కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. వెయిట్ లిఫ్టర్ గురురాజా పూజారి కాంస్య పతకాన్ని గెలిచారు. 61కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆయన ఈ మెడల్ ను దక్కించుకున్నారు. రెండు రౌండ్లు కలుపుకొని మొత్తం 269 కేజీల బరువును గురురాజా ఎత్తారు. మొదటి రౌండ్ లో 118 కేజీలు, రెండో రౌండ్ లో 151 కేజీల వెయిట్ ను లిఫ్ట్ చేశారు. 2018 కామన్వెల్త్ గేమ్స్ లోనూ గురురాజా రజత పతకాన్ని సాధించారు. ఇక ఈ మ్యాచ్ లో మలేషియాకు చెందిన అజ్నిల్ బిన్ బిదిన్ మహ్మద్ 285 కేజీల బరువెత్తి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. పపువా న్యూగినియా దేశానికి చెందిన మోరియా బారు 273 కేజీల బరువెత్తి రజతాన్ని దక్కించుకున్నారు.
తొలి మెడల్ సాధించిన సంకేత్ మహదేవ్ సర్గర్
కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియా బోణీ కొట్టింది. మన దేశానికి తొలి మెడల్ ను మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సర్గర్ సాధించిపెట్టారు. 55 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆయన రజత పతకం (సిల్వర్ మెడల్) కైవసం చేసుకున్నారు. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆయన రెండు రౌండ్లలో మొత్తం 248 కేజీల (113 కేజీలు + 135 కేజీలు) బరువును ఎత్తి రజత పతకాన్ని చేజిక్కించుకున్నారు. వాస్తవానికి సంకేత్ బంగారు పతకాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వెలువడ్డాయి. అయితే రెండో రౌండ్ లో 138 కేజీల బరువును ఎత్తే క్రమంలో సంకేత్ కుడి మోచేయికి గాయమైంది. దీంతో ఆయన 138 కేజీలకుగానూ 135 కేజీల బరువునే ఎత్తగలిగారు.
