లోన్లు కడ్తలేరు..!..జనగామ జిల్లాలో 12,417  మహిళా సంఘాలు.. 

 లోన్లు కడ్తలేరు..!..జనగామ జిల్లాలో 12,417  మహిళా సంఘాలు.. 
  • 9428 సంఘాలకు రూ.741.91 కోట్ల రుణాలు అందజేత
  • 1183 సంఘాలు రూ.9.04 కోట్లు.., మరో 650 సంఘాలు రూ.19.37 కోట్లు పెండింగ్​

జనగామ, వెలుగు :  మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. బ్యాంకు లింకేజీల ద్వారా లోన్లు వచ్చేలా చేస్తోంది. కానీ, లోన్లు తీసుకుంటున్నా చెల్లింపుల్లో పలు మహిళా సంఘాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. 

జనగామలో 12,417  సంఘాలు.. 

జనగామ జిల్లాలోని 12 మండలాల్లో 11,095 సంఘాలు, రెండు మున్సిపాలిటీల్లో 1322 సంఘాలు ఉన్నాయి. మొత్తంగా 12417 మహిళా సంఘాల్లో 1,35,133 మంది మెంబర్లు ఉన్నారు. ఈ సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి ద్వారా సెర్ఫ్​ రుణాలు ఇప్పిస్తోంది. ఈ రుణాలతో కొన్ని సంఘాల్లోని మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నా, మరికొన్ని సంఘాలు సొంతంగా వాడుకుంటున్నాయి. ఈ పరిణామంతో చెల్లింపుల్లో ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాటు మెంబర్లు తీసుకున్న రుణాల వాయిదాలు చెల్లిస్తున్న సంఘాల లీడర్లు కొందరు తమ సొంతానికి కూడా వాడుకుంటూ సక్రమంగా చెల్లింపులు చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిణామంతో  రుణాలు చెల్లించని సంఘాల జాబితా పెరిగిపోతోంది. 

9428 సంఘాలకు రూ.741.91 కోట్లు.. 

 2025--- 26 ఫైనాన్స్​ ఇయర్​లో  జిల్లాలోని 8609 సంఘాలకు రూ. 460.34 కోట్లు రుణాలు ఇవ్వాలని టార్గెట్​గా నిర్ణయించుకున్నారు. అయితే చెల్లింపుల విషయంలో కొందరు వెనుకాడుతుండడంతో 6401 సంఘాలకు (74 శాతం) రూ.435.87 కోట్లు రుణాలు ఇచ్చారు. గత ఫైనాన్స్​ ఇయర్​లో సంఘాలు తీసుకున్నరుణాలతో కలిపి మొత్తంగా 9428 సంఘాలకు రూ.741.91కోట్ల రుణాలు తీసుకున్నట్టయింది. కాగా, మెఫ్మా పరిధిలోని 395 సంఘాలు రూ.58.68 కోట్లు రుణాలు తీసుకున్నాయి. 

వాయిదాలు సరిగా చెల్లించట్లే.. 

రుణాలు తీసుకున్న సంఘాల్లో 12 శాతం సంఘాలు సక్రమంగా చెల్లించడం లేదు. జిల్లాలోని 12 మండలాల్లోని రుణాలు తీసుకున్న వాటిలో 1183 సంఘాలు తమ రుణాలను సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో ఈ సంఘాలు 9.04 కోట్లు చెల్లించాల్సి ఉంది. మరో 650 సంఘాలు పెద్ద మొత్తంలో రూ.19.37 కోట్లు మొత్తం రూ.28.42 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటిలో కొన్ని సంఘాలు రుణం తీసుకున్న తర్వాత ఒకటి, రెండు వాయిదాలు కూడా సరిగా చెల్లించలేదని తెలుస్తోంది. తీసుకున్న రుణాలకు వాయిదాలు చెల్లించాలని డీఆర్డీఏ నుంచి ఒత్తిడి వస్తున్నా, ఆయా సంఘాల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 

నర్మెట్టలో అత్యధికంగా పెండింగ్..​

జనగామ జిల్లాలోని 12 మండలాల్లో ఎక్కువ మొత్తం పెండింగ్ దేవరుప్పల ఉన్నట్టుగా కన్పిస్తున్నా, అక్కడ 133 సంఘాలు కలిపి రూ.4.20 కోట్లు పెండింగ్ ఉన్నాయి. అయితే నర్మెట్ట మండలంలో కేవలం 43 సంఘాలే రూ.2.49 కోట్లు పెండింగ్​ ఉన్నాయి. ఈ లెక్కన నర్మెట్టనే ఎక్కువగా పెండింగ్​లో ఉంది. కొడకండ్లలో 49 సంఘాలు రూ.2.30 కోట్లు పెండింగ్ ఉన్నాయి. అతితక్కువగా 24 సంఘాలకు రూ.69.31 లక్షలు పెండింగ్ ఉంది.