
చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం అల్లకల్లోలం సృష్టించినప్పటికీ.. భారత్ లో కొంత మేర అదుపులోనే ఉంది. దీనికి కారణం వైరస్ వ్యాప్తి తీవ్రతను పసిగట్టి ముందస్తుగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయడమేనని నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని పలు అంతర్జాతీయ సంస్థల అధ్యయనాలు కూడా స్పష్టం చేశాయి. ఆయా రిపోర్టులను ప్రస్తావిస్తూ దేశంలో భారీ కరోనా కేసులు, మరణాలు నమోదు కాకుండా కంట్రోల్ చేయడంలో లాక్ డౌన్ సక్సెస్ కీలక పాత్ర పోషించిందని కేంద్ర స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ కార్యదర్శి ప్రవీణ్ శ్రీవాస్తవ చెప్పారు. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి వేగాన్ని సమర్థంగా కంట్రోల్ చేయడంతో పాటు ఎక్కువ ప్రాంతాలకు స్ప్రెడ్ కాకుండా అడ్డుకట్ట వేయగలిగామన్నారు.
శుక్రవారం కరోనాపై నిర్వహించిన ప్రెస్ మీట్ లో శ్రీవాస్తవ మాట్లాడారు. బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ నివేదిక ప్రకారం దేశంలో లాక్ డౌన్ లేకుంటే మే 15 నాటికే గరిష్ఠంగా 2 లక్షల మంది వరకు కరోనాతో మరణించే వారని చెప్పారు. లాక్ డౌన్ సక్రమంగా అమలు చేయడం వల్ల మే 15 నాటికి 36 లక్షల నుంచి 70 లక్షల కరోనా కేసుల నమోదు కాకుండా కట్టడి చేయడంతో పాటు 1.2 నుంచి 2.1 లక్షల మంది ప్రాణాలను కరోనాకు బలి కాకుండా కాపాడగలినట్లు తెలిపారు శ్రీవాస్తవ. అలాగే PHFI సంస్థ రిపోర్ట్ ప్రకారం 78 వేల మంది ప్రాణాలను లాక్ డౌన్ సేవ్ చేసిందన్నారు. ఇక ఇద్దరు ఎకనమిస్టులు చేసిన సర్వే ప్రకారం దేశంలో 23 లక్షల కరోనా కేసులు, 68 వేల మరణాలు నమోదు కాకుండా కంట్రోల్ చేయగలిగామన్నారు. కొందరు సైంటిస్టులు కలిసి ఇండిపెండెంట్ గా చేసిన అధ్యయనం ప్రకారం 15.9లక్షల కేసులు, 51 వేల మరణాలను లాక్ డౌన్ తప్పించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ తో కలిసి చేసిన సర్వే ప్రకారం లాక్ డౌన్ లేకుంటే దేశంలో 20 లక్షల కరోనా కేసులు, 54 వేల మరణాలు నమోదయ్యేవని తేలిందన్నారు.
సరైన ట్రాక్ లోనే ఉన్నాం
సగటున మొత్తం ఐదు ఆధ్యయనాలను కలిపి చూస్తే దేశంలో లాక్ డౌన్ అమలు చేయడం వల్ల 14 లక్షల నుంచి 29 లక్షల కరోనా కేసులను నమోదు కాకుండా కంట్రోల్ చేశామని శ్రీవాస్తవ చెప్పారు. అలాగే 37 వేల నుంచి 78 వేల మంది ప్రాణాలను కాపాడగలిగామన్నారు. ప్రజల సహకారంతో లాక్ డౌన్ ను సమర్థంగా అమలు చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించామని ఆయన అన్నారు. కరోనా పై పోరాటంలో లాక్ డౌన్ చాలా ఉపయోగపడిందని, మనం సరైన ట్రాక్ లోనే వెళ్తున్నామని కాన్ఫిడెంట్ గా చెప్పగలనని ఆయన అన్నారు.
అనంతరం మీడియాతో సెంట్రల్ కరోనా టాస్క్ ఫోర్స్ ఎంపవర్డ్ గ్రూప్ 1 చైర్మన్ వీకే పాల్ మాట్లాడుతూ భారత్ లో సరైన సమయంలో లాక్ డౌన్ అమలు చేయడంతో కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థంగా కట్టడి చేయగలిగామన్నారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసిన ఈ సమయంలో కరోనా కేసులు కంట్రోల్ చేయడంతో పాటు ఆస్పత్రుల్లో సదుపాయాలతో పాటు భారీగా ప్రొటెక్టివ్ ఎక్యూప్మెంట్ సమకూర్చుకున్నట్లు చెప్పారు . కేవలం రెండు నెలల్లోనే దేశంలో 1093 కోవిడ్ స్పెషల్ ఆస్పత్రులను సిద్ధం చేసుకున్నామని, అలాగే 3.24 లక్షల బెడ్స్ కరోనా ట్రీట్మెంట్ కు అనుగుణంగా రెడీ చేశామని అన్నారు. అలాగే మరికొన్ని కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి.. మరో 6.5 లక్షల బెడ్స్ అందుబాటులోకి తెచ్చామన్నారు. 56 లక్షల మంది వైద్య సిబ్బందికి కరోనాను ఎదుర్కోవడంపై శిక్షణ ఇచ్చామన్నారు. ప్రస్తుతం ప్రతి రోజు లక్ష మందికి పైగా టెస్టులు చేస్తున్నామన్నారు. రాష్ట్రాల్లో 30 లక్షల పీపీఈ కిట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే దేశంలో రోజూ 3 లక్షల పీపీఈ కిట్స్ తయారు చేయగలిగే సామర్థ్యం పెంచుకున్నామని చెప్పారు. ఏడు కంపెనీలు దేశంలోనే కరోనా టెస్టు కిట్లను తయారు చేస్తున్నాయని, వ్యాక్సిన్ అభివృద్ధికి కూడా ప్రయోగాలు జరుగుతున్నాయని తెలిపారు.
According to @BCG's model, lockdown has saved between 1.2 – 2.1 lakh lives, number of #COVID19 cases averted is between 36 – 70 lakh
:Secretary, @GoIStats #IndiaFightsCorona pic.twitter.com/8529tQvNGo
— PIB India #StayHome #StaySafe (@PIB_India) May 22, 2020