అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి దూరంగా ఎల్ కే అద్వానీ

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి దూరంగా ఎల్ కే అద్వానీ

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ హాజరు కావడం లేదు.  అయోధ్యలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన రావట్లేదని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.  96 ఏళ్ల అద్వానీతో పాటుగా మురళీ మనోహర్ జోషి ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా హాజరు కాకపోవచ్చునని  తెలుస్తోంది.  అయితే ఈ నెల చివర్లో  ఎల్‌కే అద్వానీ రామమందిరాన్ని దర్శించుకుంటారని  విశ్వహిందూ పరిషత్ నాయకుడు  ఒకరు మీడియాకు తెలిపారు. 2023 డిసెంబర్‌లో అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీలను వీహెచ్‌పీ ఆహ్వానించింది.  రామజన్మభూమి అయిన  అయోధ్యలో రామమందిరం నిర్మించడం కోసం అద్వానీ,  మురళీ మనోహర్ జోషీలు ముందుండి పోరాడారు.  

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన శుభ ఘడియలు రానే వచ్చాయి. అయోధ్యలో కోదండ రామయ్య కొలువుదీరే సమయం ఆసన్నమైంది. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు అయోధ్య ఆలయంలో రామ్ లల్లా (బాల రాముడు) విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు షురూ కానుంది. సుమారు 40 నిమిషాలపాటు జరగనున్న ఈ శుభ కార్యానికి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సర్వం సిద్ధం చేసింది. ప్రధాని మోదీతోపాటు వివిధ రంగాల సెలబ్రిటీలు, పార్టీల నేతలు, సాధువులు, భక్తులు ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు హాజరుకానున్నారు. 

రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 లక్షల ఆలయాల్లో వేడుకలు జరుపుకొంటున్నారని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ వెల్లడించారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలతోపాటు 60కిపైగా దేశాల్లో వీహెచ్ పీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో సంబురాలకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.