హైదరాబాద్ లో అక్రమ నల్లా కనెక్షన్లపై ఉక్కుపాదం..49 మందిపై క్రిమినల్ కేసులు

హైదరాబాద్ లో అక్రమ నల్లా కనెక్షన్లపై ఉక్కుపాదం..49 మందిపై క్రిమినల్ కేసులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: సిటీలో మెట్రోవాటర్‌ బోర్డు సరఫరా చేసే తాగునీటి పైప్​లైన్‌ నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్లు తీసుకున్న 49 మందిపై విజిలెన్స్‌ అధికారులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. రెడ్​హిల్స్‌ హైలెవెల్‌ సెక్షన్​లోని బజార్‌ ఘాట్​లో మిరాజ్‌ అండ్‌ ఇరామ్‌ ఫార్చూన్‌ అపార్ట్​మెంట్​లో అఖీత్​తో పాటు 47 మంది అధికారుల అనుమతి లేకుండా 20 ఎంఎం నల్లా కనెక్షన్లు తీసుకున్నారు. విజిలెన్స్‌ అధికారులు శనివారం నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. 

దీంతో యజమాని సహా అపార్ట్​మెంట్​లోని 48 మందిపై నాంపల్లి పీఎస్​లో క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. అలాగే హిందీ నగర్‌ సెక్షన్‌ పరిధిలోని అగాపురాలో (ఇంటి నం. 5-6-99) ఓ భవనంలో రెండు 20 ఎంఎం అక్రమ నీటి కనెక్షన్లను అధికారులు గుర్తించారు. ఈ భవన యజమాని సలావుద్దీన్​పై హబీబ్​నగర్‌ పీఎస్​లో క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. అక్రమంగా నల్లా కనెక్షన్లు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్బంగా విజిలెన్స్‌ అధికారులు హెచ్చరించారు. అక్రమ కనెక్షన్ల గురించి సమాచారం ఉంటే వాటర్‌ బోర్డు విజిలెన్స్‌ సెల్‌ నంబర్‌ 99899 98100కు సమాచారం ఇవ్వాలని కోరారు.