ఇన్​ఫార్మర్ల పేరుతో ఉపసర్పంచ్​, టీచర్ ​హత్య

ఇన్​ఫార్మర్ల పేరుతో ఉపసర్పంచ్​, టీచర్ ​హత్య

భద్రాచలం, వెలుగు:  ఛత్తీస్​గఢ్​  రాష్ట్రంలోని  చింతగుప్ప పోలీస్​స్టేషన్​ పరిధిలోని  తాడిమెట్లకు చెందిన ఆదివాసీలను 8 రోజుల కింద కిడ్నాప్​ చేసిన మావోయిస్టులు  గురువారం సాయంత్రం వారిని విడుదల చేశారు.   బుధవారం రాత్రి ప్రజాకోర్టు నిర్వహించి పోలీస్​ ఇన్​ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని తాము కిడ్నాప్​ చేసిన వారిలో ఉప సర్పంచ్ మాడవి గంగ,  టీచర్​ కొవ్వాసి సుక్కును హతమార్చారు.  మిగిలిన 13 మందిని వదిలిపెట్టారు. 

తాడిమెట్ల గ్రామానికి చెందిన 15 మందిని మావోయిస్టులు కిడ్నాప్​ చేసి తమ వెంట తీసుకెళ్లారు. అయితే ఉపసర్పంచ్​ మాడవి గంగను రెండేండ్ల కింద కూడా ఒకసారి కిడ్నాప్​ చేసి వదిలేశారు.  దీంతో ఈసారి కూడా ఏమీ చేయకుండానే వదిలేస్తారని భావించారు. కానీ ఆయనతో పాటు టీచర్​ను కూడా హత్య చేశారు. ఉపసర్పంచ్​గా  గంగ గ్రామస్తులకు ఆధార్​కార్డులు, రేషన్​ కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం నుంచి ఇప్పించారు. 

గ్రామంలోని పిల్లలకు సుక్కు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు.  వారి వల్ల ఉద్యమానికి ఇబ్బంది ఏర్పడిందని భావించిన  మావోయిస్టులు ఇన్​ఫార్మర్ల పేరుతో హత్య చేశారని  సుక్మా పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గంగ, సుక్కు డెడ్​బాడీలకు పోస్టుమార్టం చేసి అప్పగించినట్లు అందులో తెలిపారు.