- పుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి బ్రహ్మరథం
- మెస్సీ – అపర్ణ జట్టుపై సీఎం రేవంత్ – సింగరేణి జట్టు విజయం
- 50 నిమిషాలపాటు అలరించిన మెస్సీ.. ‘థాంక్యూ హైదరాబాద్’ అంటూ ఫిదా
- రెండు గోల్స్ కొట్టిన రేవంత్.. హాజరైన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
- కోల్కతా ఘటన నేపథ్యంలో 3వేలకు పైగా పోలీసులతో భారీ భద్రత
హైదరాబాద్, వెలుగు: ‘మెస్సీ.. మెస్సీ.. రేవంత్.. రేవంత్’ అంటూ ఉప్పల్ స్టేడియం హోరెత్తింది. పుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి హైదరాబాద్ బ్రహ్మరథం పట్టింది. ఆయనతో సీఎం రేవంత్‌రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. సింగరేణి ఆర్ఆర్9 టీమ్, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ టీమ్ మధ్య శనివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. మెస్సీని చూసి యూత్ మైమరిచిపోయింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ తన ఇద్దరు టీమ్ మేట్స్రోడ్రిగో, లూయిస్ సూరెజ్తో కలిసి ఉప్పల్ స్టేడియంలోకి అడుగుపెట్టిన లియోనల్ మెస్సీ.. ఇక్కడి జనం తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు ఫిదా అయ్యారు.
ప్రేక్షకుల గ్యాలరీ వైపు చూస్తూ ‘థాంక్యూ హైదరాబాద్’ అంటూ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు సింగరేణి తరఫున బరిలో దిగిన సీఎం రేవంత్‌రెడ్డి ఏకంగా రెండు గోల్స్ కొట్టారు. ఫుట్ బాల్ డ్రిబ్లింగ్లోనూ మెస్సీతో సీఎం పోటీ పడ్డారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరై.. ఆసక్తిగా ఆటను తిలకించారు. అనంతరం విన్నర్స్, రన్నర్స్ టీమ్‌లకు మెస్సీ, సీఎం రేవంత్‌తో కలిసి రాహుల్బహుమతులు ప్రదానం చేశారు. స్టేడియంలో లియోనల్ మెస్సీ, సీఎం రేవంత్‌రెడ్డి 50 నిమిషాలకు పైగా ఉండగా.. ఆ టైంలో స్టేడియం మొత్తం కేరింతలతో హోరెత్తింది.
ఇద్దరు టీమ్ మేట్స్తో కలిసి వచ్చిన మెస్సీ
‘గోట్టూర్2025’లో భాగంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ శనివారం ఉదయం భారతదేశానికి విచ్చేశారు. ముందుగా కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక విమానంలో సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయన వెంట ఇంటర్ మియామి టీమ్ మేట్స్ రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ కూడా ఉన్నారు. వారికి అభిమానులు ఘన స్వాగతం పలికారు.
మొదట హైదరాబాద్‌లోని తాజ్ఫలక్నామా ప్యాలెస్‌కు మెస్సీ చేరుకున్నారు. అక్కడ ఈవెంట్ నిర్వాహకులు సుమారు 45 నిమిషాల పాటు ‘మీట్ అండ్ గ్రీట్’ నిర్వహించారు. వివిధ రంగాలకు చెందిన వారిలో ముందుగానే సెలెక్ట్ చేసిన సుమారు 200 మందికి పైగా మెస్సీతో ఫొటోలు దిగడానికి ఏర్పాట్లు చేశారు. ఈ ఈవెంట్ కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 9.85 లక్షల చొప్పున ఫీజు తీసుకున్నారు. ఈ డబ్బులను యూనిసెఫ్ చారిటీ కోసం వినియోగిస్తామని ప్రకటించారు. అనంతరం మెస్సీ ప్రత్యేక కాన్వాయ్‌లో రాత్రి 8.12 గంటలకు ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు.
