ఎల్లంపల్లి ఆర్ అండ్ ఆర్​ ప్యాకేజీ.. లిస్టులో అనర్హులు!

ఎల్లంపల్లి ఆర్ అండ్ ఆర్​ ప్యాకేజీ.. లిస్టులో అనర్హులు!
  • తాజాగా 2023 లిస్ట్​ రెడీ
  • పాత లిస్టులో ఉన్నోళ్లను తొలగించి అనర్హులను చేర్చారనే ఆరోపణలు 
  • నిర్వాసితుల నుంచి వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు
  • పంచాయతీల వద్ద నిర్వాసితుల పేర్లు ప్రకటించాలని డిమాండ్‌‌‌‌

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌‌‌ నిర్వాసితుల లిస్టులో అనర్హులను చేర్చారనే ఆరోపణలు వస్తున్నాయి. 2019 లిస్ట్​ప్రకారం పరిహారం చెల్లించకుండా జాప్యం చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు, 2023 కొత్త లిస్టు పేరుతో అనర్హులను చేర్చారని అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. పాత లిస్టుకు, కొత్త లిస్టుకు వ్యత్యాసం ఉందని, గతంలో నమోదు చేసిన పేర్లలో చాలా మందిని తొలగించి కొత్త పేర్లు చేర్చారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు.  2015 జనవరి1 నాటికి ఉమ్మడి రామగుండం( ప్రస్తుతం పాలకుర్తి, అంతర్గాం) మండలంలోని ఎల్లంపల్లి, మూర్మూర్‌‌‌‌, పొట్యాల, మద్దిర్యాల, వేంనూర్‌‌‌‌, కుక్కలగూడూరు గ్రామాల్లో18 ఏండ్లు నిండిన ఒక్కో నిర్వాసితుడికి రూ.2,10,000 చెల్లించాల్సి ఉండగా.. కరోనా కారణంగా ప్రాసెస్​లేట్ అయింది.

2010లోనే పునరావాస కేంద్రాలకు..

ఉమ్మడి ఏపీలోని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2005లో గోదావరి నదిపై పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి గ్రామం వద్ద ప్రాజెక్ట్‌‌‌‌ నిర్మించాలని నిర్ణయించింది. అప్పటి రామగుండం మండల పరిధిలోని ఎల్లంపల్లి, మూర్మూర్‌‌‌‌, పొట్యాల, మద్దిర్యాల, వేంనూర్‌‌‌‌, కుక్కలగూడూరు గ్రామాల్లో భూసేకరణ చేపట్టి స్థలాలు, ఇండ్లు తీసుకుంది. 2008 సంవత్సరంలో నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించింది. 2010లో ఊళ్లను ఖాళీ చేయించి పునరావాస ప్రాంతాలకు షిఫ్ట్​చేసింది. అయితే ఈ గ్రామాల్లో 2015 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన యువతకు కూడా పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించి, గెజిట్‌‌‌‌తీసుకొచ్చింది. తలా రూ.2,10,000 చెల్లించేందుకు ఓకే చెప్పింది.

400 మందికి పైనే..

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌‌‌ కింద ఎఫెక్ట్‌‌ అయిన మూర్మూర్‌‌‌‌, ఎల్లంపల్లి, పొట్యాల, మద్దిర్యాల, వేంనూర్‌‌‌‌, కుక్కలగూడూరు గ్రామాలకు చెందిన యువతకు పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2019లో ఒకసారి లిస్ట్​రెడీ చేసింది. కరోనా కారణంగా పరిహారం అందించడం లేట్​అయింది. తాజాగా 2023లో మరోసారి లిస్ట్‌‌‌‌ రెడీ చేశారు. అయితే 2019 లిస్టులో ఉన్నవారి కొందరి పేర్లు 2023 లిస్టులో మిస్సవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. 2019 లిస్టు‌‌లో లేనివారి పేర్లు, అస్సలు ఆయా నిర్వాసిత గ్రామాలతో సంబంధం లేని వారి పేర్లను చేర్చారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. ఎల్లంపల్లి, మూర్మూర్‌‌‌‌ రెండు గ్రామాల్లో కలిపి 2019లో 348 మంది యువతీయువకులను అర్హులుగా తేల్చారు. అయితే 2023 లిస్టులో వారి సంఖ్య 264గా నిర్ణయించడంతో ఇన్నాళ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్న వారిలో ఆందోళన మొదలైంది. 

అలాగే పొట్యాలలో130 మందికి బదులుగా 334 మంది, వేంనూర్‌‌‌‌లో 38 మందికి బదులుగా 224 మంది, మద్దిర్యాల గ్రామంలో 75 మందికి గాను 70 మంది, కుక్కలగూడూరులో 11 మందికి గాను 101 పేర్లతో నిర్వాసితుల లిస్టు సిద్ధం చేశారు. వీటిలో గతంలో ఉన్న కొంత మందిని తొలగించగా, 400 మందికి పైనే అనర్హులను చేర్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గెజిట్‌‌‌‌లో పేరు లేకపోయినా తండ్రి పేరును ఆధారంగా చేసుకుని కొందరు, 2015 జనవరి1 నాటికి 18 సంవత్సరాలు నిండని వారి పేర్లను, అసలు నిర్వాసిత గ్రామాలలో ఎలాంటి భూమి, ఇండ్లు పోని వారి పేర్లను తాజా లిస్టులో చేర్చినట్టు తెలుస్తోంది. లిస్ట్​తయారీలో కొందరు ఆఫీసర్లు, దళారులు, అధికార పార్టీకి చెందిన వారి ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. 

దళారులు లిస్ట్​ రెడీ చేసిన్రు


ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో18 ఏండ్లు నిండినోళ్లకు పరిహారం అందించాలి. ఆయా గ్రామ పంచాయతీ ఆఫీసుల వద్ద గ్రామస్తుల ముందు అర్హులను ప్రకటించాలి. అలా చేసినప్పుడే ఎలాంటి అనుమానాలు ఉండవు. 2023 లిస్టును దళారుల ఆధ్వర్యంలో తయారు చేశారు. అనర్హుల పేర్లు చేర్చారు. ప్రభుత్వం లిస్టు ప్రకారం అనర్హుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం పైసలు జమ చేస్తే ఆందోళనలకు దిగుతాం.
 

- ఉరిమెట్ల రాజలింగయ్య, మాజీ ఎంపీపీ, మూర్మూర్‌‌‌‌

అనర్హులకు ఇస్తే ఊరుకోం


నేను ఊరిలో ఉంటూ వ్యవసాయంతోపాటు గొర్రెలు కాస్తుంటాను. 2015 జనవరి1 నాటికి నాకు18 ఏండ్లు నిండాయి. ఆఫీసర్లకు అన్ని రకాల సర్టిఫికెట్లు అందజేయగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితుడిగా గుర్తిస్తూ 2019 అర్హుల లిస్టులో పేరు నమోదు చేశారు. పరిహారం చెల్లించకుండా జాప్యం చేసిన ఆఫీసర్లు.. ఇటీవల 2023 పేరుతో కొత్త లిస్ట్‌‌ తయారు చేశారు. అందులో నా పేరు లేదు. మమ్మల్ని కాదని అనర్హులకు పరిహారం ఇస్తే ఊరుకునేది లేదు. 


- గెల్లు నాగరాజు, మూర్మూర్‌‌‌‌ గ్రామ నిర్వాసితుడు