కరోనా పంజా.. ఫ్రాన్స్​, జర్మనీలో మళ్లీ లాక్​డౌన్​

కరోనా పంజా.. ఫ్రాన్స్​, జర్మనీలో మళ్లీ లాక్​డౌన్​
  • అమెరికాలో ఒక్కరోజే91 వేల మందికి పాజిటివ్​
  • జనం నిర్లక్ష్యంవల్లే.. ఎక్స్​పర్ట్స్
  • పాక్​లో పార్షియల్ లాక్​డౌన్
  • ఢిల్లీ, కేరళలోనూ పెరుగుతున్నయ్
  • మహారాష్ట్రలో కంట్రోల్ లోకి..

కరోనా వైరస్​ మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్నది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 5 లక్షల 45 వేల 936 మందికి కరోనా సోకింది. కరోనా ఎఫెక్ట్​తో తీవ్రంగా నష్టపోయిన అమెరికాలో  సెప్టెంబర్​లో కొంచెం కంట్రోల్​లోకి వచ్చినప్పటికీ.. ఇప్పుడు మునుపటి కన్నా భారీగా కేసులు నమోదవుతున్నాయి. యూరప్​లో ఇప్పటికే సెకండ్​వేవ్​ మొదలైంది. కరోనా విజృంభణతో ఫ్రాన్స్​, జర్మనీ మళ్లీ లాక్​డౌన్​ విధించాయి. మన దేశంలో మాత్రం కొత్త కేసులు తక్కువగా వస్తున్నాయి.

న్యూఢిల్లీ: ప్రపంచంపై కరోనా మరోసారి కోరలు విసురుతోంది. రోజూ లక్షలాది మంది ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం 5 లక్షల 7 వేల 543 మంది కరోనా బారిన పడగా.. గురువారం రికార్డు స్థాయిలో 5లక్షల 45వేల 936 మందికి వైరస్​ సోకిం ది. 9 రోజులుగా రోజూ 4 లక్షల మందికిపైనే బాధితులవుతున్నారు. అక్టోబర్​ 21 నుంచి 29 వరకు తొమ్మిదో రోజుల్లోనే 42 లక్షల 28 వేల 312 మందికి మహమ్మారి సోకింది. అంటే సగటున రోజూ 4 లక్షల 69 వేల 812 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన ఇంకో పది రోజుల్లోనే కరోనా కేసులు 5 కోట్ల మార్కును దాటే అవకాశం ఉంది. మొత్తంగా ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల 54 లక్షల 47 వేల 474 మంది కరోనా బారిన పడితే.. 11,88,259 మంది చనిపోయారు.

అమెరికాలో మూడోవేవ్​?

ప్రపంచంలో అన్నింటికన్నా ఎక్కువ ఎఫెక్ట్​ అయిన దేశం ఏదైనా ఉందంటే అమెరికానే. ప్రస్తుతం అక్కడ 92 లక్షల 16 వేల 316 మంది కరోనా బారిన పడ్డారు. జులై, ఆగస్టులో రికార్డ్​ స్థాయిలో కరోనా కేసులు నమోదైనా.. సెప్టెంబర్​లో కొంచెం కంట్రోల్​లోకి వచ్చింది. అయితే, ఇప్పుడు మునుపటి కన్నా భారీగా కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే అక్కడ 91 వేల 530 కేసులు బయటపడ్డాయి. ఒకేరోజు నమోదైన కేసుల్లో ఇదే రికార్డ్. వారం రోజులుగా రోజూ సగటున 80 వేల మంది దాని బారిన పడుతున్నారు. దీంతో దేశంలో థర్డ్​ వేవ్​ మొదలైందన్న అనుమానాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. జులైలోనే అమెరికాలో సెకండ్​వేవ్​ మొదలైందని, సెప్టెంబర్​లో కేసులు తగ్గడంతో కంట్రోల్​లోకి వచ్చిందని అంటున్నారు. ఇప్పుడు మళ్లీ కేసులు పెరగడమన్నది థర్డ్​వేవ్ సూచనే అని హెచ్చరిస్తున్నారు.

ఎందుకు పెరుగుతున్నయ్​..?

అమెరికా, యూరప్​లలో కేసులు పెరగడానికి కార ణం జనం నిర్లక్ష్యం, ప్రభుత్వాల మధ్య పరస్పర సహ కారం లేకపోవుడేనని నిపుణులు చెబుతున్నారు. కేసులు తగ్గాయని మాస్కులులేకుండా బయటకు వెళ్లడం, జల్సాలు చేసుకోవడం వల్లే మళ్లీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  లాక్​డౌన్​ నిర్ణయంతో యూరప్​, అమెరికాలోని మార్కెట్​లు భారీగా పతనమయ్యాయి. అమెరికాలో ఎస్​అండ్​పీ 3% వరకు నష్టపోయింది.

