
- ఈ నెల 25 లేదా 26న మల్లేపల్లిలో ప్రారంభించనున్న సీఎం
- వేగంగా 65 ఏటీసీల నిర్మాణం
- డిసెంబర్ నాటికి 50 ప్రారంభించేలా అధికారుల ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లు ఓపెనింగ్ కు రెడీ అయ్యాయి. ఈ నెల 25 లేదా 26న మల్లేపల్లిలో నిర్మించిన ఐదు ఏటీసీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎం ప్రారంభించనున్న ఏటీసీలు హైదరాబాద్లోని శాంతినగర్, ఖైరతాబాద్, సనత్ నగర్, విజయ్ నగర్ కాలనీ, మల్లేపల్లిలో ఉన్నాయి. కార్మిక శాఖ అధికారులు కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కార్యక్రమం నేపథ్యంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ ఏటీసీలను పరిశీలించి అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, టాటా టెక్నాలజీ సంయుక్తంగా ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నాయి.
ఒక్కో క్యాంపస్ ను ఎకరం విస్తీర్ణంలో రూ.6 కోట్లతో ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీలకు గతేడాది జూన్ 19న సీఎం శంకుస్థాపన చేయగా వీటి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు 30 క్యాంపస్ ల పనులు చివరి దశకు చేరుకున్నాయని, ఈ ఏడాది చివరి నాటికి అన్ని క్యాంపస్ లు ఓపెన్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. రెండో దశలో 46 ఏటీసీలను 3 నెలల క్రితం కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు వివేక్ వెంకటస్వామి మంజూరు చేశారు.
పోస్టుల మంజూరు ప్రకటన!
ఏటీసీల్లో 550 పోస్టులు అవసరం అని అధికారులు అంచనా వేసి మంత్రి వివేక్ వెంకటస్వామికి అందజేశారు. ఈ అంశంపై సీఎంతో వివేక్ వెంకటస్వామి చర్చించి మంజూరు చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఒక్కో ఏటీసీలో ఆరుగురు చొప్పున అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ఏటీవో), లెక్చరర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఎలక్ట్రిషియన్లు, మెయింటెన్స్ ఇలా పలు పోస్టులు అవసరం అని అధికారులు అంచనా వేశారు. ఈ పోస్టులను ఏటీసీల ఓపెనింగ్ రోజు సీఎం ప్రకటిస్తారని సమాచారం.