మందు బాబులకు షాక్: 18 రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్

మందు బాబులకు షాక్: 18 రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఎన్నికల సమయంలో రెండ్రోజుల పాటు, ఫలితాల రోజు మద్యం నిలిపేయడం సాధారణమే కానీ, ఆ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఏకంగా 18 రోజుల పాటు లిక్కర్ సేల్స్ బంద్ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 12 నుంచి 29 వరకు మద్యం షాపులు మూసేయాలను ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. ఆయా రోజుల్లో దుకాణాలకు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటర్లపై డబ్బు, మద్యం ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ నెల 21 నుంచి స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. 21న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు, 23న మున్సిపల్‌, నగర పంచాయతీ, కార్పొరేషన్లకు ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఈ నెల 27, 29 తేదీల్లో రెండు దశల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.