తిరుమల TTD తరహాలో..అయోధ్య రామయ్య ఛానెల్..

తిరుమల TTD తరహాలో..అయోధ్య రామయ్య ఛానెల్..

అయోధ్య.. అయోధ్య.. జై శ్రీరాం ఇప్పుడు ఇదే నినాదం దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఉత్తర భారతంలోనే అతిపెద్ద ఆలయంగా.. దేశంలో మూడో అతి పెద్ద ఆలయంగా.. ప్రతి హిందూ పూజించే శ్రీ రాముడి జనవరి 22వ తేదీన తన దివ్య మంగళ స్వరూపంతో.. భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అయోధ్యకు ఉన్న విశిష్ఠత, రాముడు పుట్టిన నేలగా ఎంతో విశిష్ఠత ఉంది. అలాంటి రాముడిని..రాముడి ఆలయంలోని పూజలు, సేవలు వంటి వాటితోపాటు ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తిరుమల తరహాలో అయోధ్య ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు సంకల్పం చేశారు ఆలయ ట్రస్ట్ అధికారులు. 

ఈ క్రమంలోనే తిరుమల వేంకటేశ్వరస్వామికి ఉన్నట్లే ప్రత్యేక ఛానెల్ తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నారంట. తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే అన్ని సేవలు, ఉత్సవాలను చూపిస్తూ.. భక్తి సమాచారం ఇస్తూ.. తిరుమల కొండకు వచ్చే భక్తులకు విలువైన సూచనలు, సలహాలు ఇస్తూ శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇదే తరహాలో అయోధ్య కోసం ఓ ఛానెల్ తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నారంట.

అయోధ్యలో జరిగే నిత్య పూజలు, సేవలను, భక్తులకు కావాల్సిన సమాచారం ఇచ్చే విధంగా ఈ ఛానెల్ ను మొదట హిందీ భాషలో తీసుకురావాలనే ప్లాన్ ఉందంట. ఇప్పటికే టీటీడీ ఛానెల్ ఉండగా.. షిర్డీ సాయిబాబా, శ్రీశైలంతోపాటు ఇతర కొన్ని ప్రధాన ఆలయాల్లోని పూజలు, సేవలను 24 గంటలూ టెలికాస్ట్ అయ్యే విధానం ఉంది. షిర్డి, శ్రీశైలం యూట్యూబ్ ఛానెల్స్ గా ఉన్నాయి. టీటీడీ మాత్రమే శాటిలైట్ ఛానెల్ గా ఉంది. ఇప్పుడు తిరుమల టీటీడీ తరహాలోనే.. అయోధ్య రాముడి కోసం శాటిలైట్ ఛానెల్ తీసుకుని రావాలనే ఆలోచన చేస్తుంది ట్రస్ట్.. రాబోయే రోజుల్లో ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత.. పనులు అన్ని కొలిక్కి వచ్చిన తర్వాత ఆ ఛానెల్ ప్రారంభించే ఆలోచన చేస్తుందంట.. 

ఇప్పటికే అయోధ్యలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్ పోర్టు.. అదే తరహాలో రైల్వే టెర్మినల్, బస్టాండ్ తోపాటు ప్రముఖ హోటల్స్ అన్ని తమ బ్రాంచీలు ఓపెన్ చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఉండే భక్తులు అందరూ తిరుమల తరహాలో దర్శించుకునే విధంగా ప్రణాళిక రచిస్తున్నారు ఆలయ ట్రస్ట్ అధికారులు. ఈ విశిష్టతను విశ్వ వ్యాప్తం చేసే క్రమంలోనే ఈ ఛానెల్ ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం.