అసమర్థ ప్రధాని వల్లే మనోళ్లకు తిప్పలు: రాహుల్ గాంధీ

అసమర్థ ప్రధాని వల్లే  మనోళ్లకు తిప్పలు: రాహుల్ గాంధీ
  • ట్రంప్​తో భేటీ అయినప్పుడు హెచ్​1 బీ వీసాలపై మోదీ ఎందుకు చర్చించలే?

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ఒక అసమర్థ, బలహీన ప్రధానమంత్రి అని.. ఈ విషయాన్ని తాను మొదటి నుంచి చెప్తున్నానని కాంగ్రెస్​ అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ అన్నారు. మోదీ తీరు వల్లే అమెరికాలోని లక్షల మంది భారతీయ ఉద్యోగుల భవిష్యత్తు ఆగమవుతున్నదని మండిపడ్డారు. హెచ్​1 బీ వీసాల అంశంపై తాను 2017లోనే లేవనెత్తానని, అప్పట్లో అమెరికా వెళ్లినప్పుడు ట్రంప్​ (అమెరికా ప్రెసిండెంట్​గా ఫస్ట్​ టర్మ్​)తో మోదీ కనీసం చర్చలు కూడా జరపలేదని ఆయన తెలిపారు. 

ట్రంప్​ నిర్ణయాలతో భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. దీనికి కారణం మన ప్రధాని మోదీ అసమర్థతేనని శనివారం  రాహుల్​ ట్వీట్​ చేశారు. 2017 జులైలో ట్రంప్​తో మోదీ భేటీ అయినప్పుడు, హెచ్​ 1 బీ వీసాల అంశాన్ని చర్చికపోవడంపై స్పందిస్తూ  ‘భారత్​కు బలహీన ప్రధాని ఉన్నడు’ అంటూ అప్పట్లో తాను చేసిన ట్వీట్​​ను తాజా ట్వీట్​కు ఆయన జోడించారు. ‘‘ఇప్పటికీ నేను అదే విషయం చెప్తున్న. భారత్​కు బలహీన ప్రధాని ఉన్నడు. మన ప్రధానమంత్రి అసమర్థత వల్లే మన యువతకు కష్టాలు” అని రాహుల్​ విమర్శించారు.

ట్రంప్​ రిటర్న్​ గిఫ్ట్​ ఇదా?: ఖర్గే

అమెరికా విధించిన హెచ్​ 1 బీ వీసా ఫీజుల పెంపు భారత్​పైనే ఎక్కువగా ప్రభావం పడుతుందని.. మన ఫారిన్​ పాలసీ దుస్థితికి ట్రంప్​ తీసుకుంటున్న దుందుడుకు చర్యలే నిదర్శనమని ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే ట్వీట్​ చేశారు. ‘‘ఈ నెల 17న మోదీ బర్త్​ డే సందర్భంగా ట్రంప్​ ఫోన్​ చేసి అభినందించినట్లు తెలిసింది. ఆ తర్వాత ట్రంప్​ నుంచి వచ్చిన రిటర్న్​ గిఫ్ట్​ హెచ్​ 1బీ వీసాల ఫీజులను లక్ష  డాలర్లకు పెంచడం. ఈ గిఫ్ట్​ వల్ల హెచ్​ 1 బీ వీసా హోల్డర్లలోని 70% మంది భారతీయులు బాధపడుతున్నరు. మోదీ.. మీ ఫ్రెండ్​ ఇచ్చిన రిటర్న్​ గిఫ్ట్​ ఇదా?” అని ఆయన మండిపడ్డారు.