జూన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు .. సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్

జూన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ..  సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్

హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ర్టంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరగనున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జూన్ లో నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సంకేతాలు ఇచ్చారు. బుధవారం జరిగిన భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ రివ్యూ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. ‘‘జూన్ చివరి వారంలో సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల ఎన్నికలు నిర్వహిస్తే.. ఇక రాష్ట్రంలో ఎన్నికల లొల్లి ఉండదు” అని అన్నారు. రాష్ట్రంలో సర్పంచ్ ల పదవీకాలం ఇప్పటికే ముగిసింది. 

ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్నది. ఇక ఎంపీటీసీల టర్మ్ జులై 3 వరకు ఉండగా, జడ్పీటీసీల టర్మ్ జులై 5 వరకు ఉందని పంచాయతీ రాజ్ అధికారులు చెబుతున్నారు. కాగా, రాష్ర్టంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా..  539 జడ్పీటీసీ స్థానాలు,  5,857 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 2019లో సర్పంచ్, ఎంపీటీసీ , జడ్పీటీసీల ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. మొదట సర్పంచ్.. ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. అయితే ఈసారి ఒకేసారి సర్పంచ్, ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. 

ఎన్నికల సంఘం రెడీ..   

లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ర్ట ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా ఉంది. లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిసినంక రాష్ర్ట ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే, వెంటనే ఎన్నికల ప్రక్రియ మొదలుపెడతామని అధికారులు చెబుతున్నారు. రాష్ర్టంలో కుల గణన చేపడతామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ప్రాసెస్ కు సుమారు నెలన్నర టైమ్ పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ కులగణన చేస్తే కొంత లేట్ గా లోకల్ బాడీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను అప్పటి సీఎం కేసీఆర్ తగ్గించారు. కులగణన చేస్తే బీసీల రిజర్వేషన్లు పెరుగుతాయని బీసీ సంఘాల నేతలు చెబుతున్నారు.