- డ్రా పద్ధతిలో చైర్మన్లు, వార్డు రిజర్వేషన్లు ఖరారు చేసిన ఆఫీసర్లు
- రిజర్వేషన్లు కలిసిరాకపోవడంతో నిరాశలో పలువురు లీడర్లు
- మహిళలకు కేటాయించిన చోట కుటుంబసభ్యులను బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు
నల్గొండ/యాదాద్రి, వెలుగు : మున్సిపాలిటీ నుంచి ఇటీవలే కార్పొరేషన్‌గా మారిన నల్గొండ తొలి మేయర్ పీఠం మహిళకే దక్కనుంది. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలతో పాటు నల్గొండ కార్పొరేషన్ మేయర్ స్థానానికి శనివారం రిజర్వేషన్లను ఖరారు చేశారు. దీంతో నల్గొండ కార్పొరేషన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. మరోవైపు ఉమ్మడి జిల్లాలో మొత్తం 18 మున్సిపాలిటీలు ఉండగా.. 9 స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యాయి.
ఇందులో జనరల్ మహిళకు ఆరు స్థానాలు దక్కగా.. బీసీ మహిళకు 2, ఎస్సీ మహిళకు ఒక స్థానం కేటాయించారు. మిగిలిన 9 మున్సిపాలిటీల్లో ఏడు జనరల్‌కు దక్కగా... ఒకటి ఎస్సీ జనరల్‌కు, మరొకటి బీసీ జనరల్‌కు కేటాయించారు. మరో వైపు మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో వార్డు స్థానాలకు సైతం రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. దీంతో పట్టణాల్లో రాజకీయ వేడి రాజుకుంది.
నల్గొండ మేయర్ పీఠంపై వీడిన సందిగ్ధత
మున్సిపాలిటీగా సుదీర్ఘకాలం పాటు కొనసాగిన నల్గొండ ఇటీవలే కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయింది. దీంతో నల్గొండ తొలి మేయర్ స్థానం ఎవరికి దక్కుతుందన్న విషయంపై కొన్ని రోజులుగా తీవ్ర చర్చ సాగింది. కాగా, నల్గొండ మేయర్ పీఠం బీసీలకు కేటాయించాలని ఇటీవల పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది. చివరకు జనరల్ మహిళకు రిజర్వేషన్ ఖరారు అయింది. రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో నిరాశకు గురైన కాంగ్రెస్ లీడర్లు... తమ భార్యలను రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా... నల్గొండ మేయర్ పీఠం ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. దీంతో ఈ సీటును దక్కించుకునేందుకు ఆయా పార్టీల లీడర్లు ఇప్పటినుంచే చర్చలు ప్రారంభించారు. అయితే మేయర్ పీఠం జనరల్ మహిళకు దక్కడంతో కొందరు లీడర్లు వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. భారీగా ఖర్చు చేసి కార్పొరేటర్లుగా గెలిచినా.. మేయర్ పదవి దక్కే అవకాశం లేకపోవడంతో.. ప్రస్తుతం సైలెంట్‌గా ఉండడమే బెటర్ అని ఆలోచిస్తున్నట్లు పలువురు అంటున్నారు.
యాదాద్రిలో ఆరింటికి ఐదు మహిళలకే..
