అధికమవుతున్న కరోనా కేసులు: ఒడిశాలో మ‌ళ్లీ లాక్‌డౌన్

అధికమవుతున్న కరోనా కేసులు: ఒడిశాలో మ‌ళ్లీ లాక్‌డౌన్

ఒడిశా రాష్ట్రంలో క‌రోనా కేసుల నమోదు రోజు రోజుకూ ఎక్కువ అవుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా ప్ర‌భావిత ప్రాంతాల్లో లాక్‌ డౌన్ విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇవాళ్టి(శుక్రవారం, జులై- 17) నుంచి 31వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని ప్రభుత్వం తెలిపింది. ఒడిశాలోని గంజామ్‌, ఖోర్ధా, క‌ట‌క్‌, జాజ్‌పూర్ జిల్లాల‌తో పాటు రూర్కెలా మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప్రాంతాల్లో శుక్ర‌వారం రాత్రి 9 గంట‌ల నుంచి 31 వ తేదీ అర్ధరాత్రి వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అసిత్ త్రిపాఠి తెలిపారు.

ప్ర‌భుత్వ‌, ప్రైవేటు సంస్థ‌లు స‌హా అన్ని వ్యాపార దుకాణాలు మూసివేయాల‌న్నారు అసిత్ త్రిపాఠి. ప్ర‌జ‌లు కూడా పూర్తిగా దీనికి స‌హ‌క‌రించాల‌ని స్వ‌చ్ఛందంగా లాక్‌డౌన్ పాటించాల‌ని కోరారు. నిత్యావ‌సరాలు ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట‌ల వ‌ర‌కు అనుమ‌తి ఉంద‌న్నారు. అంతేకాకుండా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామ‌ర్స్ సేవ‌లకు కూడా అనుమ‌తి ఉంటుంద‌ని ఉత్త‌ర్వులో తెలిపింది. పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఉండ‌నున్న జిల్లాలో ప‌క‌డ్భందీగా ఆంక్ష‌లు పాటించేలా ఇప్ప‌టికే ఆయా జిల్లా ఎస్పీల‌కు ఆదేశాలు జారీ చేసింది ఒడిశా ప్రభుత్వం.