- ఉమ్మడి జిల్లాలో 18 రోజుల్లో రూ.253.56 కోట్ల సేల్స్
- లాస్ట్ డిసెంబర్ తో పోలిస్తే అదనంగా రూ.95 కోట్ల లిక్కర్విక్రయం
- డిసెంబర్ 31 అమ్మకాలు కూడా పెరగొచ్చని అంచనా
కరీంనగర్, వెలుగు: లాటరీ గెలుచుకొని కొత్త వైన్స్ ప్రారంభించిన వ్యాపారులకు మొదటి నెలలోనే డబుల్ ధమాకా దక్కింది. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల వల్ల నిరుడు డిసెంబర్ 18 రోజులతో పోల్చితే ఈసారి 70 శాతం అమ్మకాలు పెరిగాయి. ఉమ్మడి కరీంనగర్జిల్లాలో గతడాదితో పోలిస్తే అదనంగా రూ.95 కోట్ల సేల్స్ పెరిగాయి. త్వరలో డిసెంబర్31 వేడుకలు ఉండటంతో విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
కలిసొచ్చిన పంచాయతీ ఎన్నికలు..
గ్రామ పంచాయతీ ఎన్నికలు మద్యం వ్యాపారులకు బాగా కలిసొచ్చాయి. షాప్ ఓపెనింగ్ చేసేటప్పుడు ఫుల్ స్టాక్ తెచ్చుకోగా మొదటి వారం రోజుల్లోనే అయిపోయింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు దావత్ ల కోసం, చివరి రోజు పంచేందుకు భారీగా ఆర్డర్స్ పెట్టడంతో వ్యాపారులు డిపోల నుంచి అదనంగా లిక్కర్ తీసుకొచ్చి స్టాక్ పెట్టుకున్నారు.
జిల్లాల వారీగా విక్రయాలు..
కరీంనగర్ జిల్లాలో నిరుడు డిసెంబర్ 1 నుంచి 18 వరకు 59,926 కేసుల లిక్కర్, 81,566 కేసుల బీర్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 18 వరకు 83,349 కేసుల లిక్కర్, 84, 028 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. నిరుడు రూ.60.99 కోట్ల అమ్మకాలు జరిగితే ఈసారి రూ.89.89 కోట్లకు సేల్స్ పెరిగాయి.
పెద్దపల్లి జిల్లాలో నిరుడు డిసెంబర్ 1 నుంచి 18 వరకు 39,010 కేసుల లిక్కర్, 50,935 కేసుల బీర్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 18 వరకు 57,090 కేసుల లిక్కర్, 49,803 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. నిరుడు రూ.37.60 కోట్ల అమ్మకాలు జరిగితే ఈసారి రూ.58.30 కోట్లకు విక్రయాలు పెరిగాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరుడు డిసెంబర్ 1 నుంచి 18 వరకు 25,543 కేసుల లిక్కర్, 44,682 కేసుల బీర్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 18 వరకు 38,941 కేసుల లిక్కర్, 47,596 కేసుల బీర్లు విక్రయించారు. నిరుడు రూ.27.11 కోట్ల అమ్మకాలు జరిగితే ఈసారి రూ.42.83 కోట్లకు సేల్స్ పెరిగాయి.
జగిత్యాల జిల్లాలో నిరుడు డిసెంబర్ 1 నుంచి 18 వరకు 31,592 కేసుల లిక్కర్, 54,214 కేసుల బీర్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 18 వరకు 55,775 కేసుల లిక్కర్, 79,612 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గతేడాది రూ.32.51 కోట్ల అమ్మకాలు జరిగితే ఈసారి రూ.62.54 కోట్లకు విక్రయాలు పెరిగాయి. ఈ జిల్లాలో సేల్స్ దాదాపు డబుల్ కావడం గమనార్హం. ఎక్కడా లేని విధంగా చలికాలంలోనూ ఇక్కడ బీర్ల అమ్మకాలు భారీగా జరగడం విశేషం. ఉమ్మడి జిల్లాలో గతేడాది డిసెంబర్1 నుంచి 18 వరకు మొత్తం రూ.158.21 కోట్ల లిక్కర్అమ్మకాలు జరిగితే ఈసారి రూ.253.56 కోట్లకు పెరగడం గమనార్హం.
