
సింహానికి ఆకలేస్తే గడ్డి తింటుందా? తినదని ఓ సామెత ఉంది కదా! ఇంకో సామెత కూడా ఉంది.. కడుపు కాలితే గుర్రం కూడా వరిగడ్డి తింటుందన్నది మన పెద్దలు ఎప్పుడూ చెప్పే సామెత. ఇదిగో ఈ సింహం కూడా గడ్డి తిన్నది. కానీ, దానికీ ఓ కారణముంది. అది ఆకలేసి గడ్డిని మేయలేదు. పాడైన కడుపును క్లీన్ చేసుకోవడానికి ఇలా తిన్నది. గుజరాత్లోని గిర్ అడవుల్లో ఈ మృగరాజు గడ్డితింటూ కనిపించాడు.
ఆ వీడియో ట్విట్టర్లో వైరల్ అవడంతో నెటిజన్లు సరదా కామెంట్లు చేశారు. బహుశా ఈ సింహం, శాకాహారి అయి ఉండొచ్చంటూ కామెంట్లు చేశారు. మరికొందరు యూజర్లు, సింహం గడ్డి తినడం వెనక కారణాలు కనిపెట్టారు. అదే కామెంట్ చేశారు. ‘‘నిజానికి సింహాలు మాంసమే తింటాయి. ఆ జంతు మాంసానికి ఉండే వెంట్రుకలు, ఎముకలు, ఈకల వంటి వాటిని అవి అరిగించుకోలేవు. అందుకే కడుపును క్లీన్ చేసుకునేందుకు వాటి భోజనానికి ఎంతో కొంత ఫైబర్ అవసరం కదా. ఆ ఫైబర్ కోసమే గడ్డిని తింటాయి. ఆ తర్వాత తిన్న ఆ గడ్డితో సహా లోపల ఉండిపోయే వెంట్రుకలు, ఎముకలను బయటకు కక్కేస్తాయి. వాటి కడుపు, పేగులను శుభ్ర పరుచుకుంటాయి” అంటూ ఓ యూజర్ ట్వీట్ చేశాడు.