బాబాయ్​పై పోటీకి సై ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్

బాబాయ్​పై పోటీకి సై ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్

న్యూఢిల్లీ :  బిహార్​లోని హాజీపూర్ లోక్‌‌సభ స్థానంలో రాష్ట్రీయ లోక్​జనశక్తి పార్టీ(ఆర్​ఎల్​జేపీ) అధ్యక్షుడు, తన బాబాయ్​ పశుపతి కుమార్ పరాస్‌‌ పై పోటీకి తాను సిద్ధంగా ఉన్నట్లు లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. తన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం.. తాను హాజీపూర్ నుంచి పోటీ చేసేందుకు ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. అలాగే, మరో నాలుగు స్థానాలకు త్వరలోనే పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. రాబోయే లోక్​సభ ఎన్నికల్లో ఎన్​డీఏ కూటమి.. ఆర్​ఎల్​జేపీకి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో పశుపతి కుమార్​పరాస్​ఎన్​డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. 

అలాగే, హాజీపూర్​నుంచి ఆర్​ఎల్​జేపీ పోటీ చేస్తుందని వెల్లడించారు. ఈ అంశంపై చిరాగ్​పాశ్వాన్​ను బుధవారం మీడియా ప్రశ్నించగా.. ‘‘అది మా బాబాయ్​ నిర్ణయించుకోవాలి. నేను మాత్రం ఆయన హాజీపూర్​ నుంచి పోటీ చేయడాన్ని స్వాగతిస్తున్నా. అయితే, మా బాబాయ్​​ఎప్పుడూ తాను మోదీకి అండగా ఉంటానని చెప్పేవారు. అలాంటిది ఇప్పుడు ఎన్డీయే 400 సీట్లకు పైగా గెలుపొందాలనే లక్ష్యానికి ఆయన అడ్డంకిగా మారాలనుకుంటున్నారా? అనేది ఇప్పుడు ఆయన డిసైడ్​ చేసుకోవాలి” అని పేర్కొన్నారు.