? లైవ్ అప్ డేట్స్: కైకాలకు ప్రముఖుల నివాళి

? లైవ్ అప్ డేట్స్:  కైకాలకు ప్రముఖుల నివాళి

దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు.  గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న కైకాల ఇవాళ ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. రేపు జూబ్లీహీల్స్ లోని మహాప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. కైకాల మృతిపట్ల పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.

పౌరాణికం.. సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాలకు కైకాల తన నటనతో వన్నె తెచ్చారు. ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. నవరసాల్ని పలికించగల అద్భుత నటుడు కైకాల సత్యనారాయణ. ఎన్టీఆర్ తర్వాత పౌరాణిక పాత్రలను పోషించగల నటుడు ఎవరైనా ఉన్నారంటే అది కైకాలే. ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులకు కైకాల యముడిగా సుపరిచితులు.

కైకాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు: తమిళి సై

కైకాల సత్యనారాయణ మృతి పట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  కైకాల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నవరస నటనా సార్వభౌముడిగా కైకాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. 

కైకాల లేని లోటు తీరనిది: ఎన్టీఆర్

 

కైకాల సత్యనారాయణ మృతిపట్ల జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెండితెరపై కైకాల సత్యనారాయణ తన గంభీరమైన క్యారెక్టర్స్ తో, అసమానమైన నటనతో  చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.  కైకాల మరణం టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటన్నారు. కైకాల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కైకాల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

కైకాలకు నివాళి అర్పించిన పవన్ ,త్రివిక్రమ్

కైకాల  పార్థివ దేహానికి  చిరంజీవి, పవన్, త్రివిక్రమ్ నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన్ని ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పాలకరించేవారని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. తన చిన్నతనం నుంచి కైకాలతో పరిచయం ఉందన్నారు.
 
కైకాల అంటే నాకు చాలా ఇష్టమని త్రివిక్రమ్ అన్నారు. ఆయనకి తాను స్టోరీస్ రాయలేదు కానీ  కైకాల అంటే చాలా ఇష్టమన్నారు. పరిపూర్ణమైన జీవితం గడిపిన గొప్ప వ్యక్తి కైకాల అని అన్నారు. ఆయన లేని లోటు ఎవరు పూడ్చలేరన్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు త్రివిక్రమ్.

కన్నీరు పెట్టుకున్న చిరంజీవి

కైకాల సత్యనారాయణ భౌతికదేహానికి చిరంజీవి నివాళులు అర్పించారు. కైకాల మరణ వార్త విని హుటాహుటీన ఆయన నివాసానికి చేరుకున్న చిరంజీవి కైకాల పార్థీవదేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  కుటుంబ సభ్యులను ఓదార్చుతూ వెక్కి వెక్కి ఏడ్చారు. కైకాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కైకాల వందల సినిమాల్లో నటించిన గొప్ప నటుడు అని..ఆయన తనను  తమ్ముడు అని ఆప్యాయంగా పిలిచివారని చెప్పారు.  అన్నయ్య ని  కోల్పోయాంటూ కన్నీరు పెట్టుకున్నారు.   ఆయనతో నటించిన ప్రతి సినిమా తనకు ఒక తీపి జ్ఞాపకమన్నారు.  ఆయన మనస్సు చాలా మంచిదని... మంచి భోజన ప్రియుడని తెలిపారు.  ఆయన కుటుంబానికి ప్రగడసానుభూతి ప్రకటించారు.  ప్రభుత్వ లాంఛనాలతో ఘన నివాళి ఇస్తున్నట్లు ప్రకటించిన మంత్రి తలసానికి ధన్యవాదాలు అని చిరంజీవి చెప్పారు.

ఇండస్ట్రీ గొప్ప నటుడ్ని కోల్పోయింది: బాలకృష్ణ

కైకాల సత్యనారాయణ మృతికి సినీ ప్రముఖులునివాళులు అర్పించారు.తెలుగు సినీ ఇండస్ట్రీ గొప్ప నటుడ్ని కోల్పోయిందని బాలకృష్ణ చెప్పారు. సినీ, ప్రజా జీవితంలో కైకాల అందించిన సేవలు మరువలేనివన్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప నటుడని సినీ నటులు కొనియాడారు. అంతకుముందు  కైకాల మరణం పట్ల చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొంటూ ట్విట్టర్ లో  సుధీర్ఘ పోస్ట్‌ చేశారు. తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ మరణం నన్ను ఎంతగానో కలచివేస్తోందన్నారు. 

 

తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటు: కేసీఆర్

"ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపం ప్రకటించారు. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం గుర్తుచేసుకున్నారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటని సీఎం కేసిఆర్ విచారం వ్యక్తం చేశారు.వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు".

