కౌన్సిలర్ నుంచి ప్రధానమంత్రి స్థాయికి లిజ్..

కౌన్సిలర్ నుంచి ప్రధానమంత్రి స్థాయికి లిజ్..

బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. భారత సంతతికి చెందిన రిషి సునక్ పై ఆమె గెలుపొందారు.  బ్రిటన్ వ్యాప్తంగా మొత్తం 1.60 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఓటింగ్ లో పాల్గొనగా.. 20వేల ఓట్ల తేడాతో రిషి సునక్ ను ఆమె ఓడించారు. మొత్తం 357 కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల ఓట్లలో  మెజారిటీ  179 ఓట్లనూ ఆమె సాధించడంతో  విజయం ఖాయమైంది.

బ్రిటన్ కు చెందిన అధికార కన్జర్వేటివ్ పార్టీ నేతగానూ 47 ఏళ్ల లిజ్ ట్రస్ ఎన్నిక ఏకగ్రీవమైంది.  ఈసందర్భంగా లిజ్ మాట్లాడుతూ.. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల వేళ దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను ముమ్మాటికీ నెరవేర్చేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. 

విజయ సందేశం.. 

బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా దేశ ప్రజలు, కన్జర్వేటివ్ పార్టీ సభ్యులను ఉద్దేశించి లిజ్ ట్రస్ ప్రసంగించారు. దేశ ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించేందుకు సమర్ధవంతమైన ఆర్థిక ప్రణాళికతో ముందుకు వస్తానని ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతం,  ఇంధన సంక్షోభం, జాతీయ ఆరోగ్య సర్వీసు వంటి కీలకమైన అంశాలపై ప్రత్యేక దృష్టితో పరిపాలన సాగిస్తానని వెల్లడించారు. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి విజయం దక్కేలా తన ప్రభుత్వ విధానాలు ఉంటాయని స్పష్టం చేశారు. 

లిజ్ ట్రస్ రాజకీయ ప్రస్థానం.. 

  • 2006 సంవత్సరంలో ఆగ్నేయ లండన్ లోని గ్రీన్ విచ్ స్థానం నుంచి కౌన్సిలర్ గా ట్రస్ తొలిసారి ఎన్నికయ్యారు. 
  • 2010లో జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ నాయకుడు డేవిడ్ కెమరూన్ .. ట్రస్ ను ‘ఏ’ లిస్ట్ లో ఉన్న ప్రముఖ అభ్యర్థుల జాబితాలో చేర్చారు. ఆమెకు ‘నార్ఫోక్’ స్థానం నుంచి పోటీచేసే అవకాశం ఇచ్చారు. 
  • ‘నార్ఫోక్’ స్థానం నుంచి 13వేల ఓట్ల మెజారిటీతో లిజ్ ట్రస్ గెలిచారు.  
  • పార్లమెంటుకు గెలిచాక రెండేళ్లలోనే (2012లో).. ఆమె బ్రిటన్ విద్యాశాఖ మంత్రి అయ్యారు. 
  • 2014లో పర్యావరణ కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు.  
  • 2019లో బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రస్ అంతర్జాతీయ వాణిజ్య కార్యదర్శి అయ్యారు. 
  • 2021లో ఆమెకు బ్రిటన్ ప్రభుత్వంలో కీలకమైన విదేశాంగ కార్యదర్శి బాధ్యతలు దక్కాయి.