
- రాష్ట్రవ్యాప్తంగా 29 వేలకు పైగా ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాలకు ఈసీ ఏర్పాట్లు
- రాష్ట్రంలో మొత్తం 5,763 ఎంపీటీసీ స్థానాలు
- ఈ నెల 10న పోలింగ్ స్టేషన్లు, తుది ఓటరు జాబితా వివరాల వెల్లడికి కసరత్తు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, తుది ఓటరు జాబితా తయారీ ప్రక్రియ స్పీడందుకున్నది. ఎంపీటీసీ (మండల ప్రజా పరిషత్), జడ్పీటీసీ (జిల్లా ప్రజా పరిషత్) ఎన్నికల కోసం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఒక పోలింగ్ కేంద్రంలో 700 ఓట్ల వరకు ఉండేలా చూస్తున్నారు. ఒకవేళ ఓటర్ల సంఖ్య అంతకంటే ఎక్కువ ఉంటే.. అక్కడే మరో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నారు. దీనిద్వారా పోలింగ్ కేంద్రాలు ఓటర్లకు అందుబాటులో ఉండడంతో పాటు పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు, పోలింగ్ శాతం పెరిగేందుకు దోహదపడ్తుందని అధికారులు భావిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 5,763 ఎంపీటీసీ స్థానాలుండగా.. 565 ఎంపీపీ, జడ్పీటీసీలు, 31 జడ్పీలు ఉన్నాయి. కాగా, జనాభాను బట్టి ఎంపీటీసీ స్థానాలను వర్గీకరిస్తారు. కనీసం3,500 ఓట్లు, ఆపైన ఉంటే ఒక ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేస్తారు.
10న ఎంపీటీసీ పోలింగ్ స్టేషన్లు, తుది ఓటరు జాబితా..
ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఎంపీటీసీలు, జడ్పీటీసీల ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ, జడ్పీటీసీల ముసాయిదా ఓటర్ల జాబితాను ఈ నెల 9న ప్రదర్శించాలని అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది.
కలెక్టర్ ఆమోదంతో ఎంపీడీవో, ఏడీఈఏఎస్ ద్వారా పోలింగ్ స్టేషన్ల జాబితాను తయారు చేసి గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించారు. అలాగే, 8న జిల్లా ఎన్నికల అధికారులు జిల్లా స్థాయిలో రాజకీయ, మండల స్థాయిలో ఎంపీడీవోలు వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు.
ఇప్పటికే పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలను స్వీకరిస్తుండగా.. ఈ ప్రక్రియ 8న ముగియనున్నది. 9వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలు తెలపాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎంపీటీసీల వారీగా పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల తుది జాబితాను 10న జిల్లా ఎన్నికల అధికారులు ప్రదర్శించనున్నారు.
గతం కంటే తగ్గనున్న పోలింగ్ స్టేషన్లు..
2019లో ఎంపీటీసీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 32,045 ఎంపీటీసీ పోలింగ్కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఈసారి 29 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చే చాన్స్ ఉన్నట్లు తెలిసింది. గతంతో పోలిస్తే పోలింగ్ కేంద్రాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చాలా గ్రామాలు మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో కలవడం పోలింగ్ కేంద్రాలపై ప్రభావం పడింది.
2019 ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాలు 5,817 ఉండగా.. ప్రస్తుతం 5,763కు చేరింది. గతం కంటే 54 స్థానాలు తగ్గాయి. ఎంపీపీలు, జడ్పీటీసీలు 539 ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 565కు చేరింది. గతం కంటే 26 వరకు ఎంపీపీలు, జడ్పీటీసీలు స్థానాలు పెరిగాయి.
గతంలో 32 జడ్పీ స్థానాలు ఉండగా.. 31కి చేరింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాలు శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం కావడంతో ఈ జిల్లా స్థానిక ఎన్నికలకు దూరమైంది.