లిక్కర్​ స్కామ్​ సొమ్ములో రూ. 70 లక్షలు గోవా ఎన్నికల్లో వాడిన ఆప్

లిక్కర్​ స్కామ్​ సొమ్ములో రూ. 70 లక్షలు గోవా ఎన్నికల్లో వాడిన ఆప్
  • కవిత, మాగుంట,ఆప్​ నేతల నడుమ చేతులు మారిన రూ.100 కోట్లు​
  • స్కామ్​లో ఢిల్లీ సీఎం అనుచరుడు విజయ్‌‌ నాయర్​ది కీలక పాత్ర
  • గత నెల 6న 13,567 పేజీల చార్జ్​షీట్ దాఖలు.. విచారణకు కోర్టు ఓకే
  • ఢిల్లీ సీఎం క్యాంప్​ ఆఫీసులో ఉంటూ వ్యవహారం నడిపిన నాయర్​
  • సమీర్​ మహేంద్రుతో ఫేస్​టైమ్​ యాప్​లో మాట్లాడిన కేజ్రీవాల్​
  • హైదరాబాద్​, ఢిల్లీ మీటింగ్స్‌‌లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత
  • కవిత ఆదేశాలతో పిళ్లైకి రూ.కోటి ఇచ్చిన వెన్నమనేని శ్రీనివాస్​రావు
  • చార్జ్​షీట్​లో అనేక వివరాలు ప్రస్తావించిన ఈడీ
  • 11 కంపెనీలు, ఆరుగురు వ్యక్తులపై అభియోగాలు

హైదరాబాద్‌‌, వెలుగు: ఢిల్లీ లిక్కర్​ స్కామ్‌‌ కేసులో  కీలక పరిణామం చోటుచేసుకుంది. సప్లిమెంటరీ చార్జ్​షీట్​లో ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ పేరును ఈడీ చేర్చింది. బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత, ఏపీ  ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మధ్య 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆధారాలను సేకరించింది. లావాదేవీల ద్వారా వచ్చిన సొమ్ములో కొంత గోవా ఎన్నికల ప్రచారంలో ఆప్​ ఖర్చు చేసిందని ఈడీ తెలిపింది. కేజ్రీవాల్​కు అత్యంత సన్నిహితుడైన విజయ్ నాయర్, ఇండో స్పిరిట్‌‌ ఎండీ సమీర్  మహేంద్రు, అరబిందో డైరెక్టర్​ శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, బినోయ్ బాబు, అమిత్ అరోరాతో పాటు  11 లిక్కర్‌‌‌‌ కంపెనీలపై అభియోగాలు మోపింది. గత నెల 6న ఢిల్లీ రౌస్ అవెన్యూ సీబీఐ స్పెషల్‌‌ కోర్టులో ఈడీ సప్లిమెంటరీ చార్జ్​షీట్ ​ దాఖలు  చేయగా.. దీన్ని  గురువారం కోర్టు విచారణకు స్వీకరించింది. నిందితులకు నోటీసులు జారీ చేసి.. విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. మొత్తం 13,567 పేజీల ఈ చార్జ్‌‌షీట్​లో, సారాంశాన్ని 428 పేజీల్లో ఈడీ పొందుపరిచింది. కోర్టు విచారణకు ఓకే చెప్పడంతో అందులోని వివరాలు బయటకు వచ్చాయి. మనీలాండరింగ్​ ఎలా జరిగింది? ఎవరు, ఎవరితో, ఎక్కడ, ఏ టైమ్​లో భేటీ అయ్యారు? ఎంత మొత్తంలో సొమ్ము చేతులు మారింది? కీలక వ్యక్తులు ఎవరు ? అనే వివరాలను ఇందులో ఈడీ పొందుపరిచింది. 

విజయ్​ నాయర్​ తన మనిషేనన్న కేజ్రీవాల్​!

