లిక్కర్‌‌ స్కామ్‌ నిందితులను అరెస్ట్ చేయాలి : భవానీ రెడ్డి

లిక్కర్‌‌ స్కామ్‌ నిందితులను అరెస్ట్ చేయాలి :  భవానీ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై సమగ్ర విచారణ జరిపించి నిందితులను అరెస్ట్ చేయాలని పీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి డిమాండ్ చేశారు. కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసే సమయంలో మహిళా అధికారిపై కేటీఆర్ దురుసుగా ప్రవర్తించారని, ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. శనివారం గాంధీ భవన్‌లో పీసీసీ అధికార ప్రతినిధులు లింగం యాదవ్, జ్ఞాన సుందర్, రియాజ్‌లతో కలిసి మీడియాతో ఆమె మాట్లాడారు. 

ఎలక్షన్స్ వస్తున్నాయంటే చాలు.. ఆయా రాష్ట్రాలకు మోదీ, ఈడీ ఇద్దరు కలిసే వస్తారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారలోకి వచ్చిన వెంటనే 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని  పీసీసీ అధికార ప్రతినిధి రియాజ్ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు జాబ్‌ నోటిఫికేషన్‌ ఇచ్చామని, ప్రస్తుతం వేగంగా ఈ ప్రాసెస్ జరుగుతుందని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నిరుద్యోగులు మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్‌పై దాడి చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్‌ రావు కామెంట్లు అర్ధ రహితంగా ఉన్నాయని జ్ఞాన సుందర్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలో భాగంగానే కవిత అరెస్ట్ అయిందని లింగం యాదవ్ పేర్కొన్నారు.