చాలా మంది మహిళలు జాబ్​ వొద్దంటున్రు

చాలా మంది మహిళలు జాబ్​ వొద్దంటున్రు
  • ఫ్లెక్సిబిలిటీ లేక మహిళల రాజీనామా
  • వెల్లడించిన లింక్​డ్​ ఇన్​ సర్వే

న్యూఢిల్లీ: నచ్చిన షిఫ్ట్​లో పనిచేసే అవకాశం లేకపోవడం వంటి సమస్యల (ఫ్లెక్సిబిలిటీ) కారణంగా చాలా మంది మహిళలు జాబ్​ ఆఫర్లను తిరస్కరిస్తున్నారని, రాజీనామాలు చేస్తున్నారని లింక్డ్‌‌ఇన్ స్టడీ వెల్లడించింది. భారతదేశంలోని మహిళా ఉద్యోగులు ఆఫీసుల్లో ఫ్లెక్సిబిలిటీని డిమాండ్ చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఈ స్టడీ రిపోర్టు ప్రకారం.. అనువైన పని వాతావరణం లేకపోవడం మహిళా ఉద్యోగుల రాజీనామాలకు ముఖ్యమైన కారణం.  ఫ్లెక్సిబుల్ వర్కింగ్ సదుపాయాన్ని ఇచ్చే కంపెనీలు జీతంలో కోతలు పెడుతున్నాయి.  కనీసం 83 శాతం మంది వర్కింగ్ మహిళలు తాము మరింత ఫ్లెక్సిబిలిటీతో పని చేయాలని కోరుకుంటున్నారు. తమకు అనువైన విధంగా పని చేయడానికి ఒప్పుకోకపోవడం వల్ల 72 శాతం మంది వర్కింగ్ విమెన్​.. జాబ్​ ఆఫర్లను తిరస్కరించారు.   ఇదే కారణంతో 70 శాతం మంది ఇప్పటికే తమ ఉద్యోగాలను వదులుకున్నారు. ఫ్లెక్సిబుల్​ వర్కింగ్​ వల్ల ఏం లాభమని అడగ్గా..  ప్రతి ఐదుగురిలో ఇద్దరు మహిళలు తమ వర్క్–​లైఫ్​బ్యాలెన్స్​ (43 శాతం) మెరుగుపడుతుందని అన్నారు. కెరీర్‌‌కు  మేలు జరుగుతుందని 43 శాతం మంది చెప్పారు. మానసిక ఆరోగ్యం బాగుంటుందని ప్రతి ముగ్గురిలో ఒకరు (34 శాతం) చెప్పారు.  ప్రస్తుత ఉద్యోగాలను కొనసాగించడానికి ఇబ్బంది ఉండదని 33 శాతం మంది అన్నారు.  ఫ్లెక్సిబిలిటీనీ అడగడం వల్ల జీతంలో కోత పడిందని  ప్రతి పది మందిలో తొమ్మిది మంది (88 శాతం) చెప్పారు. ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడానికి తమ సంస్థ తిరస్కరించిందని దాదాపు ప్రతి ఐదుగురిలో ఇద్దరు (37 శాతం) చెప్పారు. సౌకర్యమైన పని విధానం కోసం ఉన్నతాధికారులను ఒప్పించడానికి చాలా కష్టపడ్డామని  ప్రతి నలుగురిలో ఒకరు వివరించారు. పక్షపాతం చూపడం, ప్రమోషన్లు ఇవ్వకపోవడం, ఓవర్​ టైం చేయించడం వంటి సమస్యల వల్ల మహిళా ఉద్యోగులు ఫ్లెక్సిబిలిటీ అడిగేందుకు వెనుకాడుతున్నారని లింక్​డ్​ఇన్​ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ రుచీ ఆనంద్​ వివరించారు.

కెరీర్​ బ్రేక్​..

కుటుంబ పనులు, కెరీర్​ మధ్య మహిళలు నలిగిపోతున్నారు. కుటుంబం కోసం, కొత్త ఉద్యోగం కోసం కొన్నిసార్లు ఉద్యోగాలను వదిలేయాల్సి వచ్చిందని సర్వేలో పాల్గొన్న వారిలో 78 శాతం మంది పేర్కొన్నారు. కెరీర్​ బ్రేక్​ సమయంలో కొత్త స్కిల్స్​ చేర్చుకున్నామని ప్రతి పది మందిలో తొమ్మిది మంది చెప్పారు. కెరీర్​ బ్రేక్​ వల్ల మరింత మెరుగ్గా పనిచేయగలిగామని చెప్పిన వారి సంఖ్య 77 శాతం వరకు ఉంది. అయితే కొత్త ఉద్యోగానికి ఇంటర్వ్యూ సమయంలో కెరీర్​ బ్రేక్​గురించి గుచ్చిగుచ్చి అడిగారని అన్నారు. కెరీర్ బ్రేక్​పై కంపెనీల్లో చాలా అపోహలు ఉన్నాయని వివరించారు. కెరీర్​బ్రేక్​లను కంపెనీలు ఇష్టపడవని తెలిసి తాము ఇప్పుడున్న ఉద్యోగంలోనే కొనసాగుతున్నామని 42 శాతం మంది వివరించారు. కెరీర్​ బ్రేక్​ లేదని అబద్ధాలు చెప్పామని కొందరు వెల్లడించారు.