లిక్కర్​ స్కామ్​లో విజయ్​ నాయర్​ ప్రధాన మీడియేటర్​గా వ్యవహరించాడని ఈడీ తెలిపింది. ‘‘ఆప్​ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​కు విజయ్​ నాయర్​ అత్యంత సన్నిహితుడు. ఆప్​ మీడియా ఇన్​చార్జ్​గా వ్యవహరించేవాడు. ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర లేకపోయినా.. ఢిల్లీ సీఎం క్యాంపు ఆఫీసు నుంచే విజయ్​ నాయర్​ తన కార్యకలాపాలు కొనసాగించేవాడు.  కేబినెట్​ మినిస్టర్​ కైలాశ్​ గెహ్లాట్​కు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాలో నివసించేవాడు.  విజయ్​ కోసం గెహ్లాట్​ తన బంగ్లాను వదిలి వేరే చోట ప్రైవేట్​ బంగ్లాలో ఉండేవారు” అని చార్జ్​షీట్​లో వివరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ టాప్‌‌‌‌ లీడర్స్‌‌‌‌తో కలిసి విజయ్​ నాయర్​ లిక్కర్ పాలసీలో మార్పులు చేశారని తెలిపింది. ఈ క్రమంలోనే ఇండో స్పిరిట్‌‌‌‌ ఎండీ సమీర్‌‌‌‌‌‌‌‌ మహేంద్రుకు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌‌‌‌తో ఫేస్‌‌‌‌టైమ్‌‌‌‌ యాప్‌‌‌‌ ద్వారా విజయ్​ నాయర్​ వీడియో కాల్ మీటింగ్స్‌‌‌‌ ఏర్పాటు చేశారని, అంతకు ముందు ముఖాముఖి మీటింగ్​కు ప్లాన్​ చేసినా కుదరలేదని చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌లో ఉంది. ‘‘విజయ్​ నాయర్​ నా మనిషే. అతడ్ని నమ్ము” అంటూ సమీర్​ మహేంద్రుకు కేజ్రీవాల్​ చెప్పారని ఈడీ వివరించింది. సమీర్‌‌‌‌‌‌‌‌ మహేంద్రు ద్వారా విజయ్​ నాయర్​తో  హైదరాబాద్‌‌‌‌కు చెందిన అరుణ్‌‌‌‌ రామచంద్ర పిళ్లై కాంటాక్ట్​ అయ్యారని తెలిపింది.

కవితతో రెండు సార్లు విజయ్‌‌‌‌ నాయర్ భేటీ

లిక్కర్​ పాలసీ మార్పు కోసం ఢిల్లీ, హైదరాబాద్‌‌‌‌లో మీటింగ్స్ జరిగాయని ఈడీ వివరించింది. ఇందులో ఎమ్మెల్సీ కవిత ప్రతినిధిగా అరుణ్‌‌‌‌ పిళ్లై హాజరైనట్లు తెలిపింది. విజయ్‌‌‌‌ నాయర్‌‌‌‌ ఢిల్లీలో పలుమార్లు మీటింగ్స్‌‌‌‌ నిర్వహించినట్లు తేదీలతో పాటు చార్జ్​షీట్​లో ఈడీ ప్రస్తావించింది. ఎమ్మెల్సీ కవితను రెండు సార్లు మీటింగ్స్‌‌‌‌లో విజయ్​ నాయర్​ కలిసినట్లు తెలిపింది. ఢిల్లీలోని ఒబెరాయ్ మైడెన్స్‌‌‌‌లో జరిగిన మీటింగ్‌‌‌‌ ఎజెండాలో దినేశ్​ అరోరా, విజయ్ నాయర్, అరుణ్ పిళ్లై, కవిత పాల్గొన్నారని వెల్లడించింది.  2021 మేలో బంజారాహిల్స్‌‌‌‌లోని కవిత ఇంట్లో మీటింగ్ జరిగిందని తెలిపింది. సమీర్ మహేంద్రు, అభిషేక్‌‌‌‌ బోయినపల్లి, శరత్‌‌‌‌చంద్రారెడ్డి, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఈ మీటింగ్​లో పాల్గొన్నట్లు ఈడీ వివరించింది. కవిత భర్త అనిల్​ కూడా మీటింగ్​కు హాజరయ్యారని తెలిపింది. 

గోవా ఎన్నికల ప్రచారంలో ఖర్చు!

సౌత్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ నుంచి విజయ్‌‌‌‌ నాయర్  రూ.100 కోట్లు సేకరించారని ఈడీ పేర్కొంది. ఈ గ్రూప్​లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కొడుకు రాఘవరెడ్డి, అరబిందో డైరెక్టర్​ శరత్‌‌‌‌ చంద్రారెడ్డి, కేసీఆర్​ కూతురు కవిత  తదితరులు ఉన్నారని తెలిపింది. సౌత్ గ్రూప్‌‌‌‌కు ప్రతినిధులుగా అభిషేక్, అరుణ్‌‌‌‌పిళ్లై, బుచ్చిబాబు వ్యవహరించారని వివరించింది. లావాదేవీల్లో వచ్చిన సొమ్ము నుంచి 70 లక్షలు గోవా ఎన్నికల ప్రచారంలో ఆప్‌‌‌‌ ఉపయోగించిందని ఈడీ పేర్కొంది. అడ్వర్టైజ్‌‌‌‌మెంట్‌‌‌‌, హోర్డింగ్ కోసం హవాలా రూపంలోనే చెల్లింపులు జరిపిందని తెలిపింది.