- సర్పంచ్ అభ్యర్థి వెంకటయ్య, ప్రచార రథం డ్రైవర్ లింగస్వామిపై కేసు నమోదు
యాదగిరిగుట్ట, వెలుగు: అక్రమంగా మద్యం తరలిస్తుండగా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కర్రె వెంకటయ్యకు సంబంధించిన ఎన్నికల ప్రచార రథాన్ని గురువారం వాహన తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు.
యాదగిరిగుట్ట టౌన్ సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామ శివారులో పోలీసులు స్పెషల్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో యాదగిరిగుట్ట నుంచి మల్లాపురం గ్రామానికి వెళ్తున్న ప్రచార రథంలో తనిఖీలు చేయగా.. అందులో మద్యం దొరికింది. ప్రచార రథం డ్రైవర్ కర్రె లింగస్వామిని అదుపులోకి తీసుకుని విచారించగా.. మల్లాపురం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కర్రె వెంకటయ్య ఆదేశం మేరకు మద్యం తరలిస్తున్నట్లు డ్రైవర్ తెలిపారు.
దీంతో మల్లాపురం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కర్రె వెంకటయ్య, ప్రచార రథం డ్రైవర్ కర్రె లింగస్వామిపై కేసు నమోదు చేసి ప్రచార రథం, పట్టుబడిన మద్యాన్ని సీజ్ చేసినట్లు సీఐ భాస్కర్ వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ భాస్కర్ మాట్లాడుతూ.. సర్పంచ్, వార్డు అభ్యర్థులు అక్రమంగా మద్యం తరలించి ఓట్ల కోసం ఓటర్లను ప్రలోభ పెట్టాలని చూస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో ఎస్ఐ యాదయ్య, కానిస్టేబుళ్లు, హోంగార్డులు తదితరులు ఉన్నారు.
