
- నోటిఫికేషన్లో పేర్కొన్న రాష్ట్ర ఎన్నికల సంఘం
- పోటీపై ఎలాంటి స్పష్టత ఇవ్వని సింగరేణి యాజమాన్యం
- చేయాలా.. వద్దా.. అనే అయోమయంలో ఆశావహులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సింగరేణి ఉద్యోగులు, కార్మికులు పోటీ చేయొచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చినా.. సింగరేణి యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా.. వద్దా..! అనే సస్పెన్స్ ఉద్యోగులు, కార్మికుల్లో నెలకొంది. గతంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు అయ్యారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందుగా రాజీనామా చేయా ల్సిందేనని కొంతకాలం కింద యాజమాన్యం ఆదేశాలు జారీ చేయడంతో ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చినందున పోటీకి పలువురు కార్మికులు ఆసక్తి చూపుతున్నారు.
గతంలో పోటీ చేసి పదవులు చేపట్టి..
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో సింగరేణి విస్తరించి ఉంది. సంస్థకు చెందిన కార్మికులు, ఉద్యోగులు జాబ్ చేస్తూనే ఎన్నికల్లో పోటీ చేసి పదవులు చేపట్టారు. మరికొందరు పలు రాజకీయ పార్టీలకు నాయకత్వం వహించారు. గతంలో కార్మిక సంఘాల నేతలు కూడా ఆయా పార్టీల నుంచి పోటీ చేసి.. ఇల్లెందు, చెన్నూరు, ఆసిఫాబాద్, మేడారం నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు.
సింగరేణి ఉద్యోగులు మొల బాబు, చొప్పరి రాజమల్లు, సూరిబాబు, బరిగెల సాయిలు వైస్‌ఎంపీపీలుగా, మల్లికార్జున్, కూసన వీరభద్రం ఎంపీటీసీలుగా, వాసిరెడ్డి సీతారామయ్య సర్పంచ్‌గా, కె.సారయ్య ఎంపీపీగా, మహంకాళి శ్రీనివాస్ తో పాటు పలువురు సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పదవులు చేపట్టారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చాలామంది పోటీకి ఆసక్తి చూపుతున్నారు.
కోర్టు ఆర్డర్ ఇచ్చినా..
పార్లమెంట్, అసెంబ్లీకి పోటీ చేయాలంటే తప్పనిసరిగా ముందుగా ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఆ నిబంధన వర్తించదని గతంలో పలువురు ఉద్యోగులు కోర్టుకు వెళ్లారు. స్థానిక సంస్థలకు పోటీ చేసేందుకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కూడా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దాన్ని యాజమాన్యం తొక్కిపెట్టి ఎన్నికల్లో పోటీ చేయకూడదని సర్క్యూలర్లు ఇస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ నేపథ్యంలో ఇంకా సింగరేణి ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. దీంతో కార్మికుల్లో అయోమయం నెలకొంది. మరోవైపు ఎన్నికల సంఘమే స్పష్టత ఇచ్చినందున పలువురు పోటీకి సిద్ధమవుతున్నారు.
త్వరలోనే స్పష్టత ఇస్తాం
స్థానిక సంస్థల ఎన్నికల్లో సింగరేణి కార్మికులు, ఉద్యోగులు పోటీ చేసే విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్‌ను పరిశీలిస్తున్నాం. కార్మికులు పోటీ చేయవచ్చా.. లేదా.. అనే దానిపై చర్చిస్తున్నాం. దీనిపై త్వరలోనే స్పష్టమైన ప్రకటన ఇస్తాం.
కవితా నాయుడు, జీఎం పర్సనల్, సింగరేణి కాలరీస్ కంపెనీ