకు తేరుకోలేని షాక్‌‌. దీంతో తన బాడ్మింటన్ కెరీర్‌‌‌‌కు ఫుల్‌‌స్టాప్ పెట్టాల్సొస్తుందేమో అని భయపడింది.

కానీ అలా జరగనివ్వలేదు. తనను తాను ఇన్‌‌స్పైర్ చేసుకుంది. ఆ గాయం నుంచి కోలుకోగానే   స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది. ‘ఏది ఏమైనా బ్యాడ్మింటన్‌‌ని వదిలేది లేద’ని దృఢంగా నిర్ణయించుకుంది.  ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్‌‌తో  కెరీర్‌‌ను రీస్టార్ట్ చేసింది. కాలికి కృత్రిమ బ్లేడ్‌‌ను బిగించుకుని, కొద్దిరోజుల్లోనే పారా బ్యాడ్మింటన్‌‌ కోర్టులో అడుగుపెట్టింది. టోర్నీలకు వెళ్లినప్పుడు మాత్రమే పారా క్రీడాకారులతో ఆడేది. మిగతా సమయాల్లో మామూలు ప్లేయర్స్‌‌తో ప్రాక్టీస్‌‌ చేస్తూ, కోర్టులో వేగంగా కదలడం, డైవ్‌‌లు చేయడం ఇలా అన్ని విషయాల్లో పట్టు సాధించింది. అలా అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది.

గెలుపుల బాటలో..

ప్రమాదానికి రెండు  నెలల ముందు 2011 లో జరిగిన కార్పొరేట్‌‌ బ్యాడ్మింటన్‌‌ టోర్నీలో మానసి విజేతగా నిలిచింది. ప్రమాదం తర్వాత  2012లో కృత్రిమ కాలితో అదే టోర్నీలో బరిలో దిగి, మహిళల సింగిల్స్‌‌ టైటిల్‌‌ గెలుచుకుంది. 2014 డిసెంబరులో మొదటి పారా బ్యాడ్మింటన్ టోర్నీ ఆడి సిల్వర్ గెలుచుకుంది.  అలా  ఇప్పటివరకు.. ఇంటర్నేషనల్ స్థాయిలో  మూడు గోల్డ్, ఐదు సిల్వర్, ఆరు బ్రాంజ్ మెడల్స్ సాధించింది.  అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు పారా బ్యాడ్మింటన్ టోర్నీలో ‘గోల్డ్ ’ దక్కించుకుని తానేంటో ప్రపంచానికి చాటిచెప్పింది.

మోటివేషనల్ స్పీకర్‌‌‌‌గా

జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా తనకు ఇష్టమైన బ్యాడ్మింటన్‌‌ను వదలకుండా, తాను కోర్టులోనే కాదు జీవితంలోనూ విజేతనని నిరూపించుకుంది. శరీరంలో ఒక భాగం కోల్పోయినంత మాత్రాన జీవితంలో ఇక ఏమీ సాధించలేమనే  భావనను దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా చాంపియన్‌‌గా నిలిచి ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. ఇలా తనని తాను ఇన్‌‌స్పైర్ చేసుకున్న మానసి ఎంతో మందిని కూడా ఇన్‌‌స్పైర్ చేస్తుంది. మోటివేషనల్ స్పీకర్‌‌‌‌గా మారి,  బిజినెస్‌‌ స్కూల్స్‌‌, ఇంజినీరింగ్‌‌ కాలేజీలు, కార్పొరేట్స్‌‌, ఎన్‌‌జీఓలు, ఇంటర్నేషనల్‌‌ స్కూల్‌‌లో గెస్ట్‌‌ లెక్చర్‌‌లు ఇస్తుంది.

ఫోకస్ అంతా దానిపైనే..

గెలుపు తర్వాత మానసి మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ చాంపియన్‌‌ అనిపించుకోవడం చాలా గర్వంగా ఉంది. అయితే ఈ సక్సెస్ అంత ఈజీగా  దక్కలేదు. దానికోసం ఎన్నో డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి విన్నింగ్ మూమెంట్ కోసం ఎంతో మంది క్రీడాకారులు నాలాగే  ఎదురుచూస్తుంటారు. నా ఎదురు చూపులు ఫలించినందుకు ఆనందంగా ఉంది.  ఇప్పటికైనా ఓ అథ్లెట్‌‌గా  నా జీవితం మారుతుంది అనుకుంటున్నా. ఈ పతకం సాధించడం కోసం నేను పడిన కష్టానికి తగిన గుర్తింపు, సాయం లభిస్తుందని ఆశిస్తున్నా. నా నెక్స్ట్ ఫోకస్ అంతా  వచ్చే ఏడాది జరగబోయే పారా ఒలింపిక్స్‌‌పైనే’’ అని చెప్పింది.