కరీంనగర్ లోని ఎల్ఎండీ బ్యాక్ వాటర్ స్థలాలు కబ్జా

కరీంనగర్ లోని ఎల్ఎండీ బ్యాక్ వాటర్ స్థలాలు కబ్జా

కరీంనగర్, వెలుగు: పట్టణంలోని ఎల్ఎండీ ఎఫ్టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్) ఏరియాలో జోరుగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఎల్ఎండీ బ్యాక్ వాటర్ వచ్చే ఏరియాలో ప్రమాదకర‍మని తెలిసినా కొందరు స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. నీళ్లు వచ్చే ప్రాంతంలో మట్టి, రాళ్లు తెచ్చి కుప్పగా పోసి చదును చేస్తున్నారు. అనంతరం ప్లాట్లుగా మార్చి అమ్ముతున్నారు. ఇప్పటికే  సుమారుగా నాలుగెకరాలకు పైగా ప్లాట్లు చేసి అమ్మేశారు. ప్లాట్లు, నిర్మాణాలే కాక చాలా మంది అనధికారికంగా ఎఫ్టీఎల్ చదును చేసి ఆక్రమిస్తున్నారు.  నగర శివారులో ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో బడా లీడర్ల కనుసన్నల్లో ఇదంతా జరుగుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 

నిద్రమత్తులో ఆఫీసర్లు 

బ్యాక్​ వాటర్​ఏరియాలో కడుతున్నా, ఎఫ్టీఎల్ ఏరియాలో మట్టి పోసి, ప్లాట్లు చేసి అమ్ముతున్నా అధికారులు ఎలా పర్మిషన్లు ఇస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరుగుతుంటే ఎస్సారెస్పీ ఆఫీసర్లు కూడా స్పందించకపోవడం దురదృష్టకరం. చదును చేసిన ఏరియాలో చోటా మోటా లీడర్లు పైరవీలు చేసి ఇండ్లకు అనుమతులు తెచ్చుకుంటున్నట్లు సమాచారం. అధికారులు ఫీల్డ్ మీదకు వెళ్లకుండా నీళ్లల్లో ఉన్నా.. ఎక్కడున్నా దర్జాగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్డడం వల్ల  డ్యాం నీటి సామర్థ్యం తగ్గిపోవడమేగాక  డ్యాంలోకి వచ్చే నీరు ఇతర ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంది. ఇకనైనా అధికారులు పట్టించుకుని ఎఫ్ టీఎల్ పరిధివరకు సర్వే చేసి హద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని, అనుమతి లేని ప్లాట్లు కొని ఇబ్బందులు పడకుండా మున్సిపల్ ఆధ్వర్యంలో బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

ఎఫ్టీఎల్ లో ఎట్లా కడతరు?  

లోయర్ మానేరు డ్యాం ఎఫ్టీఎల్ ఏరియాలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు. అయితే చింతకుంట ఏరియా కరీంనగర్ కు దగ్గరగా ఉంటుంది. పద్మానగర్ బైపాస్  రోడ్ లో గుంటకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలదాకా పలుకుతుంది. ఇదే అదనుగా భావించిన కొందరు చోటా మోటా లీడర్లు ఎల్ఎండీ ఎఫ్టీఎల్ పరిధిలో మట్టి, రాళ్లు, వ్యర్థాలు వేసి నీళ్లు రాకుండా అడ్డుకట్ట వేశారు. తర్వాత ఆ స్థలాన్ని ప్లాట్లుగా చదును చేశారు. ఈ  ఏరియాలోని సర్వే నంబర్ 211, 214లో  సుమారుగా నాలుగెకరాలకుపైగా ఇలా చదును చేసి ప్లాట్లు అమ్మేశారు. కొందరు ఇండ్ల నిర్మాణం చేపడుతుండగా, ఇంకొందరు కంకర, ఇసుక తెచ్చి ఇండ్లు కట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఎల్ఎండీ పూర్తిగా నిండితే ఈ ఏరియాలోని నిర్మాణాలన్నీ పూర్తిగా నీట మునిగిపోతాయి. దీంతో చాలా ఎత్తుగా బేస్ మెంట్లు వేసి నిర్మాణాలు చేపడుతున్నారు.  

అక్రమ కట్టడాలపై చర్యలు

ఎల్ఎండీ వద్ద ఎలాంటి అక్రమ కట్టడాలు లేవు. అనుమతులకు లోబడే నిర్మాణాలు చేపడుతున్నారు. ఎఫ్ టీఎల్ ఏరియాల్లో ఎస్సారెస్పీ నుంచి ఎన్ఓసీ ఉన్న స్థలాల్లో పర్మిషన్ తోనే ఇళ్లు నిర్మిస్తున్నారు. ఎవరైనా అనుమతి లేకుండా ప్లాట్లు, అక్రమ నిర్మాణాలు చేపడితే పరిశీలించి, చర్యలు తీసుకుంటాం.- 

- రాజ్ కుమార్, టీపీఎస్, నగరపాలక సంస్థ