ఫ్రాన్స్​, జర్మనీలో మళ్లీ లాక్​డౌన్​

కేసులు పెరిగిపోతుండడంతో ఫ్రాన్స్​, జర్మనీలు మళ్లీ లాక్​డౌన్​ను విధించాయి. శుక్రవారం నుం చి లాక్​డౌన్​ విధిస్తున్నట్టు ఫ్రాన్స్​ ప్రెసిడెంట్​ ఇమ్మాన్యుయేల్​ మెక్రాన్​ ప్రకటించారు. డిసెంబర్​1 దాకా ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. నిత్యావసరాలు, మెడికల్​ ఎమర్జెన్సీ మినహా మిగతా అన్నీ క్లోజ్​ అని వెల్లడించారు. కరోనా కేసులు సడన్​గా పెరుగుతున్నాయని, దాని ప్రభావం సీరియస్​గా ఉందని చెప్పారు. ఫస్ట్​వేవ్​ కన్నా సెకండ్​వేవ్​ చాలా తీవ్రంగా ఉందన్నారు. అందుకే లాక్​డౌన్​ విధిస్తున్నట్టు ప్రకటించారు. బయటకు వెళ్లాల్సి వస్తే అధికారుల నుంచి పర్మిషన్​ తప్పనిసరిగా తీసుకోవాలని, పోలీసులకు ఆ డాక్యుమెంట్​ను చూపించాలని వెల్లడించారు. ఇక, బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లను నవంబర్​ నుంచి మూసేస్తున్నట్టు జర్మనీ చాన్స్​లర్​ ఏంజెలా మెర్కెల్​ ప్రకటించారు. స్కూల్స్, షాపులు ఓపెన్​ ఉంటాయని చెప్పారు. సెకండ్​ వేవ్​ మొదలైందన్న ఆందోళనల నేపథ్యంలో పాకిస్తాన్​లో పార్షియల్​ లాక్​డౌన్​ను విధించారు.

మన దగ్గర తగ్గుతున్నయ్

ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నా.. మన దేశంలో  కరోనా కొత్త కేసులు తక్కువగా వస్తున్నాయి. పాజిటివ్​ కేసుల సంఖ్య రోజుకు 48 వేలకు తగ్గాయి. రికవరీలు పెరిగి.. యాక్టివ్​ కేసులూ తగ్గాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 80 లక్షల 90 వేల 90 మందికి కరోనా సోకగా.. లక్షా 21 వేల 148 మంది చనిపోయారు. డెత్​ రేట్​1.5 శాతంగానూ.. రికవరీ రేట్​ 91 శాతంగానూ నమోదైంది. దేశంలో 5 లక్షల 95 వేల 61 మంది ఇంకా కరోనాకు ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. దేశానికి ఎపిసెంటర్​గా ఉన్న మహారాష్ట్రలో పరిస్థితి కంట్రోల్​లోకి వచ్చింది. నెల క్రితం వరకు రోజూ 25 వేల కేసులు నమోదైతే.. ఇప్పుడు 5 వేలకు తగ్గాయి. కేసుల్లో సెకండ్​ ప్లేస్​లో ఉన్న ఏపీలోనూ తగ్గుముఖం పట్టాయి. కర్నాటక, తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్​ వంటి రాష్ట్రాల్లోనూ 4 వేలకు మించి కేసులు రావట్లేదు. అయితే, ఢిల్లీ, కేరళలో కేసులు పెరుగుతున్నాయని కేంద్రం వెల్లడించింది.

వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు  కమిటీలు వేయాలె

కరోనాకు వ్యాక్సిన్​ అందుబాటులోకి రాగానే పంపిణీకి ఇబ్బంది పడకుండా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలు, యూటీలకు కేంద్ర హోంశాఖ సూచించింది. వ్యాక్సిన్​ పంపిణీ ఏడాది పాటు జరిగే అవకాశం ఉందని, దీనికోసం స్టేట్, డిస్ట్రిక్​ లెవెల్​ కమిటీల ఏర్పాటు, ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలని చెప్పింది. ఈ క్రమంలో రోజువారీ హెల్త్​కేర్ సర్వీసులకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పింది. టీకాను మొదట హెల్త్​ వర్కర్స్​కు ఇస్తామని తెలిపింది.  సీఎస్ అధ్యక్షతన స్టేట్ స్టీరింగ్ కమిటీ(ఎస్ఎస్ సీ), స్టేట్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ (డీటీఎఫ్) ఏర్పాటు చేయాలని చెప్పింది.

యూరప్ సెకండ్ వేవ్ సీరియస్

యూరప్​లో ఇప్పటికే సెకండ్​ వేవ్​ మొదలైంది. ఫస్ట్ ​వేవ్​తో పోలిస్తే సెకండ్​వేవ్​లోనే కేసులు ఎక్కువైతున్నాయి. గురువారం యూరప్​ మొత్తం 2,79,498 కొత్త కేసులు నమోదయ్యా యి. ఫస్ట్​వేవ్​లో అది జస్ట్​ లక్షన్నర నుంచి 2 లక్షల మధ్యే ఉండేవి. రష్యా, ఫ్రాన్స్​, స్పెయిన్, బ్రిటన్​లలోనే కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఫ్రాన్స్​లో మళ్లీ రోజూ దాదాపు 50వేల కేసులొస్తున్నాయి. స్పెయిన్, బ్రిటన్, ఇటలీ, బెల్జియం, పోలండ్​లలో రోజూ 20 వేల కు పైగా జనం కరోనా బారిన పడుతున్నారు. రష్యా, బ్రెజిల్​లో 18వేల మంది బాధితులవుతున్నారు.