పోరాడి ఓడిన రిషి శునక్

పోరాడి ఓడిన రిషి శునక్
  • ట్రస్‌‌కు 57.4 శాతం.. శునక్‌‌కు 42.6 శాతం ఓట్లు
  • యూకే ప్రధాని పదవి చేపట్టనున్న మూడో మహిళగా ట్రస్ రికార్డు

 

లండన్: కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో లిజ్ ట్రస్ విజయం సాధించారు. తీవ్ర పోటీ ఇచ్చిన ఇండియన్ సంతతి లీడర్ రిషి శునక్‌‌ దాదాపు 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. టోరీ లీడర్‌‌‌‌షిప్ కాంటెస్ట్‌‌లో ట్రస్‌‌కు 57.4 శాతం ఓట్లు రాగా, శునక్‌‌కు 42.6 శాతం ఓట్లు పడ్డాయి. ఈ మేరకు సోమవారం ఫలితాలు వెల్లడయ్యాయి. కన్జర్వేటివ్ పార్టీ లీడర్‌‌‌‌గా ఎన్నికైన ట్రస్.. బ్రిటన్ 56వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మార్గరేట్ థాచర్, థెరిసా మే తర్వాత పీఎం అవ్వనున్న మూడో మహిళగా 47 ఏండ్ల ట్రస్ రికార్డుకెక్కారు. ఫేర్ వెల్ స్పీచ్ తర్వాత ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ మంగళవారం తప్పుకున్న తర్వాత క్వీన్ ఎలిజబెత్ 2 సమక్షంలో కొత్త ప్రధానిగా ట్రస్ ప్రమాణ స్వీకారం చేస్తారు.

పోటాపోటీగా ప్రచారం..
పలు వివాదాల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని పదవికి ఇటీవల బోరిస్ జాన్సన్‌‌ రిజైన్ చేశారు. కన్జర్వేటివ్ లీడర్‌‌‌‌గా తప్పుకున్నారు. దీంతో పార్టీలో ఎన్నికలు మొదలయ్యాయి. చివరికి విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్, మాజీ ఆర్థిక మంత్రి రిషి శునక్.. ప్రధాని పదవి రేసులో నిలిచారు. పోటాపోటీగా ప్రచారం చేశారు. లిజ్ ట్రస్ వైపు మొగ్గు ఉన్నట్లు మొదటి నుంచి వినిపించింది. ప్రీ పోల్ సర్వేలు ఇదే విషయాన్ని చెప్పాయి. చివరికి అదే నిజమైంది. 

అడుగు దూరంలో ఆగిపోయిన శునక్
మొదట్లో రిషి శునక్‌‌ బ్రిటన్ ప్రధాని అవుతారని అంచనాలు వచ్చాయి. కానీ ట్రస్ రాకతో పరిస్థితి మారింది. మాజీ పీఎం బోరిస్​ను మోసం చేశారని టోరీ సభ్యుల్లో కొందరు భావించడం దెబ్బకొట్టింది. పన్నులు పెంచుతానని శునక్ చెప్తే.. అవే పన్నులు తగ్గిస్తానని ట్రస్ చెప్పడం ఆమెకు కలిసి వచ్చింది. అయినా ప్రచారంలో దూకుడుతో ట్రస్‌‌కు శునక్ గట్టిపోటీ ఇచ్చారు. కానీ మెజారిటీ టోరీ ఓటర్ల మెప్పు పొందలేకపోయారు. ఒకప్పుడు ఇండియాను ఏలిన యూకే లీడర్‌‌‌‌గా అవతరించే అవకాశాన్ని కొద్దిలో రిషి శునక్ కోల్పోయారు. 

నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్‌‌: ట్రస్
పన్నులు తగ్గించేందుకు, బ్రిటన్ ఎకానమీని పరుగులు పెట్టించేందుకు తన వద్ద బోల్డ్ ప్లాన్ ఉందని ట్రస్ చెప్పారు. ‘‘గొప్ప దేశానికి నాయకత్వం వహించే విషయంలో నాపై నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్. యూకే సామర్థ్యాన్ని ఆవిష్కరిస్తా” అని పేర్కొన్నారు. 

ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయంటే..
లిజ్ ట్రస్        81,326
రిషీ సునక్       60,399
రిజెక్ట్‌‌ అయినవి    654

‘‘నాకు ఓటు వేసిన వాళ్లందరికీ థ్యాంక్స్. కన్జర్వేటివ్‌‌లు అందరూ ఒకే కుటుంబమని నేను గతంలోనే చెప్పాను. ప్రస్తుత కష్ట సమయాల్లో దేశాన్ని నడిపించనున్న కొత్త ప్రధాని లిజ్ ట్రస్‌‌కు మద్దతుగా మనమందరం ఏకం కావాలి’’
- రిషి శునక్

ట్రస్‌‌కు మోడీ గ్రీటింగ్స్
బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్‌‌కు ప్రధాని నరేంద్ర మోడీ కంగ్రాట్స్ చెప్పారు. ఆమె నాయకత్వంలో ఇండియా, బ్రిటన్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.‘‘కొత్త పాత్ర పోషించనున్న, కొత్త బాధ్యత చేపట్టనున్న మీకు శుభాకాంక్షలు” అని మోడీ ట్వీట్ చేశారు.

తొలి అడుగులో ఓడినా..
1975 జులై 26న ఆక్స్‌‌ఫర్డ్‌‌లో మేరీ ఎలిజబెత్ ట్రస్ జన్మించారు. తండ్రి లీడ్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాగా, తల్లి లాటిన్ టీచర్. ఆక్స్‌‌ఫర్డ్‌‌లో మెర్టన్ కాలేజీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్‌‌ చదివారు. చార్టర్డ్ మేనేజ్‌‌మెంట్ అకౌంటెంట్‌‌గా 1999లో కెరియర్ ప్రారంభించారు. 2000లో హ్యూజ్ ఓ లియరీని పెండ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. 2001 ఎన్నికల్లో వెస్ట్ యార్క్‌‌షైర్‌‌‌‌లోని హెమ్స్‌‌వర్త్‌‌ నుంచి టోరీ క్యాండిడేట్‌‌గా పోటీ చేసి ఓడిపోయారు. 2005లోనూ ఓటమే. 2010లో డేవిడ్ కేమరూన్ చొరవతో తొలిసారి గెలిచారు. నార్‌‌‌‌ఫోక్‌‌ నుంచి హౌస్ ఆఫ్ కామన్స్‌‌కు ఎన్నికయ్యారు. 2021లో విదేశాంగ మంత్రి అయ్యారు. ఆ పదవి చేపట్టిన రెండో మహిళగా రికార్డు సృష్టించారు.