పసి గుండెలకు నిమ్స్ ప్రాణం.. 5 రోజుల్లో 22 మందికి గుండె ఆపరేషన్లు

పసి గుండెలకు  నిమ్స్ ప్రాణం.. 5 రోజుల్లో 22 మందికి గుండె ఆపరేషన్లు
  • యూకే, యూఎస్, అబుదాబి డాక్టర్లతో స్పెషల్ హెల్త్ క్యాంప్
  • ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్​ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు
  • సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదరకు ధన్యవాదాలు తెలిపిన పిల్లల తల్లిదండ్రులు

హైదరాబాద్, వెలుగు: పుట్టుకతోనే గుండె సమస్యలతో బాధపడుతున్న పసి హృదయాలకు నిమ్స్ హాస్పిటల్ ఊపిరి పోస్తున్నది. ప్రైవేట్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో లక్షల ఖర్చయ్యే ఆపరేషన్లను.. ఆరోగ్య శ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉచితంగా చేస్తూ... పేద, మధ్య తరగతి వర్గాలకు భరోసా కల్పిస్తున్నది. మూడున్నరేండ్ల నుంచి ఇప్పటి వరకూ గుండెకు హోల్స్ పడటం, గుండె సరిగ్గా కొట్టుకోకపోవడం, అబ్ నార్మల్ కనెక్షన్స్ తదితర సమస్యలున్న1400 మంది పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసి.. ప్రాణాలు కాపాడింది.  

నిమ్స్‌‌‌‌‌‌‌‌లో అనుభవజ్ఞులైన డాక్టర్లు, సర్జన్లు ఉన్నా.. కొన్ని క్లిష్టమైన సర్జరీల విషయంలో యూకే, అమెరికా, అబుదాబి, బెంగళూరు నుంచి వచ్చిన డాక్టర్ల బృందం సహకారాన్ని తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా  మూడేండ్ల కాలంలో నాలుగోసారి నిమ్స్ కార్డియోథోరాసిక్ అండ్ వాస్క్యులర్ సర్జరీ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్​, యూకేలో స్థిరపడిన పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డా. రమణ నేతృత్వంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. 

ఇందులో పిల్లలకు హార్ట్ సర్జరీలు చేశారు. ఈ సందర్భంగా శనివారం  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప మాట్లాడుతూ.. చిన్నారుల ఆపరేషన్లకు ఆరోగ్య శ్రీ, సీఎంఆర్ఎఫ్​ ద్వారా సహకారం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 

మూడేండ్లలో 4వ హెల్త్ క్యాంప్ 

కొన్ని క్టిష్టమైన ఆపరేషన్లు చేయడానికి ఇతర దేశాల్లో స్థిరపడిన మన డాక్టర్లు, విదేశీ డాక్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని  జగిత్యాలకు చెందిన  డాక్టర్​ రమణ ఆధ్వర్యంలోని యూకే బృందం ఇప్పటికి 3 సార్లు నిమ్స్‌‌‌‌‌‌‌‌ను సందర్శించి, వైద్య సేవలను అందించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు 4వ స్పెషల్ క్యాంపు నిర్వహించారు. ఇందులో విదేశీ డాక్టర్లు, నిమ్స్ వైద్యులు కలిసి 22 మందికి గుండె ఆపరేషన్లు నిర్వహించారు. 

ఇందులో 20 మంది చిన్నారులు ఉండగా, ఇద్దరు పెద్దవాళ్లు ఉన్నారు. 2002 లో 9 మందికి, 2023 లో 15 మందికి, 2024 లో 18 మందికి, 2025 లో 22 మందికి విజయవంతంగా సర్జరీలు చేశారు. 4వ క్యాంపులో మొత్తం 500 మంది పిల్లలు రిజిస్టర్ చేసుకోగా, అందులో చాలామందికి సర్జరీలు అవసరం ఉన్నదని, మరికొందరికి వైర్, బటన్ ద్వారా చికిత్స అందించనున్నట్లు కార్డియో థొరాసిక్ హెచ్‌‌‌‌‌‌‌‌వోడీ డాక్టర్ అమరేశ్వర్ రావు తెలిపారు. మిగిలిన చిన్నారులకు ఆపరేషన్లు కొనసాగుతాయని వెల్లడించారు.

సొంతగడ్డకు సేవ చేయడం ఆనందంగా ఉంది: డాక్టర్​ రమణ, గీత

సొంతగడ్డకు సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉన్నదని బ్రిటన్ వైద్య బృందానికి నేతృత్వం వహిస్తున్న పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్​రమణ పేర్కొన్నారు. 2022 నుంచి ఇప్పటివరకూ 4 సార్లు క్యాంపులు నిర్వహించినట్లు వెల్లడించారు. నిమ్స్‌‌‌‌‌‌‌‌తోపాటు కరీంనగర్, విజయవాడ, ఇతర దేశాల్లో కూడా పిల్లలకు గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.  ఇప్పటికీ తాను మూడు క్యాంపులకు వచ్చానని, పుట్టిన ప్రదేశంలో సేవచేయడం అదృష్టమని యూఎస్‌‌‌‌‌‌‌‌లో సెటిల్ అయిన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన డాక్టర్ గీత తెలిపారు. 

కాగా,  ప్రైవేట్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో ఈ చికిత్సకు ఏడు, ఎనిమిది లక్షలు అడిగారని, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో పూర్తి ఉచితంగా ఆపరేషన్​ జరిగిందని పిల్లల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రభుత్వ సహకారంతోనే 

నిమ్స్ పీడియాట్రిక్ కార్డియాలజీ ఐసీయూ ప్రారంభించిన మూడున్నరేండ్ల కాలంలోనే1400కు పైగా గుండె సంబంధిత సర్జరీలు చేశాం. నిమ్స్‌‌‌‌‌‌‌‌లో వరల్డ్ క్లాస్ ఎక్విప్ మెంట్, అనుభవజ్ఞులైన డాక్టర్లు, సర్జన్లు ఉన్నారు. సక్సెస్​ రేటు కూడా ఎక్కువే. ఉచితంగా ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌​ అందుతుండడంతో మన రాష్ట్రం నుంచే కాకుండా పక్కనున్న ఏపీ, మహారాష్ట్ర నుంచి కూడా ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను నిమ్స్‌‌‌‌‌‌‌‌కు తీసుకొస్తున్నారు. ఆపరేషన్ల ఖర్చు ఆరోగ్య శ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. సీఎం, ఆరోగ్య శాఖ మంత్రికి ధన్యవాదాలు.- ప్రొఫెసర్ అమరేశ్ రావు,కార్డియో థొరాసిక్ హెచ్‌‌‌‌‌‌‌‌వోడీ, నిమ్స్ హాస్పిటల్