డబ్ల్యూఎఫ్‌‌ఐపై సస్పెన్షన్‌‌ ఎత్తివేత

డబ్ల్యూఎఫ్‌‌ఐపై సస్పెన్షన్‌‌ ఎత్తివేత
  • సాక్షి, వినేశ్‌‌, బజ్‌‌రంగ్‌‌ను ఇబ్బంది పెట్టొద్దన్న  ఇంటర్నేషనల్‌‌ బాడీ

న్యూఢిల్లీ: రెజ్లింగ్‌‌ ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా(డబ్ల్యూఎఫ్‌‌ఐ)పై విధించిన తాత్కాలిక నిషేధాన్ని యునైటెడ్‌‌ వరల్డ్‌‌ రెజ్లింగ్‌‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) మంగళవారం ఎత్తి వేసింది. నిరసన తెలిపిన స్టార్‌‌ రెజ్లర్లు బజ్‌‌రంగ్‌‌ పూనియా, వినేశ్‌‌ ఫోగట్‌‌, సాక్షి మాలిక్‌‌ను ఇబ్బంది పెట్టొద్దని, వారిపై ఎలాంటి వివక్ష చూపెట్టొద్దని ఆదేశించింది. ఇందుకు సంబంధించి లిఖిత పూర్వక హామీని ఇవ్వాలని వెల్లడించింది.

సకాలంలో ఎన్నికలు నిర్వహించనందుకు గతేడాది ఆగస్టు 23న డబ్ల్యూఎఫ్‌‌ఐపై వరల్డ్‌‌ బాడీ సస్పెన్షన్‌‌ విధించింది. ‘ఈ నెల 9న సమావేశమైన యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్‌‌తో పాటు అన్ని అంశాలపై చర్చించింది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని సస్పెన్షన్‌‌ను ఎత్తి వేయాలని నిర్ణయించింది. ఒలింపిక్స్‌‌, ఇతర డబ్ల్యూఎఫ్‌‌ఐ ఈవెంట్లలో పాల్గొనే రెజ్లర్లకు ట్రయల్స్‌‌ నిర్వహించాలి. ఇందులో ఎలాంటి వివక్ష చూపకూడదు. ముఖ్యంగా బజ్‌‌రంగ్‌‌, వినేశ్‌‌, సాక్షిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు’ అని వరల్డ్‌‌ బాడీ పేర్కొంది.

బ్రిజ్‌‌భూషణ్‌‌పై లైంగిక ఆరోపణలు రావడంతో అతని ప్లేస్‌‌లో కొత్తగా సంజయ్‌‌ సింగ్‌‌ డబ్ల్యూఎఫ్‌‌ఐ చీఫ్‌‌గా ఎన్నికయ్యాడు. కానీ నేషనల్ స్పోర్ట్స్ కోడ్‌ను ఉల్లంఘించిందనే కారణంతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కొత్త కార్యవర్గంపై వేటు వేసి అడ్‌‌హక్‌‌ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు యూడబ్ల్యూడబ్ల్యూ గుర్తింపు లభించినందున అడ్‌‌హక్‌‌ కమిటీకి ఎటువంటి ప్రాముఖ్యత లేదని సంజయ్‌‌ సింగ్‌‌ అన్నాడు. ఒలింపిక్‌‌ ఏడాది కావడంతో త్వరలోనే అన్ని రకాల కేటగిరీల్లో ట్రయల్స్ నిర్వహిస్తామన్నాడు. రెజ్లర్ల భవిష్యత్‌‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చాడు.