లాక్ డౌన్ మ‌రో 15 రోజులు పొడిగించాలి.. జిమ్స్ ఓపెన్ చేయాలి

లాక్ డౌన్ మ‌రో 15 రోజులు పొడిగించాలి.. జిమ్స్ ఓపెన్ చేయాలి

క‌రోనా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డి కోసం విధించిన లాక్ డౌన్ ను మ‌రో 15 రోజుల పాటు పొడిగించాల‌ని గోవా సీఎం ప్ర‌మోద్ మ‌హాజ‌న్ అన్నారు. మే 31తో లాక్ డౌన్ ముగుస్తుండ‌డంతో దేశ వ్యాప్తంగా అనుస‌రించాల్సిన విధానంపై అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా గోవా సీఎం ప్ర‌మోద్ మ‌హాజ‌న్.. ఆయ‌న‌తో ఫోన్ లో మాట్లాడిన త‌ర్వాత వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో త‌ప్ప‌నిస‌రిగా లాక్ డౌన్ పొడిగించాల్సిందేన‌ని తాను చెప్పాన‌న్నారు. మ‌రో 15 రోజులు లాక్ డౌన్ కొన‌సాగించాల‌ని, అయితే మ‌రిన్ని స‌డ‌లింపులు ఇవ్వాల‌ని కోరాన‌న్నారు. రెస్టారెంట్ల‌న్నీ 50 % కెపాసిటీతోనైనా ఓపెన్ చేసుకునేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని డిమాండ్ చేసిన‌ట్లు చెప్పారు. అలాగే జిమ్స్ తెర‌వాల‌ని చాలా మంది నుంచి డిమాండ్స్ వ‌స్తున్నాయ‌ని, దీనిని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాన‌ని ప్ర‌మోద్ మ‌హాజ‌న్ తెలిపారు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ కోసం మార్చి 25 నుంచి మొద‌లైన దేశ వ్యాప్త లాక్ డౌన్ ఇప్ప‌టికే ప‌లుమార్లు పొడిగించింది కేంద్రం. అయిన‌ప్ప‌టికీ క‌రోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతూనే ఉండ‌డంతో ప్రస్తుతం అమ‌ల‌వుతున్న లాక్ డౌన్ 4.0 మే 31న ముగుస్తుండ‌గా… మ‌రోసారి పొడిగింపు త‌ప్ప‌ద‌ని ఇప్ప‌టికే సూచ‌న‌లు వ‌స్తున్నాయి. ప్ర‌ధాని మోడీ ఆదివారం త‌న మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మంలో దీని గురించి ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.