యాదాద్రి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు ఉండగా.. ఇందులో ఐదు మహిళలకే దక్కాయి. జిల్లాలో భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కురు, చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో భూదాన్‌పోచపంల్లి జనరల్‌కు కేటాయించగా... మోత్కూరు ఎస్సీ మహిళకు, ఆలేరు బీసీ మహిళకు, యాదగిరిగుట్ట, భువనగిరి, చౌటుప్పల్ జనరల్ మహిళకు కేటాయించారు. అన్ని మున్సిపాలిటీల్లో 104 వార్డులు ఉండగా.. జనరల్ కు 53, బీసీలకు 31, ఎస్సీలకు 14, ఎస్టీలకు 6 సీట్లు రిజర్వ్ చేశారు
రిజర్వేషన్లతో పలువురికి నిరాశ
మున్సిపల్ ఎన్నికల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న లీడర్లకు రిజర్వేషన్లు కొంత నిరాశ మిగిల్చాయి. మున్సిపాలిటీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము బరిలో ఉండవచ్చన్న ధీమాతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటికే అన్ని ప్రయత్నాలు చేశారు. రూ. లక్షలు ఖర్చు చేసి వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించారు. కానీ చైర్మన్ రిజర్వేషన్లు మారడం, పలు చోట్ల వార్డులు సైతం మహిళలకే దక్కడంతో లీడర్ల ఆశలు గల్లంతయ్యాయి. అయితే కొందరు లీడర్లు మాత్రం... మహిళలకు రిజర్వ్ అయిన స్థానాల్లో తమ కుటుంబ సభ్యులను బరిలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అభ్యర్థుల ఎంపికపై కుస్తీ
యాదాద్రి, వెలుగు : మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు కావడంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ కుస్తీ పడుతున్నాయి. గెలిచే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రతీ వార్డులోనూ ఎవరికి వారే పోటీ చేస్తామని పట్టుదలగా ఉన్నారు. మరికొందరైతే మూడు నుంచి నాలుగు వార్డుల్లో కర్చీఫ్ వేసుకొని ఉన్నారు.
రిజర్వేషన్ ఎక్కడ అనుకూలిస్తే ఆ వార్డులో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. బీఆర్‌ఎస్ సైతం వార్డుల్లో పోటీ పడుతున్న వారి పేర్లతో ఇప్పటికే ఓ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంది. ఒక్కో వార్డులో ఇద్దరి కంటే ఎక్కువగానే టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు టికెట్ ఆశిస్తున్న వారి పేర్లను వార్డుల వారీగా సేకరించిన బీజేపీ.. పార్టీలో చర్చించి అన్ని విధాలుగా అర్హులైన వారి పేర్లను జిల్లా కమిటీకి సూచిస్తోంది. అక్కడి నుంచి లిస్ట్‌ను రాష్ట్ర కమిటీకి పంపించనున్నారు.
కాంగ్రెస్‌లో ఇంటర్నల్ సర్వే
కాంగ్రెస్ అధిష్ఠానం వార్డుల్లో ఇంటర్నల్ సర్వే కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా గాంధీభవన్ నుంచి స్థానిక లీడర్లకు ఫోన్లు చేసి కౌన్సిలర్లుగా పోటీ చేసే వారి అభ్యర్థిత్వంపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అలాగే అన్ని విధాలుగా ఓకే అనుకున్న వారి పేర్లతో వార్డుల్లో కూడా సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే నిర్వహించే టీమ్స్.. వార్డుల్లో పర్యటిస్తూ.. ‘గతంలో పనిచేసిన కౌన్సిలర్ పనితీరును తెలుసుకోవడంతో పాటు తమ వద్ద ఉన్న వారి పేర్లను చదువుతూ.. ప్రస్తుతం ఎవరైతే బెటర్’ అన్న వివరాలు సేకరిస్తున్నారు. బీఆర్‌ఎస్ లీడర్లు సైతం ఆశావహులతో సమావేశాలు నిర్వహిస్తూ.. ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నారు.
జనరల్ మహిళ : నల్గొండ కార్పొరేషన్, భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, మిర్యాలగూడ, చిట్యాల, కోదాడ
బీసీ మహిళ : ఆలేరు, దేవరకొండ
ఎస్సీ మహిళ : మోత్కూరు
జనరల్ : భూదాన్‌పోచంపల్లి, చండూరు, నకిరేకల్, హాలియా, నేరేడుచర్ల, తిరుమలగిరి, సూర్యాపేట
ఎస్సీ జనరల్ : నందికొండ
బీసీ జనరల్ : హుజూర్‌నగర్
