ప్రభుత్వ సంస్థలు, వాటాలు బోర్డులే అమ్మొచ్చు

ప్రభుత్వ సంస్థలు, వాటాలు బోర్డులే అమ్మొచ్చు
  • డైరెక్టర్లకు సంస్థల ప్రైవేటీకరణ బాధ్యత
  • పెట్రోల్​లో 20% ఇథనాల్​ కలిపే టార్గెట్​ గడువు ఐదేండ్లు తగ్గింపు
  • అధికారాలు కట్టబెడుతూ కేంద్ర కేబినెట్​ నిర్ణయం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలంటే ఇప్పటిదాకా ప్రాసెస్​ చాలా పెద్దగా ఉండేది. కేంద్ర ప్రభుత్వం ఓకే అంటేనే మహారత్న, నవరత్న, మినీరత్న కేటగిరీల్లోని సంస్థలను అమ్మడానికి వీలుండేది. ఇకపై అంత హడావుడి లేకుండా సంస్థలను అమ్మేసే లేదా మూసేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం సులభతరం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి సబ్సిడరీలు, జాయింట్​ వెంచర్లలోని వాటాల అమ్మకాలు, స్ట్రాటజిక్​ డిజిన్వెస్ట్​మెంట్​(సంస్థల ప్రైవేటీకరణ/వేరే సంస్థలకు అధికార బదలాయింపు), సంస్థల మూసివేతపై పూర్తి అధికారాలను ఆయా సంస్థల బోర్డుల డైరెక్టర్లకే అప్పగించింది. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేలా పూర్తి అధికారాలనిచ్చింది. తద్వారా సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గించింది. 

వేలం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి లైన్​ క్లియర్​ చేసింది. పెట్టుబడుల ఉపసంహరణపై ఆయా సంస్థల బోర్డులు సమీక్షించి పెట్టుకునే విజ్ఞప్తి మేరకు ఆర్థిక మంత్రి, రోడ్డు రవాణా శాఖ మంత్రి, సంబంధిత శాఖల మంత్రులు సహా గ్రూప్​ ఆఫ్​ మినిస్టర్స్​తో ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయ యంత్రాంగం.. సంస్థల అమ్మకాలు, మూసివేతపై సూత్రప్రాయ ఆమోదం తెలపనుంది. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్​ బుధవారం ప్రకటనను జారీ చేసింది. సంస్థలు, వాటాల అమ్మక ప్రక్రియలో బిడ్డింగ్​ రూల్స్​, సంస్థ అమ్మకం/వాటా అమ్మకంపై విడుదల చేసే గైడ్​లైన్స్​ను ఫాలో కావాలని చెప్పింది. స్ట్రాటజిక్​ డిజిన్వెస్ట్​మెంట్​కు దీపమ్​ (డీఐపీఏఎం– డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఇన్వెస్ట్​మెంట్​ అండ్​ పబ్లిక్​ అసెట్​ మేనేజ్​మెంట్​), సంస్థల మూసివేతకు డీపీఈ (డిపార్ట్​మెంట్​ ఆఫ్​ పబ్లిక్​ ఎంటర్​ప్రైజెస్​)లు నియమాలను సిద్ధం చేస్తాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో సంస్కరణలను తీసుకొచ్చే ఈ ప్రతిపాదనల వల్ల సంస్థ బోర్డ్​ ఆఫ్​ డైరెక్టర్లకు స్వేచ్ఛ దొరుకుతుందని పేర్కొంది. నష్టాల్లో ఉండి ఇక పైకి రావు అనుకున్న సంస్థలను సరైన సమయంలో మూసేసేందుకు వీలు చిక్కుతుందని తెలిపింది. తద్వరా సంస్థలకు టైంతో పాటు భారీగా డబ్బు ఆదా అవుతుందని చెప్పింది. 

ఇప్పటిదాకా పెట్టుబడులపైనే అధికారం...
వాస్తవానికి ప్రస్తుతం మహారత్న, నవరత్న, మినీరత్న సంస్థల్లో కేవలం పెట్టుబడులు పెట్టే అధికారాలనే బోర్డు డైరెక్టర్లకు ఇచ్చారు. దాంతో పాటు ఇతర సంస్థలను వాటిలో కలిపేయడం, ఇతర సంస్థలను కొనుగోలు చేయడం వంటి అధికారాలూ ఉన్నాయి. కానీ, సంస్థలను మూసేయడం లేదా ఆ సంస్థల్లోని వాటాలను విక్రయించే అధికారాలు మాత్రం ఇప్పటిదాకా లేవు. ఈ నేపథ్యంలోనే కేంద్ర కేబినెట్​ తీసుకున్న నిర్ణయంతో బోర్డు డైరెక్టర్ల అధికారాలు విస్తృతమయ్యాయి. 

జీవ ఇంధన విధానాల్లో మార్పు
పర్యావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని జాతీయ జీవ ఇంధన విధానాల్లో కేంద్ర కేబినెట్​ పలు సవరణలను చేసింది. పెట్రోల్​లో 20 శాతం ఇథనాల్​ను కలిపే టార్గెట్​ను ఐదేండ్లు ముందుకు జరిపింది. ఇంతకుముందు అనుకున్నట్టు 2030 కాకుండా.. 2025–26 నాటికి ఆ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్దేశించింది. అంతేగాకుండా భవిష్యత్​లో విదేశాల నుంచి పెట్రోలియం ప్రొడక్టులను దిగుమతి చేసుకోవడాన్ని తగ్గించుకునేలా మన దేశ అవసరాలకు తగ్గట్టు జీవ ఇంధన తయారీ సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహాన్నివ్వాలని నిర్ణయించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బయో ఫ్యూయెల్స్​ను ఎగుమతి చేసేందుకు కూడా అనుమతినిచ్చింది.