జూకు కొత్తకళ .. కాకతీయ పార్కులో చిరుతలు, బెంగాల్‍ టైగర్‍, అడవి దున్నలు, తెల్ల పులులు

జూకు కొత్తకళ .. కాకతీయ పార్కులో చిరుతలు, బెంగాల్‍ టైగర్‍, అడవి దున్నలు, తెల్ల పులులు
  • త్వరలో రానున్న సింహం, వైల్డ్​ డాగ్‍, హైనా, స్నేక్స్​
  • పార్కులో చివరి దశలో అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ పనులు
  • మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి ప్రత్యేక చొరవ 

వరంగల్, వెలుగు: ఓరుగల్లు కాకతీయ జూపార్క్​కు మహర్దశ వచ్చింది. 40 ఏండ్ల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‍ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టడంతో పార్కు ఇప్పుడు కలర్​ఫుల్​గా మారుతోంది. పార్కుకు ఒక్కొక్కటిగా కొత్త వన్యమృగాలను తీసుకురావడంతో కళకళలాడుతోంది.  

1985లో మినీ జూపార్కుగా ప్రారంభం 

వరంగల్‍ కాకతీయ జూపార్కును దాదాపు 48 ఏకరాల విస్తీర్ణంలో 1985లో అప్పటి రాష్ట్ర గవర్నర్ శంకర్‍ దయాల్‍ శర్మ 'మినీ జూ'గా ప్రారంభించారు. 2014 జనవరిలో 'స్మాల్ జూ' కేటగిరిలో గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఇందులో పాలిచ్చే జాతులకు చెందిన పులులు, దుప్పులు 134, సరీసృపాలకు (రెప్టైల్స్) చెందిన మొసళ్లు, తాబేళ్లు, ఊసరవెళ్లి వంటివి 89, నెమళ్లు, చిలుకలు, అడవి కోళ్లు, లవ్‍ బర్డ్స్​ వంటి పక్షి జాతికి చెందినవి 196 పర్యాటకులను అలరిస్తున్నాయి. మొన్నటివరకు సెలవులు, శని, ఆదివారాల్లో 1000 నుంచి 1200 వరకు పర్యాటకులు వచ్చేవారు. ప్రస్తుతం పెద్ద పులులు, అడవి దున్నలు, తెల్ల పులిరాకతో ఈ సంఖ్య 1800 నుంచి 2 వేలకు చేరింది.

త్వరలోనే మరిన్ని జంతువులు.. 

కాకతీయ జూపార్క్​కు మరిన్ని జంతువులను తీసుకురానున్నారు. జూ అభివృద్ధికి అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవ చూపారు. ఏండ్ల తరబడి ఉన్న పెద్ద పులుల హామీని నెరవేర్చారు. జూలోకి జతగా ఉండే ఆడ (కరీనా), మగ (శంకర్‍) పెద్దపులులు, అడవి దున్నలు, హాగ్‍ డీర్‍, బార్కింగ్‍ డీర్లను ఓరుగల్లు జూకు తరలించారు. మంత్రి సురేఖ అతిథిగా హాజరై పులులను ఎన్‍క్లోజర్‍లోకి వదిలే క్రమంలో 4 వన్య ప్రాణులను దత్తత తీసుకున్నారు. సొంతంగా రూ.2 లక్షలు చెల్లించి ఏడాది పాటు వాటికి ఆహారం, సంరక్షణకు ముందుకొచ్చారు. ఈ నెల 18న తెల్ల పులిని (చరణ్‍) తీసుకువచ్చారు. త్వరలోనే సింహం, మరో ఆడపులి, హైనా, వైల్డ్​ డాగ్స్​తోపాటు వివిధ రకాల స్నేక్స్​ తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆకర్షించేలా ఏర్పాట్లు..

కాకతీయ జూపార్క్​ అభివృద్ధికి మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాయిని చొరవ తీసుకుంటున్నారు. పెద్ద పులులు, అడవి దున్నలు, బార్కింగ్‍ డీర్లతోపాటు ఇటీవల తెల్ల పులి కూడా వచ్చింది. మంత్రి ఆదేశానుసారం వరంగల్‍ జూలోకి త్వరలో సింహం, ఆడ పులి, జాకల్‍, స్నేక్స్, హైనా వంటివి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. పర్యాటకులను ఆకర్షించడానికి, సౌకర్యవంతంగా ఉండేలా కొత్త ఎన్‍క్లోజర్లు, అండర్‍ డ్రైనేజీ, సీసీ రోడ్లు, టాయిలెట్ల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

 బి.మయూరి (జూపార్క్​ రేంజ్‍ ఆఫీసర్‍)

రూ.5 కోట్లతో కొత్త ఎన్‍క్లోజర్లు

అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి కాకతీయ జూపార్క్​ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. హనుమకొండ హంటర్‍రోడ్‍లోని జూపార్క్​ చుట్టూరా కాలనీలు వెలిశాయి. పార్క్ ఏరియా డౌన్‍లో ఉండటంతో కాలనీల్లోని మురుగు జూపార్కులోకి చేరి వాసన వచ్చేది. దీనికి చెక్‍ పెట్టేలా గ్రేటర్‍ కార్పొరేషన్‍ నుంచి రూ.కోటితో పార్కులో అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ పనులు చేపట్టారు. రూ.4 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. 

ఇందులో రూ.కోటితో సింహం ఎన్‍క్లోజర్‍, నైట్‍ షెల్టర్‍ గదులు, రూ. కోటితో అద్దాలతో స్నేక్‍ ఎన్‍క్లోజర్లు, మరో రూ.కోటితో వైల్డ్​ డాగ్‍, జాకెల్‍, హైనా వంటి వాటికోసం ఎన్‍క్లోజర్లు, నైట్‍ షెల్టర్లు, రూ.60 లక్షలతో పార్కులో సీసీ రోడ్లు, రూ.20 లక్షలతో ప్రస్తుతం పాతపడిన బర్డ్స్​ఎన్‍క్లోజర్ల మార్పులు, రూ.25 లక్షలతో చిరుతలు, పులులకు సౌకర్యవంతంగా ఎన్‍క్లోజర్‍ డెవలప్‍మెంట్‍, రూ.20లక్షలతో పర్యాటకుల కోసం టాయిలెట్ల నిర్మాణం చేపట్టనున్నారు.