అధికారిక లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు

కైకాల సత్యనారాయణ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస్ తెలిపారు. కైకాల సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి తలసాని.. - కైకాల సత్యనారాయణ మూడు తరాలకు గుర్తుండే గొప్ప నటుడని కొనియాడారు.  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తనదైన శైలిలో అలరించారని చెప్పారు.  - 777 సినిమాల్లో నటించడం గర్వించదగ్గ విషయమన్నారు. అటు  పాలిటిక్స్ లోను తనదైన ముద్ర వేశారన్నారు. కైకాల - చాలా మందికి ఇష్టమైన నటుడని..- పాత్ర ఏదైనా అందులో జీవించే గొప్ప వ్యక్తి, నటుడు అని తెలిపారు. - ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. - సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ మన మధ్యలో లేకున్నా చరిత్రలో నిలోచిపోయే వ్యక్తులు అని కొనియాడారు. - కుటుంబ సభ్యుల కోరికమేరకు...శనివారం ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు.

 

 

"కైకాలసత్యనారాయణ గారు మృతి చెందడం చాలా బాధాకరం. ఆయనతో పనిచేసినందుకు నాకు చాలా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను".

- సూపర్ స్టార్ మహేష్ బాబు

‘‘కైకాల సత్యనారాయణ గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. కైకాల సత్యనారాయణ గారు ఆరు దశాబ్దాలు పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో నవరస నటనా సార్వభౌముడిగా తన వైవిధ్యమైన నటనతో అలరించారు. మా కుటుంబంతో కైకాల సత్యనారాయణ గారికి స్నేహ సంబంధాలు వున్నాయి. నాన్నగారితో కలిసి ఎన్నో సినిమాల కోసం పనిచేశారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్రవేశారు. సినీ జీవితంలోనూ, ప్రజాజీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా ఆయన అందించిన సేవలు మరువలేనివి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’

- నందమూరి బాలకృష్ణ

"కైకాల సత్యనారాయణ గారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. మన చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది !! అతని ఆత్మకు శాంతి చేకూరు గాక".

-రామ్ చరణ్

"కైకాల గారు మా సంస్థలో చాలా సినిమాలు తీశారు.ఆయనతో నేను కూడా నటించాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢసానుభూతి".

వెంకటేష్

"కైకాల సత్యనారాయణ గారి మరణవార్త తెలిసి చాలా బాధ కలిగింది. మన తెలుగు వెండితెరపై ఎన్నో పాత్రలను చిరస్థాయిగా నిలిపిన పరమ లెజెండ్".

- కళ్యాణ్ రామ్

"నేను ఎదుగుతున్నప్పుడు ఆయన నాకు అత్యంత ఇష్టమైన నటుడు.. ఘటోత్కచుడిగా ఆయనతో ప్రేమలో పడ్డాను.ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సినీ ఇండస్ట్రీకి చేసిన అపారమైన కృషికి ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఓం శాంతి"

-అనసూయ భరద్వాజ్

"కైకాల ఒక చరిత్ర క్రియేట్ చేసాడు. ఆయన గొప్ప జీవితం అనుభవించిన వ్యక్తి. అందరితో స్నేహంగా ఉండేవాడు. వచ్చే తరం వాళ్ళకి ఆయన ఆదర్శం".

-కె. రాఘవేంద్ర రావు

"నటులు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరం. ఆరు దశాబ్దాల కాలం నుండి సినీ ప్రస్థానంలో ఉన్నారు. ఆయన లేని లోటు సినీ ఇండస్ట్రీకి తీరనిది. 2022 లో సీనియర్లను కోల్పోతున్నాం. కైకాల  ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరుపున కైకాల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని".

- నిర్మాత సి కల్యాణ్

"సీనియర్ నటులు.. నవరస నటనా సార్వభౌమ.. శ్రీ కైకాల సత్యనారాయణ మరణం.. చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని  అన్నారు. కళామతల్లికి ఎంతో సేవ చేసి.. రాజకీయంగా కూడా పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు".

- తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ప్రెసిడెంట్ వై కాశీ విశ్వనాథ్

సీనియర్ నటుడు కైకాల సత్యానారాయణ కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం 4 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గతేడాది కోవిడ్ బారిన పడిన తర్వాత..కైకాల అనారోగ్యానికి గురైనట్లు  తమ్ముడు కైకాల నాగేశ్వర రావు చెప్పారు. కైకాల అంత్యక్రియలను శనివారం మహాప్రస్థానంలో నిర్వహిస్తామని వెల్లడించారు. అభిమానుల సందర్శనార్థం ఉదయం 11 నుంచి కైకాల పార్థీవదేహాన్ని ఉంచుతామన్నారు. కైకాల కుమార్తె చెన్నైలో ఉందని..ఆమె రావాల్సి ఉందన్నారు.