గోల్స్ కొట్టిన సీఎం రేవంత్
మెస్సీ పర్యటన నేపథ్యంలో చేపట్టిన చారిటీ ఫుట్ బాల్ మ్యాచ్ రాత్రి 7.45 గంటలకు ఉప్పల్ స్టేడియంలో స్టార్ట్ చేశారు. సింగరేణి ఆర్ఆర్9 టీమ్ రెడ్ జెర్సీలో, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ టీమ్స్బ్లూ అండ్ వైట్ జెర్సీ ధరించి బరిలోకి దిగాయి. ఒక్కో టీమ్‌లో ఏడుగురు సభ్యులున్నారు. 24 నిమిషాల పాటు జరిగిన ఆట మధ్య భాగంలో సీఎం రేవంత్ ఎంటరయ్యారు.
సింగరేణి ఆర్ ఆర్ 9 టీమ్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఆయన.. రాత్రి 8.09 గంటలకు జెర్సీ నెంబర్ 9 ధరించి ఇంటర్నేషన్ ఫుట్‌బాలర్ డ్రెస్ కోడ్‌లో స్టేడియంలోకి ప్రవేశించారు. అప్పటికే మొదలైన ఆటలో పాల్గొన్నారు. మూడు నిమిషాలకే సీఎం రేవంత్ ఒక ఫీల్డ్ గోల్ కొట్టి హౌరా అనిపించారు. రెండు గోల్ పోస్ట్ ల మధ్యన ప్రత్యర్థి డిఫెండర్లను తప్పించుకుంటూ వెళ్లి బాల్‌ను గోల్ పోస్ట్‌లోకి కొట్టడంతో ఒకే సారి స్టేడియం అంతా మారుమ్రోగిపోయింది.
‘సీఎం.. సీఎం.. రేవంత్.. రేవంత్’ అంటూ ప్రేక్షకులు అంతా చప్పట్లతో అభినందించారు. సీఎం స్టేడియంలోకి ఎంటరైన నాలుగు నిమిషాల తర్వాత 8.13 గంటలకు మెస్సీ తన ఇద్దరు టీమ్ మేట్స్ రోడ్రిగో, లూయిస్ సువారెజ్‌తో కలిసి గ్రౌండ్లోకి వచ్చారు. అప్పటికే మ్యాచ్ ఆడుతున్న సీఎం రేవంత్ వెంటనే మెస్సీ వద్దకు చేరుకొని.. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు.
సీఎం రేవంత్‌తో కలిసి మెస్సీ కాసేపు గ్రౌండ్లో తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపు ఫుట్‌బాల్‌తో డ్రిబ్లింగ్ చేశారు. మధ్య మధ్యలో స్టేడియం చుట్టూరా తిరుగుతూ.. ఈవెంట్ మేనేజర్లు ఏర్పాటు చేసిన మూడు చోట్ల లోకల్ ప్లేయర్లతో కలిసి గ్రౌండ్లో ఫుట్ బాల్ ఆడారు. తన డ్రిబ్లింగ్ స్టైల్ చూపించారు. తన ఫ్యాన్స్ కోసం మూడు నాలుగు ఫుట్ బాల్స్‌ను స్టేడియంలోకి కొట్టారు. ఆ బాల్స్ అందుకోవడానికి ప్రేక్షకులు పోటీ పడ్డారు. బాల్ అందుకున్న వాళ్లు వాటిని మెస్సీ గుర్తుగా తమ వద్దనే ఉంచుకున్నారు. రోడ్రిగో, సూరజ్ సైతం కొన్ని బాల్స్‌ను స్టేడియం నుంచి ప్రేక్షకుల్లోకి కొట్టారు.
షూటౌట్ ఎంజాయ్ చేసిన మెస్సీ
చారిటీ మ్యాచ్‌లో భాగంగా సింగరేణి ఆర్ఆర్9 టీమ్, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్టీమ్ మధ్య షూటౌట్ నిర్వహించారు. ఇందులో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా పాల్గొన్నారు. ముందుగా సింగరేణి, అపర్ణ టీమ్స్ ప్లేయర్స్ గోల్స్ కొట్టారు. ఆ తర్వాత రెండు టీమ్‌ల తరఫున అమ్మాయిలు ఫుట్‌బాల్స్‌ను గోల్ పోస్ట్‌లోకి పంపడానికి ప్రయత్నించగా.. ఇద్దరు గోల్ కీపర్లు ఆపేశారు. దీంతో మూడో ఛాన్స్‌ను సింగరేణి టీమ్ తీసుకొని గోల్ సాధించింది. ఇక నాలుగో గోల్‌ను సీఎం రేవంత్ సాధించారు.
