
కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ ను మే 31 వరకు పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. మే 12న జాతినుద్దేశించి ప్రసంగిస్తూ లాక్ డౌన్ 4.0 పూర్తి భిన్నంగా ఉండబోతోందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర హోం శాఖ అనేక ఆర్థిక కార్యకలాపాలకు సడలింపు ఇచ్చింది. దేశ వ్యాప్తంగా పూర్తిగా క్లోజ్ అయ్యే కొన్ని సర్వీసులు తప్ప మిగతా వాటి విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే పరిశ్రమలు, కంపెనీలు పరిమిత సంఖ్యలో ఉద్యోగులతో పని చేసేందుకు అనుమతి ఇచ్చిన కేంద్రం ఇప్పుడు తాజాగా.. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో ప్యాసింజర్ బస్సు సర్వీసులను నడపవచ్చని రాష్ట్రాలకు సూచించింది. పరస్పర అంగీకారంతో రాష్ట్రాల మధ్య కూడా ప్రయాణాలకు అవకాశం ఇచ్చింది. అయితే కొన్ని ఆంక్షలను మాత్రం దేశమంతా కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది.
దేశమంతా కొనసాగే ఆంక్షలు.. స్వల్ప సడలింపులు
– దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్. మెడికల్, సెక్యూరిటీ అవసరాలకు సంబంధించిన విమానాలు, ఎయిర్ అంబులెన్స్ లకు మాత్రమే అనుమతి.
– మెట్రో రైలు సర్వీసుల మూసివేత కొనసాగింపు.
– హోటల్స్, రెస్టారెంట్లు క్లోజ్. అయితే వాటిలో కిచెన్స్ లో పనులు చేసుకుని.. డోర్ డెలివరీ సర్వీసులు అందించవచ్చు.
– సినిమా థియేటర్లు, మాల్స్, స్కూళ్లు, కాలేజీలు, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్ టైన్మెంట్ పార్కులు, బార్లు, ఆడిటోరియమ్స్ బంద్.
– ఆటగాళ్ల కోసం స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్టేడియాలు ఓపెన్ చేసేందుకు కేంద్ర హోం శాఖ అనుమతి ఇచ్చింది. అయితే ప్రేక్షకులు ఎవరూ లోపలికి అనుమతించకూడదని ఆదేశించింది.
– అన్ని సామాజిక, రాజకీయ సభలు పెట్టడానికి వీలు లేదు.
– ఆలయాలు, ప్రార్థన స్థలాలకు భక్తులను అనుమతించకూడదు. మతపరమైన సదస్సులు పెట్టకూడదు.
– రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు ప్రజలెవరూ బయట తిరగకూడదు. అత్యవసర సర్వీసులకు మినహా అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.
– కంటైన్మెంట్ జోన్లలో అత్యవసరాలు తప్ప మిగిలిన సర్వీసులేవీ అనుమతించకూడదని, లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. అయితే గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లలో పరిస్థితిని బట్టి యాక్టివిటీకి అనుమతించే అధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చింది.