పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్సిటీకి కేంద్రం ఆమోద ముద్ర

పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్సిటీకి కేంద్రం ఆమోద ముద్ర
  • తెలంగాణ వాటా తేల్చేలా ట్రిబ్యునల్‌‌లో మార్పులకు కేంద్రం పచ్చజెండా
  • నీళ్ల పంపిణీ అంశాన్ని కేడబ్ల్యూడీటీ -2కు రిఫర్ చేసిన కేంద్ర కేబినెట్
  • పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్సిటీకి ఆమోద ముద్ర
  • వర్సిటీకి రూ. 899 కోట్లు కేటాయింపు
  • తెలంగాణకు మేలు కలిగేలా మూడు నిర్ణయాలు: అనురాగ్ ఠాకూర్

న్యూఢిల్లీ/హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నీళ్ల పంపకానికి లైన్ క్లియర్ అయింది. రెండు రాష్ట్రాల మధ్య ఏండ్లుగా నలుగుతున్న జల వివాదాన్ని పరిష్కరించేలా, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా తేల్చేలా ట్రిబ్యునల్‌‌లో పలు మార్పులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ (ఐఎస్ఆర్‌‌‌‌డబ్ల్యూడీ) యాక్ట్ – 1956లోని సెక్షన్​5(1) కింద నీళ్ల పంపిణీ అంశాన్ని కేడబ్ల్యూడీటీ -2 (బ్రజేశ్​ కుమార్​ ట్రిబ్యునల్)కు కేంద్ర కేబినెట్ రిఫర్ చేసింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తెలంగాణ పర్యటనలో భాగంగా మోదీ ప్రకటించిన పసుపు బోర్డు, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ట్రైబల్ యూనివర్సిటీ కోసం మొదటి దఫాగా రూ.889.07 కోట్ల కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీలో తీసుకొన్న ముఖ్య నిర్ణయాలను మీడియాకు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి, మురుగన్ వివరించారు. తెలంగాణకు మేలు చేసేలా మూడు నిర్ణయాలు తీసుకున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కోరిన మేరకు ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ (ఐఎస్ఆర్ డబ్ల్యూడీ) యాక్ట్ 1956 లో నిబంధనల మార్పుకు అంగీకరించినట్లు వెల్లడించారు. భవిష్యత్తు ప్రయోజనాల కోసం ఉద్దేశించిన పనుల కోసం రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వారీగా నీటిని ట్రిబ్యునల్ కేటాయిస్తుందన్నారు. ‘‘కేడబ్ల్యూడీటీ (కృష్ణా నీటి వివాదాల ట్రిబ్యునల్) టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌‌ను అందిస్తుంది. వాటి ప్రకారం భవిష్యత్తులో కృష్ణా నది నీటిని తెలంగాణ, ఏపీకి ట్రిబ్యునల్ పంపిణీ చేయనుంది” అని తెలిపారు. ‘‘తెలంగాణలో పసుపు బోర్డు, ట్రైబల్ వర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ములుగులో ఏర్పాటయ్యే ఈ వర్సిటీకి కోసం సెంట్రల్ యూనివర్సిటీస్ యాక్ట్ – 2009లో సవరణలకు ఆమోదం తెలిపింది’ అని అనురాగ్ ఠాకూర్ వివరించారు.

2021లో పిటిషన్‌‌ను వెనక్కి తీసుకోవడంతో..

ట్రిబ్యునల్​ఏర్పాటు చేసి, కృష్ణా నదిలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా తేల్చాలని తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం కోరుతున్నది. కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో పాటు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2020 అక్టోబర్​6న నిర్వహించిన రెండో అపెక్స్​కౌన్సిల్​సమావేశంలో ట్రిబ్యునల్​ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ పట్టుబట్టారు. సుప్రీంకోర్టులో పిటిషన్​పెండింగ్​లో ఉంది కాబట్టి ట్రిబ్యునల్​ ఏర్పాటుకు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని, దాన్ని విత్ డ్రా చేసుకుంటే ట్రిబ్యునల్​కు రిఫర్​చేసే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అప్పట్లో హామీ ఇచ్చారు. 2021 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్​ విత్​డ్రా చేసుకోగా, ట్రిబ్యునల్​ఏర్పాటు చేసే అంశంపై లీగల్​ఒపీనియన్‌‌ను కేంద్రం​కోరింది. న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఉనికిలో ఉన్న బ్రజేశ్​ ట్రిబ్యునల్​(కేడబ్ల్యూడీటీ -2)కు ఈ అంశాన్ని రిఫర్ ​చేసింది.  

ఏండ్లుగా కొనసాగుతున్న విచారణ..

కేంద్ర ప్రభుత్వం 2004 ఏప్రిల్​ రెండో తేదీన ఐఎస్ఆర్​డబ్ల్యూడీ యాక్ట్​లోని సెక్షన్​-3 ప్రకారం కృష్ణా వాటర్​ డిస్ప్యూట్స్​ట్రిబ్యునల్​-2 ను జస్టిస్ బ్రజేశ్ కుమార్​నేతృత్వంలో ఏర్పాటు చేసింది. కృష్ణా బేసిన్​లోని మహారాష్ట్ర, కర్నాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేసే బాధ్యతను ఈ ట్రిబ్యునల్​కు అప్పగించింది. తొమ్మిదేళ్ల పాటు ఈ ట్రిబ్యునల్​మదింపు చేసి 2013లో తీర్పు వెలువరించింది. బచావత్​ట్రిబ్యునల్​(కేడబ్ల్యూడీటీ -1) 75 శాతం డిపెండబులిటీ నీటి కేటాయింపులు చేసింది. బ్రజేశ్​ట్రిబ్యునల్​ దాన్ని సమీక్షించకుండా 65 శాతం డిపెండబులిటీ వద్ద లభ్యమయ్యే అదనపు జలాలను మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది. ఈ లెక్కన ఉమ్మడి ఏపీకి 1005 టీఎంసీలు, మహారాష్ట్రకు 666, కర్నాటకకు 907 టీఎంసీలను కేటాయించింది. బచావత్​ట్రిబ్యునల్​75 శాతం డిపెండబులిటీ వద్ద ఉమ్మడి ఏపీకి 811, మహారాష్ట్రకు 585, కర్నాటకకు 734 టీఎంసీలు కేటాయించింది. ఏపీ రీ ఆర్గనైజేషన్​యాక్ట్​2014లోని సెక్షన్​89 కింద తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పున: పంపిణీ బాధ్యతను బ్రజేశ్​ట్రిబ్యునల్​కు అప్పగించారు. ఇది​ రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై విచారణ జరుపుతోంది. రీ ఆర్గనైజేషన్​యాక్ట్​లోని సెక్షన్​89కు ఉన్న పరిమితుల దృష్ట్యా తెలంగాణకు న్యాయమైన వాటా దక్కే అవకాశం లేదని, ఐఎస్ఆర్​డబ్ల్యూడీ యాక్ట్​లోని సెక్షన్​-3 కింద కొత్త ట్రిబ్యునల్​ఏర్పాటు చేయాలని తెలంగాణ డిమాండ్​ చేసింది. తెలంగాణ కోరిన సెక్షన్​-3 ప్రకారం కాకుండా అదే యాక్ట్​లోని సెక్షన్​-5(1) ప్రకారం నీటి పంపకాలు చేయాలని ట్రిబ్యునల్​కు కేంద్ర ప్రభుత్వం రిఫర్ ​చేసింది.