మెదక్ జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో కదలిక..సర్వేకు రూ.1.08 కోట్లు మంజూరు

మెదక్ జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో కదలిక..సర్వేకు రూ.1.08 కోట్లు మంజూరు

 

  • పథకం పూర్తయితే 40 వేల ఎకరాలకు సాగునీరు 
  • ఐదు మండలాల రైతులకు ప్రయోజనం 

మెదక్/రేగోడ్, వెలుగు: మెదక్ జిల్లాలోని రేగోడు, అల్లాదుర్గం, టేక్మాల్, సంగారెడ్డి జిల్లాలోని అందోల్, వట్పల్లి మండలాలకు సాగు అవసరాలకు మంజీరా జలాలు అందించే దిశగా కార్యాచరణ మొదలైంది. ఆయా మండలాల రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు మోక్షం కలగనుంది.  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రతిపాదనల మేరకు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని పెద్దారెడ్డి పేట వద్ద మంజీరా నదిపై ఈ లిఫ్టును నిర్మించనున్నారు. 

తాజాగా సర్వే కోసం రూ.108 కోట్లు మంజూరు కావడంపై ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా పైప్ లైన్ అయితే ఎన్ని కిలోమీటర్లు వేయాలో, గ్రావిటీ ద్వారా చెరువులు నింపేందుకు ఉన్న అవకాశాలను గుర్తించనున్నారు. త్వరలో అధికారులు సర్వే ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆయా మండలాల్లో చెరువులు నింపితే 40,000 ఎకరాలకు సాగు  నీరు అందించే అవకాశం ఉంటుంది. సర్వే అనంతరం అధికారులు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్ ) రూపొందించి ప్రభుత్వానికి పంపించనున్నారు. 

కాళేశ్వరం పనులు జరగక..

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో  చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ 19 కింద సిద్దిపేట జిల్లాలో నిర్మించిన కొండ పోచమ్మ సాగర్ జలాశయం నుంచి పైప్ లైన్ ద్వారా సింగూర్ ప్రాజెక్టు నింపి అక్కడి నుంచి అందోల్ నియోజకవర్గంలోని అందోల్, వట్పల్లి, రేగోడ్, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాలకు సాగు నీటిని అందించే ప్రణాళిక రూపొందించారు. ఏళ్లు గడిచినా భూసేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో ఆయా మండలాలకు కాళేశ్వరం నీరు అందని ద్రాక్షే అయింది. ఈ క్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ చొరవతో ప్రత్యామ్నాయంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆలోచన ముందుకు వచ్చింది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సరిపడ నీళ్లు అందుతాయి

గత కొన్నేళ్లుగా సాగునీరు పూర్తి స్థాయిలో అందక అనుకున్న పంటలు పండించలేకపోయాం. వర్షాలపై ఆధారపడి సాగు చేసేవాళ్లం. ఈ లిఫ్ట్​ ఇరిగేషన్​ పూర్తయితే సాగుకు సరిపడ నీళ్లు అందుతాయి. అన్ని రకాల పంటలు పండించడానికి అవకాశం ఉంటుంది. బీడు భూములు కూడా సాగులోకి వచ్చే అవకాశం ఉంది. - చోటుమియా, రేగోడ్