షూటవుట్ పొజిషన్ నుంచి బాల్‌ను గోల్‌పోస్ట్‌లోకి తన్నడంతో మెస్సీ కూడా చప్పట్లు కొడుతూ రేవంత్‌ను అభినందించారు. మొత్తానికి అపర్ణ మెస్సీ టీమ్‌పై సింగరేణి ఆర్ఆర్ టీమ్విజయం సాధించింది. దీంతో పోటీలో పాల్గొన్న రెండు టీమ్‌లతో మెస్సీ ఫొటో షూటవుట్కార్యక్రమం జరిగింది. ఈ సమయంలో కొందరు ప్లేయర్లు తమ టీ షర్ట్‌లపై, ఫుట్ బాల్స్‌పై మెస్సీ ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు.
థ్యాంక్యూ హైదరాబాద్: మెస్సీ
సీఎం రేవంత్‌తో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రేక్షకులను ఉద్దేశించి ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కొద్దిసేపు మాట్లాడారు. ‘‘మీ అందరి ఆప్యాయతలకు చాలా ధన్యవాదాలు. మీకందరికి కృతజ్ఞతలు. థాంక్యూ హైదరాబాద్’’ అని ఆయన పేర్కొన్నారు. రోడ్రిగో డి పాల్ మాట్లాడుతూ ‘‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది చాలా ప్రత్యేకమైన రాత్రి. మీ ప్రేమ, ఆప్యాయతలకు చాలా ధన్యవాదాలు’’ అని తెలిపారు. లూయిస్ సువారెజ్ మాట్లాడుతూ .. ‘‘అందరికీ శుభ సాయంత్రం. మీ ప్రేమకు ధన్యవా దాలు. . అందరికీ బిగ్ హగ్’’ అని పేర్కొన్నారు.
ముందుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణకు మెస్సీకి స్వాగతం. ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అవుతోంది. రైజింగ్‌లో పాలుపంచుకోవడానికి రండి’’ అని మెస్సీకి మైక్ అప్పగించే ముందు అన్నారు. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం ఇప్పుడు ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించను న్నారని పేర్కొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం మెస్సీ తన ఇద్దరు సహచరులతో కలిసి తాజ్ ఫలక్నామా ప్యాలెస్‌కు తిరిగి వెళ్లిపోయారు.
ప్రియాంక పిల్లలతో వచ్చిన రాహుల్
మ్యాచ్ బహుమతి ప్రదానోత్సంలో మెస్సీతో పాటు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చీఫ్ గెస్ట్లుగా పాల్గొ న్నారు. విన్నర్స్‌గా నిలిచిన సింగరేణి ఆర్ఆర్ 9 టీమ్‌కు మెస్సీ ట్రోఫి అందజేశారు. రన్నర్స్‌గా నిలిచిన మెస్సీ ఆల్‌స్టార్స్ టీమ్‌కు సీఎం రేవంత్ ట్రోఫీ బహుకరించారు. ఈ చారిటీ మ్యాచ్ వీక్షించడానికి తన సోదరి ప్రియాంక గాంధీ పిల్లలతో రాహుల్ ప్రత్యేక విమానంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు.
ఉప్పల్ స్టేడియంలో ఆయన కోసం ప్రత్యేకంగా గ్యాలరీలో కుర్చీలు వేశారు. గంట పాటు రాహుల్ మ్యాచ్ చూశారు. తర్వాత ట్రోపీ అందజేసే సమయంలో మెస్సీతో మాట్లాడుతూ రాహుల్ కొద్దిసేపు సరదాగా గడిపారు. మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ తిరిగి ఢిల్లీకి వెళ్లారు. కాగా, మ్యాచ్ ప్రారంభంలో నిర్వహించిన లేజర్ షో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
