టార్గెట్.. జడ్పీ పీఠం..చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల ప్రణాళికలు

టార్గెట్.. జడ్పీ పీఠం..చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల ప్రణాళికలు
  • మొత్తం 26 జడ్పీటీసీ స్థానాల్లో 11 బీసీ స్థానాలే కీలకం
  • సిద్దిపేట జిల్లాలో ఎన్నికల సందడి

 సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి బీసీ  జనరల్ కు రిజర్వ్ కావడంతో ఎలాగైనా ఆ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రధాన పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 26 జడ్పీటీసీ స్థానాలుండగా 11 స్థానాలు బీసీలకు కేటాయించారు.

 వీటిలో చిన్నకోడూరు, కోహెడ, మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట, సిద్దిపేట అర్బన్ స్థానాలు బీసీ జనరల్, దౌల్తాబాద్, జగదేవ్ పూర్, కొమురవెల్లి, మద్దూరు, తొగుట స్థానాలను బీసీ మహిళలకు రిజర్వ్ చేశారు.  దీంతో గెలిచే బీసీ అభ్యర్థులకే  జడ్పీ చైర్మన్ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు మెజార్టీ స్థానాలు దక్కించుకోవడంపై ఫోకస్​ చేస్తున్నాయి. గెలుపు అవకాశాలున్న వారినే బరిలో దించే దిశగా ముఖ్య నేతలు పావులు కదుపుతున్నారు. 

ఇదిలా ఉంటే సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్,  జడ్పీ పీఠంపై పాగా వేయాలని కాంగ్రెస్, బీజేపీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, హరీశ్‌‌రావు, కాంగ్రెస్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ నుంచి ఎంపీ రఘునందన్ రావు జిల్లా నుంచే  ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఎవరికి వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టుసాధించి సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా సీట్లకు సంబంధించి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. హైకోర్టు తీర్పు వచ్చాక అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఎంపీపీ ఇస్తే జడ్పీటీసీని గెలిపిస్తా..

ఓవైపు ప్రధాన పార్టీలన్నీ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని ఆలోచిస్తుంటే గజ్వేల్ నియోజవర్గానికి చెందిన అధికార పార్టీ నాయకుడొకరు కొత్త డిమాండ్ ను ముందుకు తెస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన మండలంలోని జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. అయితే సదరు నాయకుడు జడ్పీ చైర్మన్ పదవిపై కన్నేసినా రిజర్వేషన్ అనుకూలించక పోవడంతో పోటీ దూరంగా ఉండిపోయారు. ఎంపీపీ పదవి తన భార్యకు ఇస్తానని హామీ ఇస్తే జడ్పీటీసీ అభ్యర్థిని సొంత ఖర్చుతో గెలిపిస్తానని చెప్పినట్లు తెలిసింది. దీనికి ఆ పార్టీ నేతలు ఒప్పుకుంటారో లేదోనన్న చర్చ జరుగుతోంది. 

అన్ని పార్టీల నేతలతో సంప్రదింపులు

స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనుకూలించక పార్టీ టికెట్ దక్కదని భావిస్తున్న నాయకులు అవసరమైతే పార్టీ మారి ఎన్నికల బరిలోకి దిగడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రధాన పార్టీలకు గెలుపు అవకాశాలున్న అభ్యర్థులు దొరక్కపోతే.. దీన్ని తమకు సానుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఈ విషయమై వారు అన్ని పార్టీల నేతలతో సంప్రదింపులు 
జరుపుతున్నారు.  

నాలుగు బీసీ స్థానాలు ఇక్కడే..

జిల్లాలో బీసీలకు రిజర్వ్ అయిన స్థానాల్లో నాలుగు సిద్దిపేట నియోజకవర్గంలోనే ఉండగా.. ఇవన్నీ జనరల్ కే కేటాయించడం ఆసక్తి కలిగిస్తోంది. బీసీలకు మొత్తం 11 స్థానాలను రిజర్వ్ చేయగా.. వీటిలో 6 జనరల్, 5 మహిళలకు కేటాయించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు, నంగునూరు, నారాయణరావుపేట, సిద్దిపేట అర్బన్ జడ్పీటీసీ స్థానాలు బీసీ జనరల్ కు రిజర్వ్ కావడంతో మరోసారి జడ్పీ చైర్మన్ పదవి నియోజకవర్గానికే దక్కుతుందా అనే చర్చ మొదలైంది. గతంలో చిన్నకోడూరు నుంచి జడ్పీటీసీగా గెలిచిన రోజాశర్మ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహించారు.